Sunday, April 13, 2025

స్థానిక భాషలకు హిందీ ఎసరు

- Advertisement -
- Advertisement -

విద్య ఉమ్మడి జాబితా అంశం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా భాషా విధానాన్ని అమలు చేయడం ఫెడరల్ వ్యవస్థకు సవాల్‌గా పరిణమి స్తుంది. 2020 జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయరాదని తమిళ నాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఆ రాష్ట్రానికి సర్వశిక్షా అభియాన్ కింద నిధులు రావడం ఆగిపోయింది. త్రిభాషా విధానాన్ని అనుసరించడం కంటే, రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కట్టుబడే స్వేచ్ఛ కలిగి ఉండడం, మరింత ప్రయోజనకరం. ఉదాహరణ కు కేరళ ప్రభుత్వం హిందీని రుద్దడం కంటే, మలయాళం, ఇంగ్లీషు, విద్యార్థి ఎంచుకున్న మరో భాషా బోధనపై దృష్టి పెడుతోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ఫిబ్రవరి 27న సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో హిందీ భాషను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల చాలా ప్రాచీన భాషలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ భాషను ప్రోత్సహించాలన్న విధానం భోజ్‌పురి, మైథిలి, అవథ్, బ్రిజ్, బుందేలి, గర్హ్వాలి, కుమావోని, మగాహి, మార్వారీ, మాల్వి, చత్తీస్ గఢి, సంతాలి, అంజిక వంచి ఉత్తరభారత భాషలను చంపివేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ హిందీ విధానం వల్ల అనేక ప్రాంతీయ, జాతిపరమైన భాషలు, మాండలికాలు కూడా ముఖ్యంగా ఈశాన్య భారతంలో కనుమరుగైపోతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ ఈశాన్య భారతంలో తూర్పున ఉన్న రాష్ట్రం.

గొప్ప సంస్కృతి, వారసత్వం, అందమైన భాషలు, మాండలికాలు మాట్లాడే తెగలకు నెలవు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఇంగ్లీషు, హిందీ అధికారిక భాషలుగా మారిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని యువతరం హిందీలో చాలా నిష్ణాతులుగా తయారయ్యారు. కానీ, తమ మాతృభాషలను మరచిపోయారు. చాలా అరుదుగా మాట్లాడుతున్నారు. ఇక నాగాలాండ్ ప్రజలకు హిందీ భాష అంటే ఏమిటో తెలియదు. నాగాలాండ్‌లో వందలాది స్థానిక, ప్రాంతీయ భాషలు ఉన్నాయి. అక్కడ హిందీ వాడకాన్ని ప్రోత్సహించడం స్థానిక భాషల అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ముఖ్యంగా విద్య, ప్రభుత్వ కమ్యూనికేషన్ రంగాలలో స్థానిక భాషల ప్రోత్సాహం తగ్గిపోయింది. దీంతో యువతరం స్థానిక భాషలు మాట్లాడడం లేదు. ఫలితంగా ఆ భాషల మనుగడకే ముప్పు ఏర్పడింది. నాగాలాండ్‌లో ఇంగ్లీషు ప్రధానంగా ఉపయోగిస్తున్నా.. హిందీ వినియోగంచాలని ఒత్తిడి కారణంగా స్థానిక భాషలు మాట్లాడేవారు తగ్గిపోతున్నారు.

ఈశాన్య భారతదేశంలోని భాషా వైవిధ్యం ఆ ప్రాంతం ప్రత్యేకత. ఆ ప్రాంతంలో పని చేస్తున్న భాషా శాస్త్రవేత్తలు, పరిశోధకులు తక్కువగా తెలిసిన, అరుదుగా పరిశోధనలు జరిగిన కొన్ని భాషలను నమోదు చేశారు. సిఐఐఎల్ వంటి సంస్థలు చిన్నభాషలను గుర్తించి రికార్డు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అయినా, నమోదు చేయాల్సిన భాషలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ కృషి జరగని పక్షంలో భాషా సంపద, విలువైన పదజాలం త్వరలోనే నశించిపోతుంది. ఈ భాషలకు ఎదురవుతున్న ముప్పు, ఇవి కనుమరుగవడానికి దారితీసే కారణాలు మనకు బాగా తెలుసు.

ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానాలు, జనగణనకు సంబంధించి భారత జనాభా లెక్కలు నిర్వహించే సంస్థల పాత్ర, స్థానిక సామాజిక -రాజకీయ పరిస్థితులు, ఈ ప్రాంతంలో ఇతర భాషల పట్ల పెరుగుతున్న మోజు, ఆధిపత్య భాషలలో హిందీ ఒకటిగా మారడం ఇవన్నీ ఇక్కడి భాషకు ముప్పు కలిగించే పరిస్థితికి దోహదపడుతున్నాయి. ఈశాన్య భారతం గొప్ప వైవిధ్యభరితమైన ప్రాంతం, చక్కటి భాషా ప్రకృతికి నెలవు. ఈ గొప్ప వారసత్వ సంపద క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. ఈశాన్యంలో దాదాపు 43 భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. వీటిలో మణిపూర్‌లోని పురుమ, తారావ్, మిజోరాంలోని బావ్మ్, రాల్దే వంటి అరుదుగా మాట్లాడే భాషలు ఉన్నాయి. పురుమ్, తారావ్ భాషలను మాట్లాడే వారు 800 మందికన్నా తక్కువగా ఉండగా, కొయిరెంగ్ భాషను మాట్లాడేవారు 2 వేల మంది కంటే మించిలేరు. ఈశాన్య రాష్ట్రాలలో ఇంగ్లీషు, హిందీ భాషలను విస్తృతంగా ఉపయోగించడం, యువకులను ఆ భాష పట్ల ఆకర్షించేటట్లు చేయడమే స్థానిక భాషలు అంతరించిపోవడానికి ప్రధాన కారణం..

అరుణాచల్‌ప్రదేశ్‌లో హిందీకి మంచి ప్రచారం కల్పించడం, నాగాలాండ్‌లో ఇంగ్లీషు భాగా ప్రాచుర్యం పొందడం కూడా ఆ స్థానిక భాషల పెరుగుదలకు కారణమవుతోంది. మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాలలో మణిపురి, బెంగాలీ భాషలను ఉపయోగిస్తుండగా,
మేఘాలయ ఖాసీ, ప్నార్, గారో వంచి భాషలను ఉపయోగిస్తాయి. మొదటి నుంచి ఈ రెండు భాషలకు ప్రాధాన్యం ఇచ్చే రెండు పాఠశాలలు ఉండడం విశేషం. మిషనరీ స్కూళ్లు, కాన్వెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలోనే బోధన ఉంటుంది. ఇక కేంద్రీయ విద్యాలయాలలో హిందీ మీడియంలోనే బోధిస్తారు. 8 ఈశాన్య రాష్ట్రాలలో దేశం ఇతర ప్రాంతాలతో పోలిస్తే జనాభా తక్కువ, భౌగోళికంగానూ చిన్నవే. అయితే భాషా, జాతి వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. ఈ ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దుల చుట్టూ ఉన్న భాషల మధ్య అస్పష్టమైన భాషా సరిహద్దులతో గుర్తింపు పొందాయి. సామాజిక – సాంస్కృతిక, రాజకీయ ప్రాతిపదికన ప్రసంగ రూపాలు చాలా భిన్నంగా ఉంటాయి.

ఈ ప్రాంతంలో మాతృభాష మాట్లాడేవారు, విద్యాసంస్థలు, భాషా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర అకాడమీలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చొరవ తీసుకుని ఆయా భాషల అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టని పక్షంలో ఈ భాషలు కనుమరుగయి పోవడం ఖాయం. ఒక భాష పునరుజ్జీవింపజేయడం అసాధ్యం కాదు, కానీ, ఆ ప్రాచుర్యం కోల్పోడానికి కారణమయ్యే అంశాలు ఏమిటో గుర్తించాలి. ఇదో సవాలే. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ కొన్ని భాషలు తమ పునరుజ్జీవనానికి కృషిచేస్తున్నాయి. ఉదాహరణకు హిబ్రూ భాష పునరుజ్జీవవం అలాంటిదే. బ్రిటన్‌లోని సౌత్ వెస్ట్ ప్రాంతంలో కార్నెష్ భాష కూడా తిరిగి జీవం పోసుకుంటోంది. ఆ భాష వినియోగం, కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభం కావడం విశేషం.

త్రిపుర స్థానిక భాష కోక్ బోరాక్. 19వ, 20వ శతాబ్దాలలో మౌఖిక గుర్తింపు మాత్రమే ఉన్నభాష. కానీ, త్రిపురలో గతంలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం పుణ్యమా అని త్రిపురలోని కోక్ బోరాక్ భాష చాలా ప్రాంతాలలో పాఠశాలల్లో బోధనా భాషగా మారింది. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రజలు తమ భాషను మాట్లాడడమే కాక, తమ వారసత్వ సంపదను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నారు. తాయ్ ఖమ్తి, నైషి, వాంచో, అకాహ్రుస్సో, గాలో, మిష్మి, లిసు వంటి కమ్యూనిటీలు లిపిని ఏర్పాటు చేసుకుని, భాష అభివృద్ధి చేసుకునేందుకు చొరవ తీసుకుంటున్నాయి. రెండు దశాబ్దాల క్రితం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కామెంట్ జిల్లాలో, అకా హ్రుస్సో కమ్యూనిటీకి చెందిన వృద్ధులు తమ మాతృభాషలోనే మాట్లాడేవారు.. పిల్లలకూ నేర్పించారు. అయినా, ముఖ్యంగా ఇప్పటితరం పిల్లలు హిందీ పట్ల మొగ్గు చూపుతున్నారు. అయినా ఆ సమాజంలో ప్రతి ఒక్కరూ అకా భాషను సరళంగా మాట్లాడతారు. యువకులు, విద్యావంతులు కూడా ప్రముఖ వ్యక్తులతో కలిసినప్పుడు, ఇంట్లో అకా భాషలోనే మాట్లాడుకోవడం తో ఈ మార్పు జరిగింది.

