ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకోమని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు వినూత్న నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మంగళవారం ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలంటూ స్కూటీల ఫ్లకార్డులతో వెరైటీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఎంఎల్‌సి కవిత అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఈ 15 నెలల కాలంలో లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చారు కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కనీసం రివ్యూ కూడా లేకపోవడం దారుణం అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. మీ మాటలు ఎవరూ నమ్మరని ప్రియాంక గాంధీ చేత ఈ హామీ ఇప్పించారు. ఇవాళ ప్రియాంక గాంధీనే ప్రశ్నిస్తున్నాం. మీ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా స్కూటీలు ఎక్కడా అని ప్రశ్నించారు. స్కూటీ హామీ వెంటనే అమలు చేయాలని విద్యార్థులంతా ప్రియాంక గాంధీకి లేఖలు రాస్తామని వెల్లడించారు.