న్యూఢిల్లీ: దాదాపు 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతికి చెందిన వ్యోమగామి సునిత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు వీరిరువురు తిరిగి భూమికి వస్తున్నారు. బుధవారం తెల్లావరుజామున వీళ్లు భూమ్మీదకు రానున్నారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఈ లేఖను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
సునీత విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు రావాలని మొత్తం ప్రపంచం ఎదురుచూస్తోందని.. ఆమె కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగా ఉంటారని మోదీ పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారని అన్నారు. తను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్‌ని కలిసినా.. లేదా బైడన్‌ని కలిసినా.. ఆమె ఆరోగ్యం గురించి విచారించినట్లు పేర్కొన్నారు. 140 కోట్ల భారతీయులు ఆమె సాధించిన ఘనతకు గర్వపడుతున్నారని తెలిపారు. ఆమె భర్త మైఖెల్ విలియమ్స్‌కి సునీతతో పాటు బుచ్ విల్‌మోర్‌కి కూడా ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు.