Thursday, March 20, 2025

ఎంపి డికె అరుణ ఇంట్లో చొరబడిన దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ ఎంపి డికె అరుణ ఇంట్లో చొరబడిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి హమ్మర్, కట్టర్, లాక్, కీలు, మొబైల్ ఫోన్, బ్యాక్‌ప్యాక్, పర్సును స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం, కస్వా, జాస్‌పూర్‌కు చెందిన మహ్మద్ అక్రం టైల్స్ పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి వచ్చి నగరంలోని తలాబ్‌కట్ట వద్ద ఉంటున్నాడు. నిందితుడు ఢిల్లీ పలు ఇళ్లల్లో దొంగతనాలు చేయడంతో అక్కడి పోలీసులు 17కేసులు నమోదు చేశారు. అక్కడ పోలీసులు అరెస్టు చేయడంతో జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్రమ్ మీద 2004 నుంచి ఢిల్లీ పోలీసులు 17 కేసులు నమోదు చేయడమే కాకుండా ఢిల్లీలో పదే పదే పోలీసులకు దొరుకుతుండడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. దొంగతనం చేసేందుకు గుడిమల్కాపూర్ ఏరియాలో రెండు రోజులు రెక్కీ చేశాడు.

చివరకు ఎంపీ డీకే అరుణ ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంపీ ఇంటి కిచెన్ కిటికీ గుండా లోపలికి ప్రవేశించిన అక్రమ్ , మాస్క్ వేసుకొని లోపలే గంటన్నరపాటు ఉండిపోయాడు. అక్రమ్ ధనవంతుల ఇళ్లు మాత్రమే టార్గెట్ చేసి, నగదు మాత్రమే దొంగిలిస్తాడు. విలువైన వస్తువులు, నగల జోలికి పోడు, అవి అమ్మి సొమ్ము చేసుకోవడం కష్టమని భావిస్తాడు. ఎంపి డికే అరుణ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఇంట్లో కలియ తిరిగాడు, అక్కడ నగదు లభించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో శబ్దం రావడంతో నిద్రలేచిన డ్రైవర్ లక్ష్మణ్ అంతా తిరిగి చూశాడు. ఎవరూ కన్పించకపోవడంతో సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించడంతో దొంతనం విషయం తెలిసింది. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీఐపీ నివాస ప్రాంతాలతో పాటు నగరంలో పలు ఏరియాల్లో ఎలాంటి నేరాలు జరగకుండా పోలీస్ భద్రతను పెంచుతున్నామని పోలీసులు తెలిపారు.

జరిగింది ఇది…
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్56లోని డికె అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన విషయం తెలిసిందే. దొంగ తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లాజ్లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేశాడు. తర్వాత ఎంపి అరుణ బెడ్రూం వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్ చేశాడు. గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు. ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఇంట్లోనే ఆగంతకుడు చొరబడితే.. రాష్ట్రంలో భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారామె. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News