Thursday, March 20, 2025

గాజాపై మరో సారి విరుచుకుపడ్డ ఇజ్రాయిల్

- Advertisement -
- Advertisement -

పాలస్తీనా గాజాపై ఇజ్రాయిల్ యుద్ధవిమానాలు మరో సారి బాంబులవర్షం కురిపించడంతో దాదాపు 400 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఇజ్రాయిల్ విరుచుకుపడడం ఇదే ప్రథమం. జనవరిలో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ముగిసింది. దీంతో ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు, గాజా సిటీ, దేర్ అల్ -బలా, ఖాన్ యూనిస, రఫా నగరాలలో బాంబుల వర్షం కురిపించాయి. జనం అప్రమత్తం అయ్యేలోగానే వందలాదిమంది చనిపోయారు. జనావాసాలపై బాంబుల వర్షం కురవడంతో పిల్లలతో సహా చాలామంది చనిపోయినట్లు పాలస్తీనా వైద్యశాఖ అధికారులు తెలిపారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.దాడులు చేసేందుకు ముందు ఇజ్రాయెల్ అధికారులు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు సమాచారం ఇచ్చినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.

అంతకు ముందే.. టెర్రరిస్ట్ చర్యలను పూర్తిగా మానుకోవాలని లేని పక్షంలో భారీ నష్టం తప్పదని డోనాల్డ్ ట్రంప్ … హమాస్, ఇతర టెర్రరిస్ట్ గ్రూప్ లను, ఇరాన్ మద్దతు గల హౌతీలను హెచ్చరించారని వైట్ హౌస్ ప్రతినిధి వివరించారు. కాల్పుల విరమణ ముగియడానికి ముందే గాజాలో బందీలుగా ఉన్న 59 మంది ఇజ్రాయిలీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ , హమాస్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు నిప్పులు కక్కాయి. ఈజిప్ట్, ఖతార్ నేతృత్వంలో అమెరికా మద్దతుతో హమాస్ తో చర్చలు జరిగినా హమాస్ బందీలవిడుదలకు ససేమిరా అందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. నెతన్యాహూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, పదేపదే సైనిక దాడులు తప్పవని హెచ్చరిస్తూ, ఉద్దేశ పూర్వకంగానే బందీలను ప్రమాదంలోకి నెట్టారని హమాస్ ఆరోపించింది. తిరిగి దాడులకు తెగపడాలన్న ఇజ్రాయిల్ ప్రధాని నిర్ణయం.. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారికి మరణశాసనం కాగలదని హమాస్ తీవ్రంగా హెచ్చరించింది.

జనవరి 19న కాల్పుల విరమణ మొదలైన తర్వాత హమాస్ 33 మంది ఇజ్రాయిలీ బందీలను, ఐదుగురు థాయిలాండ్ బందీలను విడుదల చేస్తే .. ఇజ్రాయిల్ 2 వేలమంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.గాజా ఆస్పత్రులలో పరిస్థితి దారుణంగా ఉంది. మందులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. రోగులు, గాయపడిన వారికి చికిత్సచేయడం కష్టంగా ఉందని వైద్యశాఖ తెలిపింది. ఇప్పటికీ గాజా కుప్పకూలిన భవనాలతో స్మశానాన్ని తలపిస్తోంది.ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య తాజాగా 2023 అక్టోబర్ నుంచి యుద్ధం మొదలైంది. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ సరిహద్దు గ్రామాలలో విరుచుకుపడి దాడులకు తెగపడి 1200 మందిని చంపివేశారు, 251 మంది ఇజ్రాయిలీలను బందీలుగా పట్టుకున్నారు. దాంతో ఇజ్రాయెల్ వైమానిక, సైనిక దళాలు గాజాలో మారణహోమం సృష్టించి ఏకంగా 48 వేలమంది పాలస్తీనియన్లను చంపివేసింది. గాజా నగరాన్ని మట్టిదిబ్బగా మార్చింది. ఫలితంగా 23 లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News