న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కశ్మీర్ అంశంపై మేం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాం. అప్పుడు వారు పాక్ దురాక్రమణను రెండు దేశాల వివాదంగా మార్చేశారు. అందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర ఉంది. ” అని ఆరోపణలు చేశారు. దాంతో భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచం చూసే దృష్టిపై దీని ప్రభావం పడిందని మండిపడ్డారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు 10న ‘రైసీనా డైలాగ్’ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి స్పందించారు.
కశ్మీర్ సమస్య విషయంలో తప్పుడు కథనాలు రూపొందించడంలో యూకె, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ కారణమని పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో భారత్ ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం క్లిష్టంగా మారిందన్నారు. అలాగే పాశ్చాత్య దేశాలు అనుసరించే ద్వంద్వ ప్రమాణాలను ఆయన ఎండగట్టారు. ఈ సందర్భంగా భారత చరిత్రను అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కశ్మీర్ సమస్యతో పాటు భారత స్వాతంత్య్ర పోరాటం… అంతర్జాతీయ సంబంధాల విషయంలో తమ విధానాన్ని ప్రభావితం చేసిందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1940ల్లో ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని భారత్ నిర్ణయించుకుందని, ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలనే తమ ఆశయానికి ఇది నిదర్శనమన్నారు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే దృఢ సంకల్పం , ప్రముఖ గ్లోబల్ పవర్‌గా ఎదగాలనే లక్షాన్ని ప్రతిబింబించేలా ఆయన ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సాస్ , అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహాతోపాటు 125 దేశాలకు చెందిన 3500 మంది ప్రతినిధులు రైసీనా డైలాగ్‌లో పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి ‘అబ్బర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓ ఆర్‌ఎఫ్ ) అనే సంస్థ దీనిని నిర్వహిస్తోంది. ‘ కాలచక్ర ప్రజలు, శాంతి, భూగోళం ’ అనే ఇతివృత్తంపై చర్చలు జరగనున్నాయి.