జర్నలిస్టుల ముసుగులో మమ్మల్ని, మా ఆడబిడ్డలను అవమానిస్తే
క్షమించే ప్రసక్తే లేదు..ఉప్పుపాతరేస్తాం ఆ భాష వింటుంటే
రక్తం మరుగుతోంది జర్నలిస్టు అనే పదానికి అర్థం ఏమిటో
పాత్రికేయ సంఘాలే చెప్పాలి ఎవరు జర్నలిస్టులో ఓ జాబితా
ఇవ్వండి మిగతా వాళ్లు హద్దు మీరితే క్రిమినల్ చర్యలు తప్పవు
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: సోషల్ మీడియాలో హద్దు మీరుతున్న వారిని బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిచారు. జర్నలిస్టు రేవతి అరెస్టు విషయంలో బిఆర్‌ఎస్ వైఖరిపై సిఎం మండిపడ్డారు. అసెంబ్లీలో శనివారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులోనే పెట్టి వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు పెడితే వాటిపై పోలీసుల కేసు పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారన్నారు. దానికి బిఆర్‌ఎస్ నేతలకు దుఃఖం వస్తుందని, సోషల్ మీడియాలో వాళ్లు పెట్టిన భాష ఓ సారి వినాలని ఆయన సూచించారు. జర్నలిస్టుల ముసుగులో మమ్మల్నీ మా ఇంట్లోని మహిళలపై ఇష్టారీతిలో తిట్టిస్తున్నారని బిఆర్‌ఎస్‌పై ఆయన ఫైర్ అయ్యారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం. ఆ భాష వింటే రక్తం మరుగుతుంది.కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే మీరు అసలు మనుషులేనా? మీకు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే మీరు వింటారా? అని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా భార్యను, నా బిడ్డను తిడుతుంటే నాకు నొప్పి అవుతుందని సిఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఓ ఆడబిడ్డను అవమానిస్తుంటే మీకు నొప్పికాదా? ఏ సంస్కృతిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా చెబుతున్నా ఒక్కోక్కరి తోడ్కలు తీస్తా. రాజకీయ జీవితంలో ఉన్నది మేము మమ్మల్ని విమర్శించండి. మా పనితీరుపై విశ్లేషించాలని ఆయన సూచించారు. ఆ రకమైన భాషను ఆడపిల్లలే రికార్డు చేయించి తమ ప్లాట్ ఫాంలపై పోస్టులు చేస్తే ఇది మంచి పద్ధతా అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఇలాంటి వారు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటామనుకుంటున్నారేమో అవసరం అయితే చట్టాన్ని సవరిస్తామన్నారు. వాటిని క్షమించే ప్రసక్తే లేదని, ఉప్పుపాతరేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎక్కడో దగ్గర దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని, స్పీకర్ అనుమతితో ఒక రోజు దీనిపై చర్చ చేద్దామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. దీనికి పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుందని సిఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి ఆవేదన కాదు, ఇది అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలని సిఎం అన్నారు.
కెసిఆర్.. ఈ పద్ధతి మంచిది కాదు
కెసిఆర్ తన పిల్లలకు బుద్ధి చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. తిట్టించి మానసికింగా దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చని నీవ్వేమైనా కలలు కంటున్నావేమో అది కుదరదు కెసిఆర్ అని సిఎం రేవంత్ అన్నారు. హద్దుమీరి మాట్లాడితే దాని ఫలితం అనుభవిస్తారని, పదవి ఎంతకాలం ఉన్నామనేది కాదు ఎలా పదవిలో ఉన్నామన్నది తాను లెక్కకడుతానని, ఆత్మగౌరవం చంపుకొని పదవికోసం లాలూచిపడే రాజకీయం తాను చేయనని ఆయన తెలిపారు.