ఆశ్చర్యకరంగా వారిని చూసి ఇతరులు కూడా అదే భాషను అనుసరించడానికి దోహదం చేసింది. స్థానిక భాషలు, సంస్కృతులను పరిరక్షించడం కేవలం భాషా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, చరిత్రకారులు, రాజకీయ నాయకుల బాధ్యతే కాదు. సమాజంలో వ్యక్తుల బాధ్యత కూడా. సంఘాల సమష్టి బాధ్యత. భాషా పునరుజ్జీవన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా యువత వారి మాతృభాష నేర్చుకోవడానికి, మాట్లాడడానికి ప్రేరేపణ కాగలదు. స్థానిక సంస్కృతి, కథలను కాపాడడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా స్థానిక, స్థానికేతర తరాల ప్రజల భవిష్యత్‌ను శక్తివంతం చేయవచ్చు.
2020 కొత్త విద్యా విధానం, త్రిభాషా సూత్రం కింద హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలలో రాజకీయ, సామాజిక వ్యతిరేకతకు దారి తీసింది.

తమిళనాడు కొత్త విద్యా విధానాన్ని అమలు చేయకపోతే, తమిళనాడుకు రూ. 2,150 కోట్ల నిధులను నిలిపివేస్తామని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట తమిళనాడు కేంద్రం మధ్య తాజా భాషా యుద్ధానికి ఆజ్యంపోసింది. విద్య ఉమ్మడి జాబితా అంశం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా భాషా విధానాన్ని అమలు చేయడం ఫెడరల్ వ్యవస్థకు సవాల్‌గా పరిణమిస్తుంది. 2020 జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రాన్ని అమలు చేయరాదని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ఆ రాష్ట్రానికి సర్వశిక్షా అభియాన్ కింద నిధులు రావడం ఆగిపోయింది. త్రిభాషా విధానాన్ని అనుసరించడం కంటే, రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల అభివృద్ధికి కట్టుబడే స్వేచ్ఛ కలిగి ఉండడం, మరింత ప్రయోజనకరం. ఉదాహరణకు కేరళ ప్రభుత్వం హిందీని రుద్దడం కంటే, మలయాళం, ఇంగ్లీషు, విద్యార్థి ఎంచుకున్న మరో భాషా బోధనపై దృష్టి పెడుతోంది. ఉపాధ్యాయ శిక్షణను ప్రోత్సహించడం, ఇ- లర్నింగ్ వనరుల అభివృద్ధి, భాషా అధ్యయనం కోసం స్కాలర్ షిప్‌లను అందించడం వల్ల పరిస్థితి మరింత మెరుగు కాగలదు.

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అనేక భారతీయ రాష్ట్రాలలో హిందీ ప్రధాన భాషగా మారింది. ప్రాంతీయ భాషలకు ముప్పుగా మారింది. ఈ మార్పు స్థానిక భాషలు, సంస్కృతుల పరిరక్షణ గురించి ఆందోళనలకు దారితీస్తోంది. ఇందుకు విరుద్ధంగా, సింగపూర్, నైజీరియా, బోట్స్వానా వంటి దేశాలు స్వాతంత్య్రం తర్వాత ఇంగ్లీషును తమ ప్రధాన అధికార భాషగా కొనసాగిస్తూనే, ప్రాంతీయ భాషలనూ ప్రోత్సహించాయి. ఇది వివిధ స్థానిక భాషల మనుగడకు, సహజీవనం, అభివృద్ధికి అవకాశం కల్పించింది. భారతదేశం ఇలాంటి భాషా విధానాన్ని అవలంబించి ఉంటే అన్ని భారతీయ భాషలు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరో విచిత్రం ఏమిటంటే, చాలా మంది భారతీయులు కమ్యూనికేషన్ కోసం రెండో భాషను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు, ఇంగ్లీషుకు బదులు హిందీని కొన్ని సార్లు ఇష్టంగా, మరి కొన్నిసార్లు అయిష్టంగా ప్రత్యామ్నాయ భాషగా అంగీకరిస్తారు.

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News