టికెట్లు తీసేందుకు ఆర్‌టిసి ప్రైవేట్ బస్సును పక్కకు ఆపే క్రమంలో పల్టీ పడి 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, పరిగిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. పరిగి ఆర్‌టిసి డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు శుక్రవారం రాత్రి 7.15 నిముషాలకు పరిగి నుంచి షాద్‌నగర్ బస్సు బయలుదేరింది. పరిగిలో శుక్రవారం మార్కెట్ కావడంతో 80 మంది వరకు బస్సులో ప్రయాణికులు ఉన్నారు. పరిగి మున్సిపల్ పరిధి దాటాక సయ్యద్ మల్కాపూర్ గ్రామం సమీపం వద్ద టికెట్లు తీసుకునేందుకు బస్సును రోడ్డు పక్కకు డ్రైవర్ ఆపాలనుకున్నాడు. ఇటీవలే రోడ్డు వేసి క్రమంలో ఎత్తు పెంచారు. రోడ్డు పక్కన సైడ్ బర్మ్ మట్టి వేసినప్పటికీ గుంతగా ఉంది. ఈ విషయాన్ని గమనించకుండా ఆర్‌టిసి డ్రైవర్ బస్సును పక్కకు దింపే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా పక్కనే గుంతలో బస్సు అదుపుతప్పి పల్టీ పడడంతో ప్రయాణికులు ఒకరికిపై ఒకరు పడ్డారు. వీరిలో ఐదుగురికీ తీవ్రంగా, మరో 30 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే పరిగి ప్రభుత్వ తరలించారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకున్నారు. కాగా, ఆర్‌టిసి డ్రైవర్ పర్వతాలు తన పక్కన ఓ మహిళతో జోకులు చేస్తూ మాట్లాడుతూ.. అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ సత్యనారాయణ డ్రైవర్‌తో ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ అంటూ ఆ మహిళను నిలదీసినా వినకపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వల్ప గాయాలతోనే బతికి బయటపడ్డామని.. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని వాపోయారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పర్వతాలుపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సంతోష్ కుమార్ సిబ్బందితో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆర్‌టిసి యాజమాన్యంతో మాట్లాడి మరో బస్సు సౌకర్యం కల్పించి ప్రయాణికులను గమ్యానికి చేరవేశారు.