హైదరాబాద్: మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తెలిపారు. అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగించారు. తెలంగాణ భౌగోళిక ప్రాంతమే కాదని, ఒక భావోద్వేగ ప్రాంతమని, స్థిరత్వం, దృఢసంకల్పానికి గుర్తు తెలంగాణ అని, 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పతి చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని ప్రశంసించారు. తెలంగాణకు రైతులే ఆత్మ అని, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అని జిష్షుదేవ్ వర్మ కొనియాడారు.
తెలంగాణ అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, రైతులకు మద్దతివ్వడం వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడమే తమ బాధ్యత అని, దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలియజేశారు. రైతులకు రుణమాఫీ చేశామని, ఇదే రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని, ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతులకు అందిస్తున్నామని, రైతు నేస్తం అమలు చేస్తున్నామని, వరకి రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. గేమ్‌ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం నిలిచిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణి కల్పిస్తున్నామని జిష్షుదేవ్ వర్మ వివరించారు.