ఆభరణాల మాయంపై పూజారి, ఈఓల అవినీతిపై
ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి
పూజారి ఆనంద్ శర్మను విధుల నుంచి తప్పించాలని ధార్మికసంఘాల డిమాండ్
వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని
కమిషనర్‌ను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: జోగులాంబ ఆలయంలోని ఆభరణాల మాయంపై పూజారి, ఈఓల అవినీతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపితే నిజాలు బయట పడతాయని వనపర్తికి చెందిన దూప,దీప, నైవేధ్య అర్చక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి పూజారి ఆనంద్ శర్మను విధుల నుంచి తప్పించాలని కోరారు. దీనిపై తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని దేవాదాయ కమిషనర్‌ను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మంగళవారం చేపట్టారు.
కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి ఈ నిరసనలో పాల్గొన్నారు. శక్తిపీఠాలలో ఒక పీఠం అయిన అలంపూర్ జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలని అర్చక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై క్రిమినల్ కేసులు ఉన్నందున వెంటనే సస్పెండ్ చేయాలని వారు సూచించారు. మూడు నెలలుగా ఆనంద్ శర్మ పై ఆరోపణలు వస్తున్నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహారిస్తున్నారని, వెంటనే చర్యలు చేపట్టాలని దూప,దీప, నైవేధ్య అర్చక సంఘం అధ్యక్షుడు పివి లక్ష్మీకాంతాచార్యులు, ఉపాధ్యక్షుడు నడరాజ్, బాల లింగయ్య, రవీందర్ రావు, విరాఠాచార్యులు మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు.