Tuesday, March 18, 2025

తేయాకు తోటల్లో పర్యాటకం పాగా

- Advertisement -
- Advertisement -

విశిష్ట రుచితో ప్రపంచంలోనే మేటి టీకి ప్రసిద్ధి గాంచిన, తన సంప్రదాయాలు, సంస్కృతికి తోడ్పడుతున్న కొన్ని స్వదేశీ తెగలకు నెలవు అయిన డార్జిలింగ్ తన ఖ్యాతిని, ఆకర్షణను త్వరలో కోల్పోయే ప్రమాదం ఉంది. తేయాకు తోటల్లో 30 శాతాన్ని పర్యాటకుల కేంద్రాలుగా మార్చాలన్న తన ప్రణాళికతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుకు సాగినట్లయితే ఆ ముప్పు ముంచుకు రావచ్చు. క్రితం నెల బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సమయం లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేయాకు తోటల్లో 30 శాతం భూమిని తేయాకుతో సంబంధం లేని అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రకటించారు. అయితే, టూరిజం సంబంధిత కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు తేయాకు సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అంతరాయం కలిగించదని ముఖ్యమంత్రి గత ఫిబ్రవరి 25న హామీ ఇచ్చారు.

అంతకు ముందు 2019లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తేయాకు తోటలో 15 శాతం భూమిని ‘టూరిజం అవసరాలకు’ వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. టూరిజానికి మళ్లించే భూమి గరిష్ఠంగా 150 ఎకరాలకు మించరాదని కూడా అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ఇంకా తేయాకు తోటల యజమానులు ఈ భూమిలో 40 శాతంలో నిర్మాణాలు జరపవచ్చునని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. తేయాకు పరిశ్రమనుంచి ఈ విధంగా భూమి మళ్లింపు 2019లో 15% వద్ద మొదలై 2025లో ఇప్పటికే 30 శాతానికి చేరింది. టిఎంసి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తీరును చూస్తుంటే అది త్వరలోనే మొత్తం తేయాకు తోటలను మళ్లించవచ్చు. ఇక్కడే ఆ ప్రాంతంలోని దేశీయ తెగల ప్రజలకు అసలైన ముప్పు వాటిల్లుతోంది. వారిలో 99% మందికి తమ పూర్వీకుల భూమికి సంబంధించి పర్జాపట్టా లేకుండా చేశారు. ఇప్పుడు ఆ భూమిని ‘స్వతంత్ర’ ప్రాతిపదికపై అప్పగిస్తున్నందున ప్రభుత్వం నుంచి భూమిని కొనుగోలు చేసిన బడా సంస్థలు, వాణిజ్య సంస్థలు భూమిలేని కార్మికులను వారి భూమిలో నుంచి పంపివేయవలసి ఉంటుంది.

