Tuesday, March 18, 2025

అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ జాతిపిత అయితే.. రేవంత్ బూతు పిత ఆయన దాకా వస్తే గానీ నొప్పి తెలియలేదా? ప్రధాని
మోడీని ప్రసన్నం చేసుకునేందుకే అసెంబ్లీలో రేవంత్ ప్రసంగం సంపూర్ణ రుణమాఫీ జరిగినట్టు
నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా మళ్లీ కెసిఆర్‌ను సిఎంను చేసేదాకా కెటిఆర్, నేను పోటీపడి పనిచేస్తాం
కృష్ణాజలాలు, పాలమూరు అభివృద్ధిపై పచ్చి అబద్ధాలు చెప్పారు : బిఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు మండిపడ్డారు. కెసిఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రానే రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి చావు కోరే రేవంత్ రెడ్డికి సంస్కారం ఉందా..? అని ప్రశ్నించారు. కెసిఆర్‌ను మార్చురీకి వెళ్ళాలి అని కోరుకున్న రేవంత్ ఒక్కో రోజులోనే మాట మార్చి బిఆర్‌ఎస్ పార్టీని అన్నానని అన్నారని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో, ఫార్మా సిటీ భూముల విషయంలో రోజుకో మాట మార్చారని గుర్తు చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్‌ను మార్చురీకి పంపుతా అనడం ఏంటి..? అని నిలదీశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని కెసిఆర్ గౌరవించారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఫార్మా సిటీ భూముల విషయంలో తాము అధికారంలోకి వస్తే వారి భూములు తిరిగి ఇస్తామని రైతులకు చెప్పారని, ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మరో 15 వేల ఎకరాలు సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఏమనాలని అడిగారు. ఫార్మా సిటీ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని, లేకపోతే ఫార్మా సిటీ నిర్మాణం చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని సూచించారు.

కెసిఆర్ జాతిపిత అయితే రేవంత్‌రెడ్డి బూతుపిత
రాష్ట్రానికి కెసిఆర్ జాతిపిత అయితే రేవంత్‌రెడ్డి బూతుపితగా పేరు తెచ్చుకున్నారని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కెసిఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను శనివారం శాసనసభలో రేవంత్‌రెడ్డి మార్చారని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సిఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారన్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని పదేండ్లు నంబర్ వన్‌గా నిలిపి దేశానికి ఆదర్శంగా నిలిపారని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ అని మండిపడ్డారు.స్టేట్ ఫ్యూచర్ గురించి ఆలోచించేవారు ఇలాంటి పనులు చేయరు అని, ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడరు అని పేర్కొన్నారు. కమీషన్ల కోసం బిల్లులు ఇచ్చి, మెయింటెన్సెన్స్‌కు డబ్బులు ఇవ్వక పంటలు ఎండబెడుతున్నారని, ఇదేనా స్టేట్ ఫ్యూచర్..? అని నిలదీశారు. స్టేట్ ఫ్యూచర్ పట్ల కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీకి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్ చేశామని, ప్రతి ఇంటికి తాగునీరు అందించి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. తమకు స్టేట్ ఫ్యూచర్ పట్ల బాధ్యత ఉంది కాబట్టి పని చేశామని వివరించారు. సిఎం నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయి, రైతులు, చేనేత, ఆటో కార్మికులు రోజుకు ఒకరు పిట్టల్లా రాలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ముసుగులో ఉన్న బిజెపి మనిషి రేవంత్ రెడ్డి
గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ జరిగిందనీ, కాంగ్రెస్ మాత్రం రూ.18 వేల కోట్లు మాత్రమే చేసిందని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీ విషయంలో మధిర, కొడంగల్‌కు పోదామా.. సిద్దిపేటకు పోదామా..? అంటూ సవాల్ విసిరారు. సంపూర్ణ రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, లేదంటూ కాంగ్రెస్ నేతలు ముక్కు నేలకు రాస్తారా…? అని అడిగారు. శనివారం సిఎం రేవంత్ ప్రసంగమంతా ప్రధాని మోదీ ప్రసన్నం కోసమేనని హరీష్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ముసుగు వేసుకున్న బిజెపి వ్యక్తి రేవంత్ రెడ్డి అని శనివారం సభలో బయటపడిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రేవంత్ ప్రసంగం అంతా మోదీని ప్రసన్నం కోసమే అని పేర్కొన్నారు. మోదీ మంచోడు.. కిషన్ రెడ్డి చెడ్డోడని రేవంత్ అంటారని, అటు రాహుల్ గాంధీ మాత్రం మోదీ చెడ్డ వ్యక్తి అని అంటారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో నిరుద్యోగులు రేవంత్ సర్కార్‌ను బండకేసి కొట్టారని, 15 నెలలకే రాష్ట్రానికి ఈ ప్రభుత్వం భారమైందని ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పనితనానికి నిదర్శనమని చెప్పారు. ఏకపక్షంగా తమ పార్టీ ఎంఎల్‌ఎ జగదీష్‌రెడ్డిని సస్పెండ్ చేశారన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని హరీష్‌రావు అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని ఎద్దేవా చేశారు.

