అమెరికా ప్రెసిడెంట్ గా రెండో సారి బాధ్యతలు చేపట్టిన డ్రోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భద్రత విషయంలో రాజీలేని నిర్ణయాల్లో భాగంగా 41 దేశాలను ప్రయాణ నిషేధ జాబితాలో చేర్చారు. జాతీయ భద్రతా పరమైన ముప్పును గుర్తించడానికి అమెరికాలో ప్రవేశం కోరే విదేశీయులందరికీ తీవ్రంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని జనవరి 20నే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ జారీ చేసిన ట్రంప్ 41 దేశాలపై కొత్తగా ట్రావెల్ బ్యాన్ విధించారు.తాజాగా జారీ అయిన మెమోలో 41 దేశాలనూ మూడు ప్రత్యేక గ్రూప్ లుగా విభజించారు. వీటిలో ముఖ్యంగా ముస్లిందేశాలు ఇరాన్, ఆఫ్గనిస్తాన్, సిరియా, గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, యెమన్,తో పాటు క్యూబా, ఉత్తర కొరియా వంటివి ఉన్నాయి. ఈ దేశాల విషయంలో పూర్తిగా వీసాలను సస్పెన్షన్ చేస్తారు.రెండో గ్రూప్ లో దక్షిణ సుడాన్, హైతీ, లావోస్, ఎరిట్రియా వంటి ఐదు దేశాలు ఉన్నాయి. ఈ దేశాల వీసాలపై పాక్షిక సస్పెన్షన్ ఉంటుంది.
ఈ దేశాలకు పర్యాటక వీసాలు, విద్యార్థి వీసాలతో పాటు వలస వీసాలపై తీవ్ర ప్రభావమే ఉంటుంది. కొన్ని మినహాయింపులు ఇచ్చే వెసులుబాటు లేకపోలేదు.మూడో గ్రూప్ లో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ సహా 26 దేశాలు ఉన్నాయి. అయితే చిన్న మెలిక పెట్టారు. ఆయా దేశాల ప్రభుత్వాలు 60 రోజులలోపు లోపాలను పరిష్కరించడానికి కృషి చేయని పక్షంలో అమెరికా వీసా జారీని పాక్షికంగా నిలిపివేసే విషయాన్ని పరిశీలిస్తామని మెమోలో స్పష్టం చేశారు.ఈ జాబితాను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో సహా, అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఆమోదించవలసి ఉంది. అందువల్ల ఈ లోగా జాబితాలో కొన్ని మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.డోనాల్డ్ ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏడు ముస్లిమ్ దేశాల ప్రయాణికులపై మొదటసారి నిషేధం విధించారు. ఈ విధానాన్ని 2018లో అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించే ముందు అనేక మార్పులు జరిగాయి.