తేయాకు పరిశ్రమలో తమ ఆర్థిక సహాయ సంస్థలకు తేయాకు తోటల భూమిని కానుకగా ఇవ్వడం ద్వారా టిఎంసి ప్రభుత్వం తోటల అసలు యజమానులైన కార్మికులు, వారి కుటుంబాలను మరింత నష్టపరిచే యత్నం చేస్తున్నది. 200 పైచిలుకు సంవత్సరాలుగా తేయాకు తోటల కార్మికులు తమ రక్తం ధారవోసి, చెమటోడ్చి, మనస్సు పెట్టి తేయాకు తోటలు నడిపారు. అయినప్పటికీ, ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘కాంగ్రెస్‌దైనా, కమ్యూనిస్టులదైనా, ఇప్పుడు టిఎంసిదైనా టీ ఎస్టేట్లలో పని చేసే కుటుంబాలకు భూమి హక్కులు మంజూరుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. స్థానిక ప్రతికూల రాజకీయ పార్టీల, తేయాకు కార్మికుల సంఘాల నాయకులు టిఎంసి ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించారు. దేశీయ గూర్ఖాలు, ఆదివాసీలు, రాజ్‌బంగ్శీలు, బెంగాలీ, రాభా, కొచె, మెచె, టోటొ, డార్జిలింగ్ కొండలు, తెరాయి, దూవర్స్ ప్రాంతాల ప్రజల ఉనికికి ఆ నిర్ణయం ముప్పు తెస్తుందని వారు ఆరోపిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో విలీనానికి ముందు డార్జిలింగ్ కొండలు, తెరాయి, దూవర్స్ ప్రాంతాలు ప్రత్యేక, విలక్షణ పరిపాలక వ్యవస్థ కింద పాలనలో ఉన్నాయి. ఆ ప్రాంతం బ్రిటిష్ రాజ్యం, సిక్కిం రాజ్యం మధ్య ‘డీడ్ ఆఫ్ గ్రాంట్’, భూటాన్‌తో సించులా సంధి వంటి వివిధ సంధుల ద్వారా పాలనలో లీజ్‌కు ఇచ్చిన భూమి కావడమే ఇందుకు కారణం. 1861 నుంచి 1870 వరకు ‘క్రమబద్ధం కాని ప్రాంతం’గాను. 1870 నుంచి 1874 వరకు క్రమబద్ధం చేసిన ప్రాంతంగాను, 1874 నుంచి 1919 వరకు షెడ్యూల్డ్ జిల్లాగాను, 1919 నుంచి 1935 వరకు వెనుకబడిన ప్రాంతంగాను, 1935 నుంచి 1947 వరకు పాక్షికంగా మినహాయించిన ప్రాంతంగాను ఆ ప్రాంతం పాలనలో ఉంది. బ్రిటిష్ వారు డార్జిలింగ్‌ను సిక్కిం ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న కారణంగా ఆ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో నేరుగా భాగంగా లేదు. తత్ఫలితంగా, తక్కిన పశ్చిమ బెంగాల్‌కు వర్తించిన చట్టాలు, నిబంధనలు నేరుగా డార్జిలింగ్‌కు వర్తించలేదు. దానికి బదులుగా బెంగాల్ గవర్నర్ అంశాల వారీగా ఆ ప్రాంతానికి ఈ చట్టాలను ప్రత్యేకంగా వర్తింపచేయవలసి ఉంటోంది. అది ఆ ప్రాంత విశిష్ట పరిపాలన చరిత్రకు దోహదం చేసింది.

1954 వరకు పశ్చిమ బెంగాల్ భూమి చట్టాలు డార్జిలింగ్ భూములకు వర్తించలేదని ఈ సందర్భంగా గమనించవలసి ఉంటుంది. ఏకీకృత ప్రాంతాల (శాసనాల) చట్టం, 1954ను ఆమోదించిన తరువాతే పశ్చిమ బెంగాల్‌లో అమలు చేసే నిబంధనలు, చట్టాలను డార్జిలింగ్‌కు కూడా వర్తింపజేశారు. 1955లో పశ్చిమ బెంగాల్ ఎస్టేట్స్ కొనుగోలు (సవరణ) చట్టాన్ని ఆమోదించినప్పుడు పశ్చిమ బెంగాల్ ఎస్టేట్స్ కొనుగోలు (సవరణ) చట్టం 1953కు సవరణ తీసుకువచ్చారు. ఆ సవరణ ఇలా ఉంది: ‘పర్వత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా చేసే ప్రకటన ప్రకారం డార్జిలింగ్ జిల్లాలోని అటువంటి ప్రాంతాల్లో ఒక మధ్యవర్తికి తన ఖాస్ ఆధీనంలో మొత్తం వ్యవసాయ భూమిని లేదా అతను ఎంపిక ప్రకారం అందులో ఏ భాగాన్నైనా అట్టిపెట్టుకునే హక్కు ఉంటుంది’.

‘మధ్యవర్తులు’ అటువంటి వ్యవసాయ భూమిపై ఆధిపత్యం ఉన్న వ్యక్తులు లేదా కౌలుదారులు అవుతారని ఇక్కడ గుర్తించడం ముఖ్యం. బ్రిటిష్ వారి హయాంలో టీ కంపెనీలకు పరిమిత వేతనాలు మంజూరు చేసినందున దాదాపు అందరు తేయాకు తోటల కార్మికులకు వారి సొంత వ్యవసాయ అవసరాలకు భూమి కేటాయింపు జరిగింది. అందువల్ల 1955 చట్టం కారణంగా 1970 దశకం వరకు దూవర్స్ ప్రాంతం కూడా కలిగి ఉన్న డార్జిలింగ్ జిల్లా ప్రజలు అందరికీ తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్న భూమికి పర్జాపట్టా కేటాయించవలసి ఉంది. కానీ అది జరగలేదు. దానికి బదులుగా రాష్ట్రం తేయాకు తోటల కార్మికులకు డార్జిలింగ్ హిల్స్, తెరాయి, దూవర్స్‌లోని డార్జిలింగ్ మెరుగుదల (డిఐ) నిధి స్థలం, అటవీ గ్రామాల్లో నివసిస్తున్నవారికి వారి పూర్వీకుల భూమికి పర్జాపట్టా హక్కును నిరాకరిస్తూనే ఉంది.

