Thursday, March 20, 2025

ఆశలు రేకెత్తిస్తున్న అంతరిక్ష అంతర్జాలం

- Advertisement -
- Advertisement -

మన దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ అందించడానికి జియో, ఎయిర్ టెల్ టెలికాం సంస్థలు ఎలాన్ మస్క్ కంపెనీకి చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరం ఉంది. మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ అందించాలంటే ప్రస్తుత సాంప్రదాయ ప్రోటోకాల్‌తో సాధ్యం కాదు. దీనికి పరిష్కారంగా ఉపగ్రహ ఆధారిత ఇంటర్‌నెట్ మాత్రమే! ఎందుకంటే దీనికి టవర్స్, కేబుల్స్ అవసరం ఉండదు. మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్‌లో కొంచెం మోడిఫికేషన్ చేసి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ పొందవచ్చు. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని మారుమూలలో ఉన్న గిరిజన ప్రాంతాలకు ఇంటర్‌నెట్ అందుబాటులోకి వస్తుంది. అలాగే నిత్యం ప్రయాణాలు చేసేవారికి వ్యాపార సంబంధిత సమాచారాన్ని పొందడానికి, గ్రామీణ ప్రజలు అన్నిరకాల ప్రభుత్వ సేవలు పొందడానికి, అధిక వేగవంతమైన ఇంటర్నెట్ అవసరమయ్యే వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రకృతి వైపరీత్యాలు, నిర్మాణ పనులు, సాంకేతిక సమస్యల కారణంగా అంతరాయాలకు గురయ్యే భూసంబంధమైన భౌతిక అడ్డుంకులకు ప్రభావితం కాదు. సవాళ్లతో కూడిన వాతావరణాలలో, అత్యవసర సమయాల్లో కూడా నిరంతరాయంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఆస్వాదించవచ్చు. ఆర్థిక అభివృద్ధి, విద్య, కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించడంలో సాయపడుతుంది. స్థిరమైన కనెక్టివిటీ అవసరమైన సముద్ర, విమానయాన పరిశ్రమలలో కూడా ఉపగ్రహ ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది. భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలపై ఆధారపడే ఒక రకమైన ఇంటర్నెట్ కనెక్షన్. సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ సిగ్నల్స్ ఉపగ్రహానికి పంపిస్తారు. అవి డిష్ ద్వారా వినియోగదారులకు చేరుతాయి. అయితే ఇది మనం అనుకున్నంత సులభం కాదు. వీటికి ఎంతో సాంకేతికతతోకూడిన ఉపగ్రహాలు అవసరం. భూమధ్యరేఖకు 22,300 మైళ్ల ఎత్తులో ఉన్న జియోస్టేషనరీ ఉపగ్రహంతో తగు పరికరాల సహాయంతో భూమిపై నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్ (నాక్) అని పిలువబడే ప్రదేశంనుండి డేటాను ప్రసారం చేసి స్వీకరించవలసి ఉంటుంది. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ సాధారణంగా వ్యక్తిగత వినియోగదారులకు భూస్థిర ఉపగ్రహాల ద్వారా అందించబడుతుంది.

ఇవి సాపేక్షంగా అధిక డేటా వేగాన్ని అందిస్తాయి. కొత్త ఉపగ్రహాలు సెకనకు 506 మెగాబిట్స్ వరకు డౌన్‌స్ట్రీమ్ డేటా వేగాన్ని సాధించడానికి ‘క్యు’ (కెయు) బ్యాండ్‌ని ఉపయోగిస్తాయి. అంతరిక్షంలో ఒక నిర్దిష్ట బిందువు వద్ద ఉపగ్రహాన్ని భూమి నుండి కదలకుండా కనిపించే కక్ష్యలో ఉంచడం వలన ఉపగ్రహం భూమిచుట్టూ ఒక కక్ష్యను ఖచ్చితంగా 24 గంటల్లో పూర్తి భ్రమణం చేస్తుంది. ఉపగ్రహం ద్వారా పంపబడిన సమాచారం కాంతి వేగంతో అంటే సుమారు సెకనుకు 1,86,000 మైళ్ళుతో నాలుగు సార్లు ప్రయాణించాలి. అంటే కంప్యూటర్ నుండి ఉపగ్రహానికి, ఉపగ్రహం నుండి నాక్ లేదా ఇంటర్నెట్‌కు, అక్కడ నుండి ఉపగ్రహానికి, చివరకు ఉపగ్రహం నుండి కంప్యూటర్‌కు తిరిగి వెళ్ళాలి. ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని జాప్యం అంటారు. ఇది దాదాపు అర సెకను.

