పాకిస్తాన్‌లో ఓ రైలు హైజాక్‌కు గురైన సంఘటన యావత్ ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమాలలో మాత్రమే కనిపించే ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగిన దృష్టాంతాలు ఉన్నప్పటికీ, గత కొన్ని దశాబ్దాలలో ఇలా ఒక రైలు హైజాక్‌కు గురికావడం మాత్రం ఇదే ప్రథమమని చెప్పుకోవచ్చు. క్వెట్టానుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఉగ్రవాదులు దాడి చేసి, రైలును తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దరిమిలా, బందీలుగా చిక్కుకున్న ప్రయాణికులను విడిపించేందుకు రంగంలోకి దిగిన సైన్యానికీ, ఉగ్రవాదులకు మధ్య జరిగిన పోరులో పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వీరిలో అమాయకులైన ప్రయాణికులు కూడా ఉండటం విచారకరం. ఈ సంఘటన వెనుక ఉన్నది ఖచ్చితంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ)యేనని తెలిసి పాక్ ప్రభుత్వం విస్తుపోయి ఉంటుంది.
ఎందుకంటే, నిన్నమొన్నటి వరకూ చిన్నాచితకా దాడులకు పరిమితమైన బిఎల్‌ఎ ఒక్కసారిగా తమ పంథా మార్చి రైలును హైజాక్ చేస్తుందని పాక్ ఇంటలిజెన్స్ వర్గాలు సైతం ఊహించలేకపోయాయి. పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో అతి పెద్దది బలోచిస్తానే. ఆ దేశ భూభాగంలో 44 శాతం మేర విస్తరించి ఉన్న బలోచిస్తాన్ ప్రావిన్సు అపారమైన బంగారం, వజ్రాలు, సహజ వాయువు వంటి వనరులకు, ఎన్నో విలువైన ఖనిజాలకు పుట్టినిల్లు. అయినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పేదరికానికి చిరునామాగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే పాలకుల అలక్ష్యమే బలోచిస్తాన్‌లో వేర్పాటువాదానికి బీజం వేసింది. ఈ నేపథ్యంలో లష్కరే బలోచిస్తాన్, బలోచిస్తాన్ లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ వంటి వేర్పాటువాద సంస్థలు ఆవిర్భవించినా, ఉగ్రవాద కార్యకలాపాలతో పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది మాత్రం 2000వ సంవత్సరంలో కన్ను తెరిచిన బలోచ్ లిబరేషన్ ఆర్మీయే. పాతికేళ్లుగా హింసాత్మక దాడులకు పాల్పడుతున్న బిఎల్‌ఎను పాకిస్తాన్ సహా అమెరికా, యుకె ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. పౌరులు, పోలీసులు, సైనికులు, విదేశీయులపై విచక్షణారహితంగా దాడులు పాల్పడుతున్న బిఎల్‌ఎని తుదముట్టించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.
ఇందుకు కారణం బిఎల్‌ఎకు స్థానికుల మద్దతు ఉండటమే. ఇప్పటివరకూ స్వల్పస్థాయి దాడులకు మాత్రమే పరిమితమైన బిఎల్‌ఎ ఇటీవల వ్యూహాన్ని మార్చిందనడానికి గత నాలుగు నెలల వ్యవధిలో జరిపిన రెండు భారీ ఉగ్రదాడులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. క్వెట్టాలోని ఓ రైలు స్టేషన్‌పై నవంబర్‌లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన ఆత్మాహుతి దాడిలో 26 మందికి పైగా బలయ్యారు. గ్రేటర్ బలోచిస్తాన్ ఏర్పాటే లక్ష్యంగా సాయుధ పోరాటలు చేస్తున్న వివిధ ఉగ్రవాద దళాలు ఒక్కటై, ఐదేళ్ల క్రితం బలోచ్ నేషనల్ ఆర్మీగా ఏర్పాటు కావడంతో హింసాత్మక కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. బలోచిస్తాన్ మీదుగా సాగుతున్న చైనా- పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ పనులను ముందుకు సాగనివ్వకుండా ఎక్కడికక్కడ ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ఆస్తుల్ని కూడా ధ్వంసం చేస్తూ, పోలీసులను, సైన్యాన్ని హతమారుస్తూ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా మారారు. ఒకవైపు ఆర్థికంగా దిగజారిపోయి, అంతర్జాతీయ సంస్థల ఎదుట దేహీ అంటూ నిలబడిన పాకిస్తాన్ ప్రభుత్వానికి బలోచిస్తాన్ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు. దీంతో బలోచిస్తాన్ ఉగ్రవాదానికి భారత్ ఊతమిస్తోందంటూ ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది.
తన కొమ్మను తానే నరుక్కున్న చందంగా, భారత్‌ను అస్థిరపరచడమే లక్ష్యంగా ఏళ్ల తరబడి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినందుకు పాకిస్తాన్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఉగ్రవాదులకు కొమ్ముకాయడమంటే పాముకు పాలు పోసినట్లేనన్న నిష్ఠూర సత్యం పాక్ పాలకులకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అయినప్పటికీ చేసిన తప్పును ఒప్పుకోకుండా, ఇప్పటికీ అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై ఒంటికాలిపై లేవడం ద్వారా తన గోతిని తానే తవ్వుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంతో శాంతి కోసం చేసిన ప్రతి ప్రయత్నానికి ద్రోహమే ఎదురైందంటూ భారత ప్రధాని తాజాగా చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలనడంలో సందేహంలేదు. ఇప్పటికైనా దాయాది దేశం కళ్లుతెరిచి బలోచిస్తాన్ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించినంతమాత్రాన సరిపోదనే సత్యాన్ని గ్రహించి, బలోచిస్తాన్ ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలకు కారణాలను అన్వేషించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. బలోచిస్తాన్ అభివృద్ధి బాట పడితే, ఉగ్రవాద కార్యకలాపాలు వాటికవే సద్దుమణుగుతాయి.