అసత్యాలను పదే పదే వల్లెవేస్తే అవే వాస్తవాలవుతాయనే భ్రమల్లో ప్రతిపక్షాలున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే అభద్రతా భావంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ నిరాధార అవాస్తవ ఆరోపణలతో బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేని ఈ పార్టీలు కలిసికట్టుగా కుట్రలు పన్నుతున్నాయి. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ సంక్షేమానికి పాటుపడేది ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణకు పదేళ్ల బిఆర్‌స్ పాలనలో, కేంద్రంలో పదకొండేళ్ల బిజెపి పాలనలో తీవ్రఅన్యాయమే జరిగింది. రాష్ర్ట విభజన అనంతరం కేంద్రం నుండి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు, హక్కులపై బిజెపి ప్రభుత్వం వివక్ష చూపించినా పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చోద్యంచూస్తూ కాలం గడిపింది. బిఆర్‌ఎస్ హయాంలో పాడిందే పాట, ఆడిందే ఆటగా కేంద్రంలోని బిజెపి తెలంగాణకు అన్యాయం చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై కేంద్రాన్ని నిలదీస్తుంటే ఈ పార్టీలు తట్టుకోలేక ప్రభుత్వంపై అవాస్తవాలతో ఎదురుదాడి చేస్తున్నాయి. తెలంగాణ అభివృద్ధికోసం కేంద్రాన్ని రాష్ర్ట ప్రభుత్వం సంప్రదించడం లేదని ఒకపక్క బిజెపి విమర్శిస్తుంటే, సిఎం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని మరోపక్క బిఆర్‌ఎస్ ఆరోపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీని కలవకపోతే ఒకరు, కలిస్తే మరొకరు విమర్శించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం.
తెలంగాణ హక్కుల సాధనకోసం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని నిలదీస్తుంటే రాష్ర్ట బిజెపి నేతలు ఇక్కడ భుజాలు తడుముకుంటున్నారు. రాష్ర్ట విభజన హామీలు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రీజినల్ రింగ్ రోడ్డు, వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కు, నవోదయ స్కూళ్లు, ఐఐఎం మొదలుగు వాటి గురించి ఎన్నిసార్లు కోరినా స్పందన లేదు. రాష్ర్ట నుండి ఒత్తిడి రావడంతో త్వరలో ఆర్‌ఆర్‌ఆర్‌కు మోడీ శంకుస్థాపన చేస్తారని బిజెపి నేతలు ప్రకటనలు చేయడం సంతోషకరం. రాష్ట్రానికి సంబంధించిన 28 ప్రధానమైన ప్రాజెక్టులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రేడియల్ రోడ్డు, మెట్రో రెండో దశ, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో డ్రెయినేజీ వ్యవస్థ పనులు, హైదరాబాద్ బందర్ హైవే పనులు, మూసీ రివర్ ఫ్రంట్, గోదావరి మూసీ లింకు, పవర్ గ్రిడ్ పనులున్నాయి. విభజన హామీల్లో భాగంగా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరితే సాంకేతిక కారణాలు చూపుతూ ప్రభుత్వం పరిశీలనలో లేదని రాజ్యసభలో తెలపడం రాష్ర్టంపై కేంద్రం చూపిస్తున్న వివక్షకు నిదర్శనం. న్యాయంగా రావాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తే మమ్మల్ని అడిగి హామీలిచ్చారా అంటూ ఎదురు ప్రశ్నించడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికే చెల్లింది. దేశం లో ఒక పార్టీ మరో పార్టీని అడిగి హామీలిస్తుందా..? బిజెపి ఇతర రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలను అడిగి హామీలిస్తుందా..? రాష్ర్టం నుండి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్న పన్నుల్లో తెలంగాణలకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోరుతున్నాం. విభజన హామీలను డిమాండ్ చేస్తున్నాం. అంతేకానీ కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది భిక్షకాదని బిజెపి నేతలు గ్రహించాలి. విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రో ప్రాజెక్టు, మూసీ సుందరీకరణ కోసం కేంద్రం నుండి నిధులు రాబట్టాల్సిన రాష్ర్ట బిజెపి నేతలు కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేయడం తెలంగాణ అభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధి తెలియజేస్తుంది. కేంద్రంలోని బిజెపి తమ హామీలను నెరవేర్చదు కానీ, రాష్ర్ట ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని విమర్శించడం విడ్డూరం.
పదేళ్లు తెలంగాణను పాలించి రాష్ట్రాన్ని దివాళా తీయించిన బిఆర్‌ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ 15 నెలల్లో చేసిన అభివృద్ధిని తట్టుకోలేక అల్లకల్లోలం అంటూ రాద్ధాంతం చేస్తోంది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా బాధ్యతారాహిత్యంగా ఉండే కెసిఆర్ అడపాదడపా ఫాంహౌస్ బయటకు వస్తూ ఏదో ఒక ప్రకటన చేస్తూ హడావుడి చేయడం తప్ప రాష్ర్ట ప్రయోజనాలను ఏనాడు పట్టించుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళాశక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం, ఉచిత బస్సు ప్రయాణంతో రోజూ 30 లక్షల మంది మహిళలకు, గ్యాస్ సబ్సిడీతో 40 లక్షల కుటుంబాలకు, ఉచిత విద్యుత్‌తో 50 లక్షల కుటుంబాలకు, ఆరోగ్యశ్రీ పెంపుతో నిరుపేదలకు ప్రయోజనం కలుగుతున్నా ఇవి అభివృద్ధిగా, హామీలను నెరవేర్చినట్టుగా ప్రతిపక్షాలకు కనిపించడం లేదు. రైతు రుణమాఫీతో 22.50 లక్షల మంది ప్రయోజనం పొందారు. గతంలో రైతుబంధు రూ. 10 వేలు ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్ రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇస్తుంది. 4 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, 40 లక్షల మందికి రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నా ప్రతిపక్షాలు వాటిని కప్పిపుచ్చుతూ హామీలను నెరవేర్చలేదని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కెసిఆర్ తమ కుటుంబసభ్యులకే రాజకీయ ఉపాధి ఇచ్చుకున్నారు కానీ, యువతను పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే 55 వేలకు పైగా నియామకాలు చేపట్టి రికార్డు సృష్టిస్తే ప్రతిపక్షాలు అరిగిపోయిన రికార్డులా ప్రభుత్వాన్ని విమర్శిస్త్తున్నాయి.
