సైబర్ నేరస్థులు రోజుకు ఒక కొత్త వేషం వేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపలే బ్యాంకు ఖాతాలను ఊడ్చివేస్తున్నారు.సైబర్ మోసాలపై జనంలో అవగాహన పెరుగుతున్న కొద్దీ మరొక కొత్త పద్ధతిలో దోచుకుంటున్నారు. తాజాగా ‘కాల్ మెర్జింగ్’ పేరుతో సరికొత్త మోసానికి తెర లేపారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కేవలం ఒక నిమిషం సేపు మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వివిధ మార్గాల్లో సేకరించి పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. రాంగ్ కాల్ కావచ్చునని సరిపెట్టుకునే లోపే బ్యాంకుల నుంచి వచ్చే మెసేజ్‌లతో జరిగిన మోసం అర్థం అవుతుంది.
ఏమిటీ కాల్ మెర్జింగ్ స్కామ్?
ముందుగా మీ పాత స్నేహితుడినినని అంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మీ కాంటాక్ట్‌లోని ఒక వ్యక్తి పేరు చెప్పి మనం మనం స్నేహితులమని, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఆ తరువాత సదరు స్నేహితునితో మాట్లాడదామని, తనతో కాల్ చేయిస్తాను, కాన్ఫరెన్స్ పెట్టండని కోరుతారు. కొన్ని క్షణాల్లో మీకు మరొక కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్‌లో పెట్టగానే ఒటిపి వినపడుతుంది. అంతే& ఆ తరువాత కాల్ కట్ అవుతుంది. వాస్తవానికి జరిగేది ఏమిటంటే& మీకు ఫోన్ చేసిన సైబర్ నేరస్థుడు ముందే మీ క్రెడిట్ కార్డు వివరాలు
లేదా బ్యాంకు ఖాతా వివరాలను షాపింగ్ సైట్‌లో ఎంటర్ చేసి సిద్ధంగా ఉంటాడు. ఒటిపి వివరాలను కాల్‌లో చెప్పే ఆప్షన్ ఎంచుకుంటాడు. దీనితో బ్యాంకు నుంచి మీకు కాల్ వస్తుంది. ఆ కాల్ మీ స్నేహితుడిదని నమ్మించి కాల్ మెర్జింగ్ చేయవలసిందిగా సైబర్ నేరస్థుడు అడుగుతాడు. అది నమ్మి కాల్ మెర్జ్ చేయగానే ఒటిపి నంబర్ వినిపిస్తుంది. దానిని గ్రహించిన తరువాత సైబర్ నేరస్థుడు ఫోన్ పెట్టేస్తాడు. ఒటిపిని ఎంటర్ చేసి షాపింగ్ పూర్తి చేస్తాడు. దీనితో షాపింగ్ చేసిన వస్తువులేమో సైబర్ నేరస్ఘుడికి, దాని తాలూకు బిల్లు మీకు అందుతాయి.
ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?
కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాల్ మెర్జింగ్ చేయాలని అడిగితే విడిగా మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేయాలి. ఒక వేళ కాల్ మెర్జింగ్ చేస్తే మొదటి కాల్‌ను హోల్డ్‌లో పెట్టాలి. దీని వల్ల బ్యాంకు నుంచి వచ్చే ఫోన్ కాల్ సంభాషణను సైబర్ నేరస్థుడు వినలేదు. ఒటిపి వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు. దీనితో బ్యాంకు ఖాతాలోని మీ సొమ్ము భద్రంగా ఉంటుంది.