ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా వెన్ను భాగంలో గాయమైంది. అప్పటి నుంచి అతను మ్యాచ్‌లకు దూరంగా.. ఎన్‌సిఎలో ఉంటూ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ గాయం వల్లనే అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేదు.
అయితే గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ముంబై ఇండియాన్స్ ఆడే తొలి మ్యాచ్‌లకు అతను దూరం అవుతాడని సమాచారం. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా మళ్లీ జట్టుతో జత కట్టే అవకాశం ఉంది. ఆలోపు ముంబై.. చెన్నై సూపర్ కింగ్స్‌తో, గుజరాత్ టైటాన్స్‌తో, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు బుమ్రా దూరం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అతను పూర్తిగా కోలుకొని ఏప్రిల్‌లో జట్టులో చేరితే.. ఏప్రిల్ 4వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడతాడు.