Saturday, March 15, 2025

ఉగ్రవాద కేంద్రం ఏదో ప్రపంచానికి తెలుసు

- Advertisement -
- Advertisement -

బెలూచిస్తాన్ రైలు హైజాక్ నేపథ్యంలో తాము ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నామని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ శుక్రవారం ఖండించింది. పాక్ తన ‘వైఫల్యాలకు’ ఇతరులపై నింద వేసే బదులు ఆత్మావలోకనం చేసుకోవాలని భారత్ స్పష్టం చేసింది. ‘ప్రపంచ ఉగ్రవాదానికి మూలం ఎక్కడ ఉందో’ సమస్త ప్రపంచానికి తెలుసు అని కూడా భారత్ వ్యాఖ్యానించింది. బెలూచిస్తాన్ రైలుపై దాడిలో భారత్‌ను పేరు పెట్టి ప్రస్తావించకుండా ‘ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తోంద’ని పాకిస్తాన్ గురువారం ఆరోపించింది. ఆ దాడిలో 21 మంది ప్రయాణికులు మరణించిన విషయం విదితమే. ‘పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ విస్పష్టంగా ప్రకటించారు. ఇస్లామాబాద్ ఆరోపణలపై మీడియా ప్రశ్నలకు సమాధానంగా జైశ్వాల్ ఆ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ ఆవిర్భవించిందో మొత్తం ప్రపంచానికి తెలుసు’ అని కూడా ఆయన చెప్పారు.

‘స్వీయ అంతర్గత సమస్యలకు, వైఫల్యాలకు ఇతరులను వేలెత్తి చూపే బదులు పాకిస్తాన్ ఆత్మావలోకనం చేసుకోవాలి’ అని జైశ్వాల్ కోరారు. మంగళవారం రైలుపై ప్రాణాంతక దాడిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షఫఖత్ అలీ ఖాన్‌ను మీడియా గోష్ఠిలో పలు ప్రశ్నలు ఆడిగారు. ఆ సందర్భంలో ఖాన్ భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌పై కూడా ఆరోపణలు చేశారు. బెలూచ్ వేర్పాటువాద గ్రూపులకు భారత్ మద్దతు ఇస్తున్నదని పాకిస్తాన్ తరచు ఆరోపిస్తున్నప్పటికీ, ఈ దఫా మాత్రం రైలుపై దాడికి ఆఫ్ఘనిస్తాన్ సమన్వయకర్తగా వ్యవహరించిందని ఖాన్ ఆరోపించారు. గతంలో బిఎల్‌ఎ కార్యకలాపాలకు భారత్‌ను నిందించిన కారణంగా మీ విధానంలో మార్పు ఏమైనా ఉందా అని ఖాన్‌ను మీడియా ప్రశ్నించింది. తమ విధానంలో ఏమాత్రం మార్పు లేదని పాక్ ప్రతినిధి చెప్పారు. ‘వాస్తవాలు మారలేదు. పాకిస్తాన్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో భారత్ పాత్ర ఉంది’ అని ఆయన ఆరోపించారు. అయితే, అందుకు ఎటువంటి ఆధారాన్నీ ఆయన సూచించలేదు. మరొక ప్రశ్నకు ఖాన్ సమాధానం ఇస్తూ, భారత్ తన పొరుగు దేశాల్లో అస్థిరతకు ప్రయత్నిస్తోందని, ప్రపంచ హత్యల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నదని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News