Tuesday, March 18, 2025

పర్యాటకులపై పైశాచికత్వం

- Advertisement -
- Advertisement -

దేశంలో కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో చారిత్రక పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటిని సందర్శించడానికి విదేశాల నుంచి కొన్ని వేల మంది పర్యాటకులు వస్తుంటారు. భారత పర్యాటకరంగం ప్రస్తుతం 250 బిలియన్ డాలర్ల ఆదాయంతో వర్ధిల్లుతుండగా, మరో పదేళ్లకు 523 బిలియన్ డాలర్ల వరకు వృద్ధి చెందుతుందని అంచనా. 2023లో విదేశీ పర్యాటకులు 9.24 మిలియన్ల మంది వరకు అరుదెంచగా, 2028 నాటికి ఈ సంఖ్య 30.5 మిలియన్లకు చేరుతుందని అంచనా. 2034 నాటికి జిడిపికి రూ. 43,25,000 వరకు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. ఈ అద్భుతమైన అంచనాలు సాకారం కావాలంటే స్వదేశీ, విదేశీ పర్యాటకులకు తగిన ఆతిథ్యం నుంచి భద్రత వరకు వివిధ సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎలాంటి భయాందోళనలకు, అఘాయిత్యాలకు గురికాకుండా పర్యాటకులు స్వేచ్ఛగా, నిర్భయంగా చారిత్రక, సుందర ప్రదేశాలను సందర్శించే ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే పర్యాటకులు తమ జీవితాంతం ఈ జ్ఞాపకాలను గుర్తు పెట్టుకోగలుగుతారు. కానీ గత రెండు మూడేళ్లుగా విదేశీ పర్యాటకులపై ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుండడం భారత పర్యాటక రంగాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నాయి. దక్షిణాదిలోని హంపీ విజయనగర సామ్రాజ్య చారిత్రక ఆనవాళ్లు ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగినవి. 14 వ శతాబ్దం నుంచి 16 వ శతాబ్దం వరకు విజయనగర వైభవం వర్ధిల్లింది. ఆ సామ్రాజ్య పరిపాలకుల్లో శ్రీకృష్ణదేవరాయలు కీర్తి చిరస్మరణీయం. ఆనాటి కట్టడాల శిథిలాలను సందర్శించడానికి విదేశాల నుంచి విశేష సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి 6 వ తేదీ రాత్రి టూరిస్టులపై జరిగిన అఘాయిత్యం సంచలనం కలిగించింది. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టూరిస్టు యువతి, అమెరికా టూరిస్టు డేనియల్, నాసిక్‌కు చెందిన టూరిస్టు పంకజ్, ఒడిశాకు చెందిన బిబ్బాస్, స్థానిక హోమ్‌స్టే యజమానురాలు హంపీ సమీపంలో అనెగొంది ప్రాంతంలో మార్చి 6 వ తేదీ రాత్రి నక్షత్రాలను సందర్శించడానికి వెళ్లగా వీరిపై దుండగులు దాడి చేశారు. ఇజ్రాయెల్ టూరిస్టు యువతిపైన, హోమ్‌స్టే యజమానురాలిపైన ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్ద ఉన్న రూ. 9500 నగదు, రెండు మొబైల్ ఫోన్లను కాజేశారు. ఈ బృందంలో ఉన్న ముగ్గురు పురుషులపై దాడి చేసి వారిని తుంగభద్ర కాలువలోకి తోసేశారు.డేనియల్, పంకజ్ ప్రాణాలతో బయటపడగా బిబ్బాస్ మృతదేహం తరువాత బయటపడింది. కొప్పల్ ప్రాంతంలోని సనపుర సరస్సువద్దకు రాత్రి పూట నక్షత్రాలను సందర్శించడానికి సాధారణంగా ఎవరూ వెళ్లరని, అక్కడ చిరుత పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరిస్తుంటాయని స్థానికులు చెప్పారు. ఈ దుర్ఘటన హంపీ క్షేత్ర పర్యాటక చరిత్రలో విషాద ఘట్టంగా మిగిలింది. హంపీ సర్కిల్ ఆర్కెయాలజీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 202425 డిసెంబర్ వరకు 5.8 లక్షల స్వదేశీ టూరిస్టులు, 9357 మంది విదేశీ టూరిస్టులు హంపీని సందర్శించడానికి రాగా, వీరిలో ఇజ్రాయెల్, ఐరోపాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏటా హోలీ వేడుక జరుపుకోవడానికి హంపీకి టూరిస్టులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈసారి టూరిస్టుల సంఖ్య బాగా తగ్గింది. అత్యాచార సంఘటన కూడా దీనికి కారణం కావచ్చు. హంపీ ప్రాంతంలో అనధికార అతిథి గృహాలు ఎక్కువగా నడుస్తున్నాయి. 2020 లో తుంగభద్ర నదిలోని విరుపాపుర గడ్డి ద్వీపంలో ఏర్పాటైన అక్రమ రిసార్టులను అధికారులు కూల్చివేశారు. ఇక్కడ విస్కీ పార్టీలు, డ్రగ్ వినియోగం భారీగా జరుగుతోందని స్థానికులనుంచి ఫిర్యాదులు కూడా పోలీసులకు అందుతున్నాయి. హంపీ ప్రాంతంలో టూరిస్టులపై అత్యాచార సంఘటన మరువక ముందే హంపీ ప్రాంతంలోనే మరో ఇజ్రాయెల్ టూరిస్టు మహిళపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదిలా ఉండగా, భారత పర్యటనకు వచ్చిన ఓ బ్రిటిష్ మహిళపై ఢిల్లీలోని హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగింది. మహారాష్ట్ర, గోవాలో పర్యటించడానికి బాధితురాలు గత నెలలో భారత్‌కు చేరుకున్నారు. కొద్ది రోజుల పాటు ముంబైలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కైలాస్ అనే 24 ఏళ్ల వ్యక్తితో పరిచయం అయింది. తనను కలిసేందుకు ఢిల్లీ రావాలని కైలాస్ కోరడంతో ఆమె ఢిల్లీ చేరుకున్నారు. మహీపాల్ పుర్ ప్రాంతంలో ఓ హోటల్‌లో గది తీసుకున్నారు. తొలుత ఆ రాత్రి హోటల్‌లో పనిచేసే వ్యక్తి లిఫ్ట్‌లో తనపై లైంగికంగా దాడి చేశాడని, ఆ తర్వాత కైలాస్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2024 మార్చిలో జార్ఖండ్‌లోని దుమ్‌కా జిల్లా లో భారత్‌లో పర్యటించడానికి వచ్చిన స్పెయిన్ దంపతులపై దుండగులు దాడి చేయడమేకాక, స్పెయిన్ మహిళపై అత్యాచారం జరపడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. బీహార్ మీదుగా నేపాల్ బయలుదేరిన వీరు ప్రపంచ యాత్రకు సిద్ధ్దం అయ్యారు. దారిలో ఓ ప్రాంతంలో తాత్కాలిక గుడారంలో ఉన్న ఆమెపై స్థానిక యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దారుణంపై జార్ఖండ్ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. మొత్తం ఏడుగురు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలను పరిశీలిస్తే దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు తగిన భద్రత ప్రశ్నార్థకంగా తయారైంది. దేశం మొత్తం మీద శిక్షణ పొందిన, రిజిస్టర్ అయిన టూరిస్టు గైడ్లు ఉన్నప్పటికీ, ప్రత్యేక పోలీస్ బలగాల రక్షణ మాత్రం లోటుగా కనిపిస్తోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రం కూడా పర్యాటక ప్రదేశాలకు తగిన భద్రత కల్పించవలసిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News