Thursday, March 13, 2025

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

త్రిభాషా సూత్రం అమలుపై కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో విఫలమైనందుకు తనను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ ఎం. జయకుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తన తండ్రి నావికాదళంలో పనిచేస్తుండడం వల్ల తాను సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదివానని, అందువల్ల తమిళం నేర్చుకోవడానికి వీలుపడలేదని పేర్కొన్నాడు. అయితే న్యాయస్థానం అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు తప్పనిసరిగా తమిళం రాయడం, చదవడం నేర్చుకోవాలని, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని న్యాయస్థానం పేర్కొంది.

ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండి పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు మాతృభాష అయిన తమిళం తెలియకపోతే రోజువారీ పనులను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర భాష వచ్చి ఉండాలని లేకపోతే వారు తమ విధులను సమర్ధంగా నిర్వహించలేరని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసును ఆర్నెలలు పాటు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో భాషా యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లోభాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని , హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News