Saturday, March 15, 2025

పోలీస్ కస్టడీలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

పోలీస్ కస్టడీలో ఉన్న ఓ నిందితుడు గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. అయితే, పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక మృతి చెందాడని మృతుని కుటుంబీకులు శుక్రవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాకు చెందిన అలకుంట సంపత్ (31) శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చిరంజీవి అనే వ్యక్తితో కలిసి అమాయకులైన యువకులను థాయిలాడ్, మయన్మార్, దావోస్ తదితర విదేశాల్లో ఉద్యోగాల పేరుతో బోగస్ వీసాలు ఇప్పించి పంపిస్తున్నారని కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు సంపత్, చిరంజీవి లను అరెస్టు చేసి ఈనెల 4న రిమాండ్‌కు పంపారు.

కానీ నిందితుల వద్ద కీలకమైన విషయాలు రాబట్టడానికి తదుపరి విచారణ కోసం కస్టడీ కోరుతూ సైబర్ క్రైం పోలీసులు నిజామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిద్దరినీ రెండు రోజుల పాటు నింబంధనల మేరకు విచారించడానికి కోర్టు అనుమతించింది. దీంతో నిజామాబాద్ జైలులో ఉన్న సంపత్, చిరంజీవి లను సైబర్ క్రైం పోలీసులు ఈనెల 12న అదుపులోకి తీసుకున్నారు. సంపత్ వద్ద గల రెండు సెల్‌ఫోన్ లలో కీలకమైన సమాచారం ఉన్నట్లు వెల్లడించడంతో జగిత్యాలలోని అతని ఇల్లు, శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ఆఫీస్‌లో సోదాలు చేసి ఆ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు సంపత్, చిరంజీవిలను తీసుకొని గురువారం రాత్రి నిజామాబాద్‌కు చేరుకున్నారు. నిజామాబాద్ వచ్చిన కొద్దిసేపటికి సంపత్ తనకు ఎడమ చేయి తీవ్ర నొప్పి ఉందని సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బందికి చెప్పడంతో అతనిని హుటాహుటిన రాత్రి 10 గంటల సమయంలో నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో సంపత్ నడుచుకుంటునే ఆస్పత్రిలోకి వచ్చాడు. ఎమర్జెన్సీ వార్డులో సంపత్‌కు చికిత్స చేయడానికి ముందే తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.

పోలీసులు సిపిఆర్ చేసిన్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో సంపత్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించడంతో పోలీసులు వెంటనే అతని కుటుంబ సభ్యులకు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సమాచారం ఇచ్చారు. దీంతో వారంతా హుటాహుటిన నిజామాబాద్ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి విలపించారు. పోలీసులు తీవ్రంగా చిత్రహింసలకు గురిచేయడం వల్లే సంపత్ మృతి చెందాడని ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలను తట్టుకోలేకపోవడంతో సంపత్‌కు పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చారని మృతుని కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు తనను తీవ్రంగా కొడుతున్నారని తన భర్త స్వయంగా ఫోన్ చేసి చెప్పాడని మృతుని భార్య విలపించింది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు బైఠాయించారు.

అనారోగ్యంతో సంపత్ మృతి ః సిపి
రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంపత్‌ను పోలీసులు కొట్టలేదని, అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశామని అన్నారు. డిఎస్‌పి స్థాయి అధికారి అనుమతితో తదుపరి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం మార్గదర్శకాల మేరకే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రాథమిక మానవ హక్కుల సంఘానికి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలోనే పంచనామా నిర్వహించామని, ముగ్గురు డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించామని, ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేసినట్లు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News