Sunday, March 16, 2025

డీలిమిటేషన్‌పై దుష్పప్రచారం

- Advertisement -
- Advertisement -

దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని
విపక్షాల తప్పుడు ప్రచారం
2009నాటి కాంగ్రెస్ విధానాలే
ఇంకా కొనసాగుతున్నాయి
బలవంతంగా హిందీని ఎక్కడా
రుద్దడం లేదు ఆధునీకరించిన
బేగంపేట రైల్వేస్టేషన్ త్వరలో
జాతికి అంకితం: కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయనేది ప్రతిపక్షాల దుష్ప్రచారం మాత్రమే అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని వెల్లడించా రు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానమే రాలేదని స్పష్టత ఇ చ్చారు. శనివారం రైల్వే ఎంజీ అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి కిషన్ రెడ్డి బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృదిధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్రిభాషా పాలసీ అనేది కొత్తదేమీ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటీ నుంచి ఈ విధానం కొనసాగుతుందని తెలిపారు. నచ్చిన భాషలో చదువుకోవచ్చునని, దేశంలో ఎక్కడా హిందీ భాషను బలవంతంగా రుద్దడం లేదని వివరించారు. తమిళనాడులో త్రిభాషా వివాదం రగులుకోవడం,

రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి రూపాయి చిహ్నాన్ని స్టాలిన్ ప్రభుత్వం తొలగించిన అంశం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన నేపధ్యంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల్లో కూడా మాతృభాషలోనే మాట్లాడుతారని అన్నారు. డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, దేశంలో నూతన విద్యా విధానం వచ్చాక మాతృభాషకు ప్రోత్సాహం ఇచ్చామని వివరించారు. అయితే తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ప్రజలను రెచ్చ కొట్టి అధికారం చేపట్టడం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాలలో తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని సినిమాలు దేశ వ్యాప్తంగా మంచి ఫలితాలు అందిస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గ పునర్విభజనపై కొత్త నియమాలు రాలేదని, ఇంకా జనగణన జరగలేదని తెలిపారు. ఈ అంశంపై ఏబిసిడిలు తెలియని సీఎం రేవంత్ యుద్ధం చేసామని అంటున్నారని ఎద్దేవా చేశారు. దక్షిణ భారత ప్రజలు చైతన్యవంతులై అక్షరాస్యత పెరిగిందని, మీ పిచ్చి మాటలు నమ్మరని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నమ్మరని కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి : కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై బిజెపి ఎంఎల్‌ఎలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంఎల్‌ఎలతో కిషన్‌రెడ్డి శనివారం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా గళమెత్తాలని సూచించారు. సభలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష విషయంలో నిబంధనలకు విరుద్ధంగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. మాట్లాడాలనుకునే అంశాన్ని ముందుగానే నిర్ణయించుకొని ఎవరు ఏ అంశంపై మాట్లాడాలో ప్రణాళిక చేసుకొని అసెంబ్లీలో మాట్లాడే విధంగా సన్నద్ధం కావాలని కిషన్ రెడ్డి సూచించారు.

పూర్తికావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ
ఆమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే జాతికి అంకితం చేయనున్నామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన బేగంపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కొనసాగుతున్న మొదటి దశ ఆధునీకరణ పనులను పరిశీలించారు. కేంద్ర మంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. కొత్త స్టేషన్ భవనం, ముఖద్వారం, ప్లాట్‌ఫామ్ ఉపరితల ఎత్తు పెంపు , 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, బుకింగ్ కౌంటర్లు, సైనేజీలు, వెయిటింగ్ హాల్ తదితర పనులు పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో మీడియాను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైళ్ల అభివృద్ధి భారీ స్థాయిలో రూపాంతరం చెందుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దశలవారీగా రూ.38 కోట్ల వ్యయంతో విమానాశ్రయ ప్రమాణాలకు సమానంగా స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన బేగంపేట అమృత్ స్టేషన్‌ను పూర్తిగా మహిళా సిబ్బందితో నిర్వహిస్తారని ఆయన అన్నారు. 2025–.26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో రూ. 5,337 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. విద్యుదీకరణ, కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ మొదలైన వాటితో సహా రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.39,300 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రైల్వే నెట్‌వర్క్ ఇప్పుడు 100 శాతం విద్యుదీకరణ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. త్వరలో సికింద్రాబాద్‌లో ’కవచ్’ పరిశోధన సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ టెక్నాలజీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News