తేయాకు తోటల కార్మికులను ఈనాటికీ వెట్టి కార్మికులుగా పరిగణిస్తున్నారు. తేయాకు తోటల్లో పనిచేసేందుకు ఒక కుటుంబ సభ్యుని పంపేలా వారిని బలవంతం చేస్తున్నారు. వారు కుటుంబ సభ్యుడు ఒకరిని తేయాకు తోట లో పనికి పంపకపోతే తేయాకు తోట యాజమాన్యం తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా వారిని కోరవచ్చు. ఒక కుటుంబం తేయాకు తోటలో ఎంత కాలం సేవలు అందించిందన్నది లెక్కలోకి రాదు. తమ సొంతానిదిగా చెప్పుకునే భూమిలోనుంచి వారిని ఖాళీ చేయిస్తున్నారు. తమ కుటుంబంలో నుంచి ఎవ్వరూ ఇక ఎంతమాత్రం టీ ఎస్టేట్‌లో పని చేయకపోవడాన్ని కారణంగా చూపుతూ రిటైరైన ఒక కుటుంబానికి తమ ఇంటి మరమ్మతుకు మకైబారి టీ ఎస్టేట్ రెండు సంవత్సరాల క్రితం అనుమతి ఇవ్వలేదు. దీనితో ఆ కుటుంబం పాడుపడిన ఆ ఇంటిలోనే ఉండడమా లేక టీ ఎస్టేట్‌ను వదలి వేరే చోట ఆశ్రయం పొందడమా అన్న నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. భూమి హక్కులు లేకపోవడం తేయాకు తోటల కార్మికులను అత్యంత ప్రాథమిక పద్ధతిలో నష్టం కలిగిస్తోంది. తేయాకు తోట యజమాని గాని, ఆనాటి ప్రభుత్వం గాని వారిని ఎప్పుడైనా వెళ్లిపోవలసిందని బలవంతం చేయగలదు. అంబుజా హౌసింగ్ సారథ్యంలోని ఉత్తరాయణ్ సముదాయం కోసం మాటిగరా సమీపంలోని చాంద్‌ముని తేయాకు తోటలో నుంచి కార్మికులను వారి స్వస్థలాల్లో నుంచి గెంటివేయడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

1500 మంది కార్మికులు, వారి కుటుంబాలను (సుమారు 15 వేల మంది వ్యక్తులను) ఆ తేయాకు తోటలో నుంచి ఖాళీ చేయించారు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైనది ఏమిటంటే మీడియాలో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని సమర్థించే ఒక వర్గం ఆ నిర్ణయాన్ని హర్షించడం. తేయాకు పరిశ్రమను పునరుజ్జీవింప చేయడం, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఉపాధి కల్పనను పెంచడం ఆ నిర్ణయం లక్షమని వారు పేర్కొన్నారు. అయితే, పర్యావరణ పర్యాటకాన్ని ‘పర్యావరణాన్ని పరిరక్షించే, స్థానికుల సంక్షేమాన్ని సుస్థిరం చేసే, అన్వయానికి, విద్యకు ప్రమేయం కల్పించే ప్రకృతి సిద్ధ ప్రాంతాలకు బాధ్యతాయుత ప్రయాణం’గా నిర్వచించారు. బహుళ అంతస్తుల ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించడం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడదు, అది స్థానికుల సంక్షేమానికి దోహదం చేయదు, అది స్థానిక వనరుల కేంద్రంపై పెద్ద భారం మోపుతుంది. డార్జిలింగ్‌లో ఉత్పత్తి అయిన ప్రతి టీ ఆకును లెక్కలోకి తీసుకున్నప్పుడు, దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని వేరే చోట ఖర్చులకోసం చెల్లింపునకు మళ్లించే బదులు డార్జిలింగ్ ప్రాంతం అభివృద్ధికోసం వినియోగించినప్పుడు మాత్రమే తేయాకు పరిశ్రమ పునరుజ్జీవం జరుగుతుంది.

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News