ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు ముగింపును తమ ‘పవిత్ర లక్షం’గా చేసుకున్నందుకు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచ నేతలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనపై తొలిసారిగా బహిరంగంగా స్పందిస్తూ పుతన్ గురువారం ఆ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణపై చర్చించేందుకు రష్యా సిద్ధంగా ఉందని, అయితే, అటువంటి ఒప్పందానికి సంబంధించిన షరతులపై స్పష్టీకరణ కావాలపి పుతిన్ గురువారం ధ్రువీకరించారు. స్వల్ప వ్యవధి విరామాలపై మాస్కోకు ఆసక్తి లేదని నిరుడు జూలైలోనే పుతిన్ స్పష్టం చేశారని, కానీ, ఈ సంఘర్షణ కారణాలను చర్చించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ‘ఆర్‌టి’ న్యూస్ తెలియజేసింది. మంగళవారం సౌదీ అరేబియాలో తమ తమ ప్రతినిధివర్గాల మధ్య సమావేశం అనంతరం యుఎస్, ఉక్రెయిన్ రెండూ 30 రోజుల కాల్పుల విరమణ సంధిని ధ్రువీకరించాయి.
‘కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సంసిద్ధతను నేను మదింపు వేసే ముందు ఉక్రెయిన్‌లో వివాదం పరిష్కారం పట్ల అంతగా శ్రద్ధ వహించినందుకు యుఎస్ అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంటున్నాను’ అని పుతిన్ చెప్పారు. ‘మా అందరికీ తేల్చవలసిన సమస్యలు తగినన్ని ఉన్నాయి. అయితే, అనేక మంది దేశాధినేతలు చైనా అధ్యక్షుడు, భారత ప్రధాన, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రిపబ్లిక్ అధ్యక్షుడు ఈ సమస్యపై ఎంతో సమయం వెచ్చిస్తున్నారు. వారందరికీ మేము కృతజ్ఞులం, ఎందుకంటే, పోరును, మానవ ప్రాణాల నష్టాన్ని నిలిపివేయడమన్న పవిత్ర బాధ్యతను నిర్వహించడమనే లక్షంతో వారు ఉన్నారు’ అని పుతిన్ తెలిపారు. ‘ఇక, పోరు నిలుపుదల ప్రతిపాదనలకు మేము అంగీకరిస్తున్నాం. ఈ కాల్పుల విరమణ చిరకాల శాంతికి దారి తీయాలన్నది, ఈ సంక్షోభానికి కారణాలను నిర్మూలించాలన్నది మా వైఖరి’ అని పుతిన్ వివరించారు.
కాగా, నిరుడు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లో పోరు మొదలైనప్పటి నుంచి ప్రధాని మోడీ అనేక పర్యాయాలు పుతిన్‌తోను. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతోను మాట్లాడారు. మోడీ క్రితం నెల వైట్ హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం సమయంలో రష్యా, ఉక్రెయిణ్ మధ్య ఘర్షణ విషయమై తన వైఖరిపై ‘భారత్ తటస్థం కాదు’ అని స్పష్టం చేశారు. ‘భారత్ తటస్థం కాదు. భారత్ శాంతి పక్షాన ఉంటున్నది. ఇది యుద్ధ శకం కాదని అధ్యక్షుడు పుతిన్‌తో ఇప్పటికే చెప్పాను. అధ్యక్షుడు ట్రంప్ కృషిని సమర్థిస్తున్నాను’ అని ప్రధాని మోడీ తెలిపారు.