ఓటర్ల జాబితా డేటాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆధార్‌తో వోటర్ గుర్తింపు కార్డులను అనుసంధానం చేసే అంశంపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శితో సమావేశాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఓటర్లకు డూప్లికేట్ వోటర్ కార్డు సంఖ్యలు కేటాయించిన కేసులను ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ప్రస్తావిస్తూ, బిజెపికి సాయం చేయడానికే ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తున్నదని ఆరోపించింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇటీవల లోక్‌సభలో ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డూప్లికేట్ కార్డు నంబర్ల అంశం ‘వారసత్వంగా వస్తున్నద’ని ఎన్నికల కమిషన్ (ఇసి) పేర్కొంటూ,
రానున్న మూడు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. డూప్లికేట్ నంబర్లు తప్పనిసరిగా బోగస్ ఓటర్లకు సూచిక కాదని కూడా ఇసి స్పష్టం చేసింది. సిఇసి కుమార్ మంగళవారం హోమ్ శాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల విభాగం కార్యదర్శి, యుఐడిఎఐ సిఇఒతో ఈ అంశంపై చర్చిస్తారని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితాలను ఆధార్ డేటాబేస్‌తో అనుసంధానించేందుకు చట్టం అనుమతిస్తోంది. ఆధార్, ఓటర్ కార్డు ఆనుసంధానం ప్రక్రియకు ఎటువంటి లక్షాన్నీ లేదా గడువులనూ నిర్దేశించలేదని ప్రభుత్వం పార్లమెంట్లో తెలియజేసింది. ఓటర్ల జాబితాలతో తమ ఆధార్ వివరాలను అనుసంధానించని వ్యక్తుల పేర్లను వోటర్ల జాబితాల్లో నుంచి తొలగించబోరని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.