మన తెలంగాణ/ హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ ప్రారంభమై ఇప్పటికే 17 సీజన్‌లు పూర్తయ్యాయి. 2008లో ఈ మెగా టోర్నమెంట్‌కు తెరలేచింది. 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమవుతోంది. ఈసారి పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఐపిఎల్ ప్రతిసారి అభిమానులను కనువిందు చేస్తుంది. ఈసారి కూడా ఈ టోర్నమెంట్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇరు జట్లు చెరో ఐదేసి సార్లు ట్రోఫీలను గెలుచుకున్నాయి. ప్రస్తుత ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడు ట్రోఫీలను సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, డెక్కన్ ఛార్జెస్ ఒక్కో టైటిల్‌ను గెలుచుకున్నాయి. అయితే టోర్నమెంట్ ఆరంభం నుంచి ఐపిఎల్‌లో ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించలేక పోయాయి. ఈ మూడు జట్లకు ఐపిఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ప్రతిసారి నిరాశే..
ఐపిఎల్‌లోనే అత్యంత జనాదారణ కలిగిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పేరుంది. ప్రతి సీజన్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగడం ఛాలెంజర్స్‌కు అనువాయితీగా వస్తోంది. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లి, ఎబి డివిలియర్స్, కెవిన్ పీటర్సన్, క్రిస్ గేల్, వెటోరి, డుప్లెసిస్ వంటి దిగ్గజాలు ఛాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. అయితే ఇంత మంది స్టార్ క్రికెటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నా బెంగళూరుకు ట్రోఫీ కలగానే మిగిలిపోయింది. ఐపిఎల్‌లోనే అత్యంత పటిష్టమైన జట్లలో బెంగళూరును ఒకటిగా పరిగణిస్తారు. ప్రతిసారి ఈసాలా కప్ మనదే నినాదంతో బెంగళూరు బరిలోకి దిగుతోంది. కానీ ఒక్కసారి కూడా బెంగళూరు అదృష్టం కలిసి రావడం లేదు. మూడు సార్లు ఫైనల్‌కు చేరినా ఫలితం లేకుండా పోయింది. అన్ని ఫైనల్లలోనూ ఓటమి పాలై రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2008 నుంచి ఐపిఎల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగళూరు ట్రోఫీని మాత్రం సాధించలేక పోయింది. తొలి సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అయితే ఈసారి బెంగళూరు 14 మ్యాచుల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. కానీ రెండో సీజన్‌లో కెవిన్ పీటర్సన్ జట్టుకు సారథ్యం వహించాడు. ఈసారి బెంగళూరు రన్నరప్‌గా నిలిచింది. మూడో సీజన్‌లో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. నాలుగో సీజన్‌లో మళ్లీ ఫైనల్‌కు చేరింది. అయితే ఈసారి కూడా ఫైనల్లో పరాజయం పాలై రన్నరప్‌తో సంతృప్తి చెందింది. తర్వాతి మూడు సీజన్‌లలో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. అయితే 2015లో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. 2016లో జరిగిన సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుంది.
ఆ తర్వాత మళ్లీ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిది. వరుసగా మూడు సీజన్‌లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే తర్వాతి మూడు సీజన్‌లలో ప్లేఆఫ్‌కు చేరుకుంది. 2023లో లీగ్ దశలో ఇంటిదారి పట్టింది. కానీ కిందటి సీజన్‌లో మళ్లీ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో మాత్రం ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఉంది. యువ ఆటగాడు రజత్ పటిదార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బెంగళూరు మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఈ సీజన్‌లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాడు కెప్టెన్సీ అనాసక్తి చూపించడంతో పటిదార్ సారథ్య బాధ్యతలు అప్పగించారు. అతని సారథ్యంలో బెంగళూరు ఎలా ప్రదర్శన చేస్తుందో వేచి చూడాల్సిందే.