వడోదర: గుజరాత్ రాష్ట్రం వడోదరలోని కరేలిబాగ్ ప్రాంతంలో ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన ఆమ్రపాలి చార్ రాస్తా వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన యువకుడు ముందు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొంతమంది కూడా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో హేమాలిబెన్ పటేల్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. జైని(12), నిషాబెన్(35), మరో గుర్తు తెలియని 40 ఏళ్ల పురుషుడు, 10 సంవత్సరాల పాప గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రమాదానికి కారణమైన యువకుడు రక్షిత్ రవీష్ చౌరాసియాగా గుర్తించారు. అతను ప్రమాదం జరిగిన తర్వాత కారు దిగి మద్యం మత్తులో ‘ఇంకో రౌండ్’ అంటూ.. ‘ఓం నమః శివాయ’ అంటూ కేకలు వేశాడు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న వారు రికార్డు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. సడెన్‌గా ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుందని.. అందుకే ఏం కనిపించక ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. అంతేకాక.. తాను విడుదలైన తర్వాత బాధిత కుటుంబాలను కలిసి పరామర్శిస్తా అని కూడా చెప్పాడట.