Tuesday, March 18, 2025

ఎఫ్‌టిఎ చర్చలు పునఃప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఆర్థిక సంబంధాల పెంపుదల నిమిత్తం ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కోసం సంప్రదింపులను దాదాపు పది సంవత్సరాల తరువాత తిరిగి ప్రారంభించినట్లు భారత్, న్యూజిలాండ్ ఆదివారం ప్రకటించాయి. సరకులు, సేవలు, పెట్టుబడి రంగాల్లో వాణిజ్యం పెంపుదలకు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సిఇసిఎ) కోసం భారత్, న్యూజిలాండ్ 2010 ఏప్రిల్‌లో సంప్రదింపులను ప్రారంభించాయి. అయితే, పది రౌండ్ల మేరకు సంప్రదింపులు సాగించిన తరువాత చర్చలను 2015 ఫిబ్రవరిలో రెండు దేశాలు ఆపివేశాయి. ‘సమగ్ర, పరస్పర ప్రయోజనకర భారత, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కోసం సంప్రదింపులను ప్రారంభించినట్లు ప్రకటించేందుకు రెండు దేశాలు సంతోషిస్తున్నాయి’ అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రి టాడ్ మెక్‌కే సమావేశం అనంతరం ఈ ప్రకటన వచ్చింది.

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ నాలుగు రోజుల పర్యటనపై ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. ‘సప్లయి చైన్ సమగ్రత పెరుగుదల, మార్కెట్ సౌకర్యం మెరుగుదల సాధించడం భారత్, న్యూజిలాండ్ ఎఫ్‌టిఎ సంప్రదింపుల లక్షం’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది. ‘ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా వృద్ధి చెందుతూ ఏప్రిల్‌జనవరి 2025లో ఒక బిలియన్ డాలర్లను దాటడంతో ఎఫ్‌టిఎ సంప్రదింపుల లక్షం మా దేశాల పరస్పర వృద్ధి, సంపద పెంచుతూ వాణిజ్య సంస్థలు, వినియోగదారులకు కొత్త మార్గాలను తెరవడం’ అని గోయల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనీషియేటివ్ (జిటిఆర్‌ఐ) అభిప్రాయం ప్రకారం, తిరిగి ప్రారంభించిన చర్చల్లో ప్రధాన సవాల్ టారిఫ్ వ్యవస్థల్లో అంతరం అవుతుంది. న్యూజిలాండ్ సగటు దిగుమతి టారిఫ్ కేవలం 2.3 శాతం. ఆ దేశం టారిఫ్ వర్గాలలో సగంపైగా ఇప్పటికే సుంకాల రహితం. అంటే భారతీయ సరకులకు ఇప్పటికే ఆ దేశం మార్కెట్ బాగా అందుబాటులో ఉన్నది.

అందుకు భిన్నంగా భారత సగటు టారిఫ్ 17.8 శాతంగా ఉన్నది. అంటే భారత్ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించవలసి ఉంటుందన్నమాట. దీనితో సాంప్రదాయక ఎఫ్‌టిఎ భారత్‌కు అంతగా ఆకర్షణీయం కాకపోవచ్చు. ‘చర్చలు తిరిగి మొదలవుతున్నందున రెండు దేశాలు విజయవంతంగా ముందుకు సాగేందుకు ఈ సమస్యలపై ఉమ్మడి పరిష్కార మార్గం కనుగొనవలసిన అవసరం ఉంటుంది’ అని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ సూచించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 873.4 మిలియన్ డాలర్లుగా ఉన్నది. (202324లో ఎగుమతుల విలువ 538.33 మిలియన్ డాలర్లుగాను, దిగుమతుల విలువ 335 మిలియన్ డాలర్లుగాను ఉన్నాయి).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News