Wednesday, March 12, 2025

పునర్విభజనతో ఎపి, తెలంగాణలో 8 లోక్‌సభ సీట్లు గల్లంతు

- Advertisement -
- Advertisement -

జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు నష్టం
తెలుగు రాష్ట్రాలు 8 లోక్‌సభ సీట్లు కోల్పోతాయి
కాంగ్రెస్ వ్యాఖ్య

న్యూఢిల్లీ : పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం స్పందిస్తూ. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు జరిపిన, మొత్తం సంతానోత్పత్తి రేట్లను తగ్గించిన రాష్ట్రాలను ఆ ప్రక్రియ ‘శిక్షించడమే’ అవుతుందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ‘ఎక్స్’లో ఒక సుదీర్ఘ పోస్ట్‌లో తొమ్మిది రాష్ట్రాల సంగతిని ప్రధానంగా ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టిన పక్షంలో ఆ తొమ్మిది రాష్ట్రాలు ఒక్కొక్కటి ఒకటి నుంచి ఎనిమిది వరకు లోక్‌సభ సీట్లను నష్టపోవచ్చునని, కానీ ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు 11, 10 సీట్లను అధికంగా పొందగలవని ఆయన తెలిపారు.

‘సీట్లు నష్టపోయే రాష్ట్రాలు తమిళనాడు (8), కేరళ (8), ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో (8), ఒడిశా (3), పశ్చిమ బెంగాల్ (4), కర్నాటక (2), హిమాచల్ ప్రదేశ్ (1), ఉత్తరాఖండ్ (1). కాగా, అస్సాం, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర ఏ సీటునూ నష్టపోవడం లేదా అధికంగా పొందడం జరగదు’ అని ఆయన వివరించారు. ‘లబ్ధి పొందే రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ (11), బీహార్ (10), రాజస్థాన్ (6), మధ్య ప్రదేశ్ (4), ఝార్ఖండ్ (1), హర్యానా (1), గుజరాత్ (1), ఢిల్లీ (1), చండీగఢ్ (1)’ అని రమేష్ తెలియజేశారు. ఆయన తన వాదనకు సమర్ధనగా ఇద్దరు పండితులు మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్ 2001, 2011 జనాభా లెక్కల సేకరణ డేటాను ఉపయోగించి 2019 మార్చిలో చేసిన విశ్లేషణను ఉటంకించారు.

2026లో జనాభా అంచనాను ఉపయోగించినట్లయితే సీట్ల పంపిణీకి ఏమి జరుగుతుందో అది వెల్లడించింది. ‘సీట్లను నష్టపోయే రాష్ట్రాలు జాతీయ లక్షమైన కుటుంబ నియంత్రణలో విజయం సాధించడం, మొత్తం సంతానోత్పత్తి రేట్లను తగ్గించడం కారణంగా ఆ ప్రభావానికి గురవుతాయి. అవి అందు కోసం శిక్షకు గురవుతాయి’ అని రమేష్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. లోక్‌సభ సీట్ల పునర్విభజన ప్రక్రియపై ‘రాజీలేని పోరు’ సాగించేందుకు తమిళనాడుతో చేతులు కలపాలని, సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)లో భాగం కావాలని ఆహ్వానిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ తెలంగాణ, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిశా ముఖ్యమంత్రులకు గత శుక్రవారం లేఖ రాశారు. జెఎసి తొలి సమావేశాన్ని ఈ నెల 22న చెన్నైలో నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. ‘ఉమ్మడి కార్యాచరణ ప్రణాలిక’ రూపకల్పనకు భాగస్వాములు కావలసిందిగా ఆ నేతలకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News