రాష్ర్టంపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై ప్రతిపక్షాలు ఏనాడు నోరువిప్పవు. తమ పదేళ్ల పాలనలో స్వార్థ రాజకీయాలకోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో లాలూచీపడి zన కెసిఆర్ ఇప్పుడూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. గతంలో తెరవెనుకయితే, ఇప్పుడు బహిరంగంగానే బిజెపికి చేదోడుగా ఉంటున్నారు. రాష్ర్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బిఆర్‌ఎస్, బిజెపి నేతలు గైర్హాజరు కావడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేయడమే కాకుండా ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మరోసారి నిరూపితమైంది. రాష్ర్టంలో బిఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక జరిగిన పార్లమెంట్, ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయనేది బహిరంగ రహస్యమే. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి చరిత్ర సృష్టించడమే కాక, రాబోయే స్థానిక ఎన్నికల్లో 42% టికెట్లు బిసిలకు ఇస్తుందని పార్టీ ఇప్పటికే ప్రకటించినా, బిఆర్‌ఎస్, బిజెపిలు దీనిపై తమ వైఖరిని తెలపకుండా కూడబలుకుకొని కులగణన ప్రక్రియే తప్పంటూ నిరాధార ఆరోపణలకు దిగుతున్నాయి. రాష్ర్ట అభివృద్ధికి, రాజకీయాలను ముడిపెడుతూ బిఆర్‌ఎస్ తీరుతో రాష్ర్టం ఎంతో నష్టపోయింది. గతంలో కెసిఆర్ పలు సందర్భాల్లో ప్రధాన మంత్రి మోడీ రాష్ట్రానికి వస్తే ప్రోటోకాల్ పాటించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి భేషజాలకుపోకుండా రాష్ర్ట ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్ట ప్రయోజనాలకోసం కేంద్రంతో సయోధ్యగా ఉంటూనే, రాష్ర్ట ప్రయోనాలకు భంగం కలిగితేమాత్రం వెనుకంజ వేయకుండా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులతోపాటు కులగణన, బిసిలకు 42% రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రానికి అన్యాయం, యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం మొదలగు అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో తలపడడానికి కాంగ్రెస్ పోరుబాట పడుతోంది. ఈ పోరాటాలపై కాంగ్రెస్‌తో బిఆర్‌ఎస్ కలిసి వస్తుందా..? లేదా స్వార్థ రాజకీయాల కోసం రాష్ర్ట ప్రయోజనాలు తాకట్టు పెడుతుందా..? అనేది ఆ పార్టీ తేల్చుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బిసిలకు స్థానిక ఎన్నికల్లో, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లపై, ఎస్‌సి వర్గీకరణపై చట్టసభల్లో ప్రత్యేక చర్చపెట్టి తీర్మానంచేసి కేంద్రానికి పంపనుంది. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే ఈ తీర్మానాలను కేంద్రం కూడా ఆమోదించేలా బిజెపి, బిఆర్‌ఎస్ కృషి చేయాలి. దీనిపై కుట్రలకు తెరలేపితే బడుగు బలహీనవర్గాల పక్షాన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంతో తలపడడం ఖాయం. మొన్నటి ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిపి మహిళను ఎంపిక చేయడమే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తేలియజేస్తున్నది. మరోవైపు చాలాకాలం తర్వాత కెసిఆర్ బడ్జెట్ సమావేశాల కోసం శాసనసభకు రావడం సంతోషం. ఆయన ఈ సమావేశాల్లో ప్రజాభివృద్ధి కోసం ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తారని ఆశిద్దాం. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు కెటిఆర్‌లో అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదు. అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని ఆయన కాంగ్రెస్ కార్యకర్త ప్రెస్‌మీట్‌లా ఉందని గవర్నర్‌ను అవమానించడం దురదృష్టకరం. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుంటే రాష్ర్టంలో అభివృద్ధి జరగడం లేదని, హామీలు నెరవేరలేదని ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యం గా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరుగుతుందనే అక్కసుతో ఒకరు రాష్ర్ట అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. మరొకరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా కాంగ్రెస్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రాష్ర్టంలో గతంలో పదేళ్ల బిఆర్‌ఎస్ పాలన, తెలంగాణపై కేంద్రంలోని బిజెపి చూపిస్తున్న వివక్ష, పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనపై లెక్కలతో సహా చర్చకు సిద్ధం. తెలంగాణ అభివృద్ధిపై గ్లోబల్ ప్రచారంతో పదేపదే అసత్యాలతో అభాండాలు వేస్తే అవే నిజాలుగా మారుతాయనే భ్రమల్లో ఉన్న ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధిచెప్పడం ఖాయం.
– బి. మహేశ్ కుమార్ గౌడ్
(ఎంఎల్‌సి, టిపిసిసి అధ్యక్షులు)