మళ్లీ కెసిఆర్‌ను సిఎం చేసే దాకా నేను, కెటిఆర్ పోటీపడి పని చేస్తాం
తెలంగాణ రాష్ట్రానికి శనిలాంటి సిఎం రేవంత్ రెడ్డిని దించేదాకా.. తిరిగి కెసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేదాకా తాను, కెటిఆర్ పోటీపడి పని చేస్తామని హరీష్‌రావు తేల్చిచెప్పారు. తమ మధ్య ఎలాంటి కుమ్ములాటలు లేవు అని స్పష్టం చేశారు. తాము ఉద్యమకారులం అని, కెసిఆర్ ఆదేశాలతో గతంలో తాను మంత్రి పదవికి, రెండుసార్లు ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. కెటిఆర్, తాను కెసిఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ గల కార్యకర్తలం అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదానికి పోటీ పడుతామని వెల్లడించారు.

ఆయన వరకు వస్తే కానీ నొప్పి తెల్వదా..?
సిఎం రేవంత్ రెడ్డి బూతు ప్రసంగాలపై హరీష్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బూతులకు ఆద్యుడు రేవంత్‌రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు. జర్నలిస్టులను పట్టుకుని బట్టలిప్పదీసి రోడ్డుమీద కొడుతాం అని సంస్కారహీనంగా మాట్లాడారని, రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు. ఆ బూతులు వింటే పిల్లలు చెడిపోతున్నారని తెలిపారు. ఎదుటి వారికి భార్యాబిడ్డలు, అక్కాచెల్లెళ్లు, కుటుంబ సభ్యులు ఉండరా…ఆయన వరకు వస్తే కానీ నొప్పి తెల్వదా…? అని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్‌ను పట్టుకుని కాల్చి పారేయాలని, ప్రగతి భవన్‌ను పేల్చేయాలని మాట్లాడారని గుర్తు చేశారు. బాడీ షేమింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్‌రెడ్డి కాదా..? అని అడిగారు. మైనర్ బాలుడు అయిన కెటిఆర్ కుమారుడిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడారని, తన ఎత్తు పొడవు గురించి కూడా మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయాలలో బాడీ షేమింగ్ అవసరం ఏంటీ..? అని ప్రశ్నించారు. రాజకీయాలను కలుషితం చేసింది రేవంత్‌రెడ్డి అని, వంద ఎలుకలను తిన్న పిల్లి.. తాను శాఖహారిని అన్నట్టుగా రేవంత్ రెడ్డి నీతి సూత్రాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు.

లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చిందని హరీష్‌రావు తెలిపారు. శాఖల వారీగా లెక్కలు చెప్పేందుకు తాను సిద్ధం అని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. కెసిఆర్ సాధించిన గొప్ప విజయం 95 శాతం లోకల్ రిజర్వేషన్లు అని, గ్రూప్- 1, 2, 3 పోస్టుల భర్తీలో అచ్చంగా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది బిఆర్‌ఎస్ ప్రభుత్వ కృషి ఫలితం అని పేర్కొన్నారు. కెసిఆర్ దూరదృష్టితో చేసిన ఫలితం అని తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి 57 వేల ఉద్యోగాలు ఇచ్చారని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆరేడు వేలు మించదు అని చెప్పారు. ఉద్యోగాల కల్పన విషయంలో రేవంత్ రెడ్డి బోగస్ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించి ఎగ్గొట్టినందుకు క్షమాపణ చెప్పాలని, జాబ్ క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్‌గా మార్చారని, అందుకు నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేయమని కోరితే నిరుద్యోగుల వీపులు కమిలేలా పోలీసులతో కొట్టించావు కదా… ఇదేనా ప్రజాపాలన..? అని అడిగారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ గన్‌మెన్‌లు లేకుండా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా..? అని ప్రశ్నించారు. అక్కడికి వెళితే ఎవరి వీపులు పగులగొడుతారో తెలుస్తదని చెప్పారు. వందేళ్ల ఒయులో ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవు అని, ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా…? అని ప్రశ్నించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలనా..? అని హరీష్‌రావు నిలదీశారు.

కృష్ణ నీళ్లపై రేవంత్ అబద్ధపు ప్రచారం
కృష్ణ నీళ్లపై రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. కెసిఆర్ మహబూబ్ నగర్‌కి అన్యాయం చేశారని సిఎం అన్నారని, కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడు కాబట్టే కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీటికి రాబట్టేందుకు కాలుకు బలపం కట్టుకుని ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రిని, సుప్రీంకోర్టు మెట్లని ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి క్రాప్ ఇయర్ ప్రారంభమైందని, నీళ్లను రెండు రాష్ట్రాలు ఏవిధంగా వాడుకోవాలనే దానిపై ఢిల్లీలో సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశానికి తెలంగాణ నుండి ఎస్‌కె జోషి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్య నాథ్ దాస్ సమావేశానికి హాజరయ్యారని గుర్తు చేశారు. తెలంగాణకు నీటి పంపకాల విషయంలో అన్యాయం జరగడానికి కారణమైన ఆదిత్య నాథ్ దాస్‌ను రేవంత్‌రెడ్డి సలహాదారుగా నియమించుకున్నారని మండిపడ్డారు. ప్రాస కోసం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాతున్నారని మండిపడ్డారు. పాలమూరు కరువుకు, పాలమూరు వలసలకు కారణం కాంగ్రెస్, టిడిపి పార్టీలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News