ఉపగ్రహ ఇంటర్నెట్ వేగం సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ లేదా ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్‌ల వలే వేగంగా ఉండకపోవచ్చుగానీ భూమి మీద చాలా ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రధాన లోపాలలో ఒకటి జాప్యం. ఇది వినియోగదారు పరికరం అంతరిక్షంలో ఉపగ్రహం మధ్య డేటా సిగ్నల్‌లను ప్రసారం చేయడంలో ఆలస్యాన్ని సూచిస్తుంది. సంకేతాలు భూమి, ఉపగ్రహాల మధ్య చాలా దూరం ప్రయాణించాలి. ముఖ్యంగా జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (జియో) ఉపగ్రహాలతో గుర్తించదగిన జాప్యాలు ఏర్పడతాయి. బ్యాండ్‌విడ్త్ పరిమితులు ఇంటర్నెట్ కనెక్షన్ సామర్థ్యం, వేగాన్ని ప్రభావితం చేస్తాయి. వర్షం, మంచు, ఇతర వాతావరణ పరిస్థితులు సిగ్నల్ ప్రసారానికి అంతరాయం కలిగించవచ్చు. దీని వలన సిగ్నల్ నష్టం లేదా డేటా రేట్లు తగ్గుతాయి. ఉపగ్రహాలకు స్పష్టమైన లైన్- ఆఫ్-సైట్ ఉన్న ప్రాంతాలలో ఉపగ్రహ ఇంటర్నెట్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇది జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాలలో లేదా అడ్డంకిగా ఉండే భూభాగాలు ఉన్న ప్రాంతాలలో సవాలుగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఇంటర్నెట్ కోసం వేలాది ఉపగ్రహాలను ప్రయోగించడం వల్ల అంతరిక్ష శిథిలాలు ఢీకొనే అవకాశం గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఉపగ్రహాలు జామింగ్, హ్యాకింగ్, ఇతర సైబర్ దాడులకు గురవుతాయి. ఇవి ఇంటర్నెట్ కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తాయి. ఉపగ్రహాల విస్తరణల సంఖ్య పెరగడం వలన పరిమిత రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం కోసం పోటీ తీవ్రమవుతుంది. ఉపగ్రహ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అమలు చేయడానికి అయ్యే అధిక వ్యయం లాంటివి పరోక్షంగా వినియోగదారు అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి.

కార్యాచరణ అడ్డంకులను కలిగిస్తాయి. వీటిని అధిగమించడానికి ఉపగ్రహ ఇంటర్నెట్ యాక్సెస్‌ను మెరుగుపరచడానికి డిజిటల్ అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించడానికి వినూత్న పరిష్కారాలు, నియంత్రణ అమరిక సాంకేతిక పురోగతులు అవసరం. జాప్యాన్ని నివారించి ఇంటర్నెట్ వేగం విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు చిన్న మరింత కాంపాక్ట్ పరికరాలను వినియోగదారులకు అందిస్తున్నారు. వీటికి మోడెమ్, వైర్‌లెస్ రౌటర్, నెట్‌వర్క్ కేబుల్‌తో మాత్రమే అవసరం. భవిష్యత్తులో ఇది చౌకగా అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆశిద్దాం.

డి జనకమోహనరావు
82470 45230

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News