Sunday, March 16, 2025

దార్శనికుడు ఫాదర్ కొలంబో

- Advertisement -
- Advertisement -

ఫాదర్ అగస్టో కొలంబో (జననం 15 మార్చి 1927 మరణం 31 ఆగస్టు 2009) ఉత్తర ఇటలీలోని కోమో ప్రావిన్స్‌లోని కాంటూ అనే చిన్న పట్టణంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం లో జన్మించారు. 1952లో భారత దేశానికి బయలుదేరారు. పిఐఎంఇ (పొంటిఫికల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫారిన్ మిషన్స్) సంస్థ 1855 నుండి పని చేస్తోంది. ఆ సంవత్సరాల్లోనే భారతదేశంలోని సామాజిక అణచివేత గురికాబడినవారు బౌద్ధమతం, క్రైస్తవ మతం వైపు మొగ్గుచూపుతున్నారు. అగస్టో మూడు పారిష్‌లతో కూడిన ఖమ్మం డయోసెస్ (1988) స్థాపకుల్లో ఒకరు. భారతదేశంలో దాదాపు అరవై సంవత్సరాల మిషన్‌లో, అతను మతసంబంధమైన పనితోపాటు, దీనులకు, అభాగ్యులకు, కడుపేదవారి ప్రోత్సాహానికి అనేక కార్యక్రమాలను రూపొందించాడు.పేదలకు గృహాలు, సాంప్రదాయ చేతిపనుల ఉత్పత్తి , అమ్మకాలకు సహకార సంస్థలు, దళితుల భూములకు చట్టపరమైన రక్షణకు అతని నిబద్ధత, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాడటానికి గ్రామీణ బ్యాంకులు, కుష్టురోగులకు ఆరోగ్య సంరక్షణ, విద్య, అక్షరాస్యతను మొదలైనవి కల్పించుటలో కొలంబో బడుగు బలహీనర్గాలకు దగ్గర అయ్యారు. ఫాదర్ కొలంబో పేరు వినగానే వారిని ప్రత్యక్షంగా చూసిన వారికి నీతినిజాయితీ, క్రమశిక్షణ, సేవాగుణం, దయాగుణం, ప్రేమ, సహనం, మనుషుల్ని మనుషులుగా ప్రేమించడం లాంటి సుగుణాలు గుర్తుకొస్తాయి. ఫాదర్ కొలంబో తెలుగు నేలపై నిశ్శబ్ద సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో విజయం సాధించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్యని అందించడంతోపాటు ఎంతోమంది నిరుపేద, సామాజికంగా వెలివేయబడినటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను, దీనులను చేరదీసి వారికి సామాజిక, ఆర్థిక భద్రతను కల్పిస్తూ ఎన్నో వేల కుటుంబాలల్లో వెలుగులు నింపడం జరిగింది. ఫాదర్ కొలంబో ఒక వ్యక్తి సమాజంలో ఎంతైనా మార్పు తీసుకురాగలరు అని నిరూపించగలిగారు. వారు సైకిల్‌పైన గ్రామగ్రామాలని తిరుగుతూ గ్రామంలో ఉన్న చివరి పేదగుడిసె దగ్గరికి వెళ్లి వారితో దైవ సేవ చేస్తూనే పేదరిక నిర్మూలన ప్రణాళికలను రచిస్తూ, పేద రైతులకు సబ్సిడీ పైన విద్యుత్ మోటార్లు, డీజిల్ మోటార్లు ఇవ్వడం వారు తీసుకున్న వస్తువులకు నామమాత్రపు ధరని వాయిదా పద్ధతులలో వసూలు చేస్తూ అలా బావిలను త్రవ్వించటం, వ్యవసాయ అనుబంధ పరికరాల్ని అందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు స్టేషన్‌ఘన్‌పూర్ పరిసర గ్రామాల్లో చేయటం జరిగింది. వారికి విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ వారి పిల్లల్ని పాఠశాలలకు పంపే విధంగా ప్రోత్సహించేవారు. పేదలు గృహాలు నిర్మించుకోవడానికి రేకులను సహాయం చేయడం, ఇటుకలను కొనివ్వడం పేదల గృహ నిర్మాణానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించేవారు. ఎంతో మంది పేదలు గుడిసెల్లో కాకుండా పక్కా ఇండ్లలో నివసించడానికి అతని ఆలోచనలు, అతను కల్పించిన సదుపాయాలు నేటికీ చెక్కుచెదరకుండా పేదలకు ఉపయోగపడుతున్నాయి. తను నిర్మించిన ఆసుపత్రులు నేటికీ పనిచేస్తున్నాయి. నిరుపేదల సంక్షేమానికి విద్యయే మార్గంగా అడుగులు వేసిన -కొలంబో విదేశీయుడు అయినా నిస్వార్థమైన సేవా దృక్పథాన్ని చూపిస్తూ మన ప్రాంతవాసుల భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యడం కోసం కృషిచేశారు. వ్యక్తిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అనేది ఎంత వాస్తవమో, ఆ విధంగా మన ప్రాంతవాసులను మహోన్నతులుగా తీర్చిదిద్దుటకు కొలంబో సమాజం పట్ల ప్రేమ తో, అంకితభావంతో సేవచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు స్థాపించిన కళాశాలలో, పాఠశాలలో ప్రవేశాలకు ఎంతో పోటీపడేవారు. పేదలకు అనుగుణంగా కార్పొరేట్ విద్యని పేదల స్థాయికి తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు ఫాదర్ కొలంబో కరుణాపురంలో జెఎన్‌జె కళాశాల విద్యానికేతన్ కళాశాల, పాఠశాల వరంగల్ మెడికల్ కళాశాల, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాఠశాలలు, కళాశాల, యశ్వాన్తపూర్‌లో ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపించి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం ద్వారా అక్కడ చదివిన ఎంతో మంది పేద విద్యార్థులు నేడు ఎన్నో ఉన్నత స్థాయి శిఖరాలను అధిరోహించడం జరిగింది. కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి అతి తక్కువ ఫీజులు, పేదలకు ఫీజుల రాయితీలు కల్పించేవారు. ప్రతి సంవత్సరం 1700 మందికి పైగా గ్రామీణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను సంపాదించడానికి సేవలందిస్తోంది. ఫాతిమా చారిటబుల్ ట్రస్ట్‌ని స్థాపించి దాని ద్వారా శాశ్వతంగా పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శం. చిన్నతనం నుండే సామాజిక స్పృహ దైవభక్తి మెండుగా ఉండేవి. వారు నిర్మించిన బిల్డింగులు నేడు ప్రభుత్వ గురుకుల పాఠశాలలుగా వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. వారు ఒక ఇంజనీర్‌గా, ఒక డాక్టర్ గా, ఒక శిల్పిగా వారు నిర్మించిన బిల్డింగ్‌లు సజీవ సాక్షాలు. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన బిల్డింగులు కూడా నేడు పటిష్టమైన స్థితిలో ఉండి వేల మంది విద్యార్థులకు వసతి గృహాలుగా సేవలందిస్తున్నాయి. వారి ఆశయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే వారి ఆత్మీయ వారసుడు ఫాదర్ సుధాకర్ రెడ్డి కృషి అభినందనీయం. వారు లేరనే లోటే కానీ, వారి ఆశయాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జన్మదినం సందర్భంగా ఘనంగా నివాళులు సమర్పిస్తున్నాం.

(నేడు ఫాదర్ అగస్టో కొలంబో జయంతి)

– పి. రవికుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News