కెనడా నూతన ప్రధానిగా మాజీ సెంట్రల్ బ్యాంకర్ మార్క్ కార్నీ(59) శుక్రవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మార్క్ కార్నీ ఇకపై ప్రధాని జస్టిన్ ట్రూడో స్థానాన్ని భర్తీ చేయనున్నారు. కొన్ని రోజుల్లో లేక వారాల్లో ఆయన సార్వత్రిక ఎన్నికలు చేపట్టనున్నారు. కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో కలుపుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే హెచ్చరికలు చేశారు. పైగా కెనడా మీద వాణిజ్య యుద్ధాన్ని కూడా మొదలెట్టారు. ఈ నేపథ్యంలో కెనడాకు మార్క్ కార్నీ సారథ్యం వహించబోతున్నారు. ‘కెనడా సార్వభౌమాధికారానికి గౌరవం ఇచ్చేట్లయితేనే నేను ట్రంప్‌తో సమావేశం అవుతాను’ అని కార్నీ స్పష్టం చేశారు. అమెరికా ఇప్పటికే కెనడా స్టీల్, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధించింది.
కార్నీ 2008లో ‘బ్యాంక్ ఆఫ్ కెనడా’ను సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఆ తర్వాత 2013లో నాన్‌సిటిజెన్‌గా ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్’కు హెడ్‌గా పనిచేశారు. అప్పట్లో ఇంగ్లాండ్‌ను ‘బ్రెక్సిట్’ సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఇదిలావుండగా కెనడా మాజీ ప్రధాని జీన్ క్రిస్టీన్ ‘కార్నీ బాగా పనిచేస్తారు. ఆయనకి అంతర్జాతీయంగా మంచి గౌరవం ఉంది. ఇప్పుడున్నది సాధారణ వాతావరణమేమి కాదు. ఈ నేపథ్యంలో ఎలాంటి మ్యాజిక్ పరిష్కారమూ లేదు. ప్రతి ఐదు నిమిషాలకు ఆలోచన మార్చుకునే అమెరికా అధ్యక్షుడి వంటి వారిని మేము ఎన్నడూ చూడలేదు. ట్రంప్ కెనడాకే కాక ప్రతిచోట సమస్యలు సృష్టిస్తున్నాడు’ అన్నారు.