పైలాన్ కట్టిన పట్టణంలోనే నీళ్లు లేవని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్యలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతంగా మునుగోడు నియోజకవర్గం ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ కు 50 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చిందని, ఇందులో పైలాన్ కట్టిన చౌటుప్పల్ పట్టణం లోనే నీళ్లు లేవని చెప్పారు.
మిషన్ భగీరథ కోసం వేలకోట్ల రూపాయల అప్పులు చేసి నిర్మించిన ప్రాజెక్టు వల్ల కాంట్రాక్టర్లు బాగుపడ్డారు కానీ దాని ఫలితాలు ప్రజలకు సరిగ్గా అందలేదన్నారు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటం వల్ల నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చౌటుప్పల్ పట్టణానికి తాగునీటి కేటాయింపులు జరిగాయని, అక్కడ ఉన్న పరిశ్రమల వల్ల జనాభా పెరిగిందని, ఇప్పటి జనాభా ప్రాతిపదికన నీటి కేటాయింపులు లేకపోవడంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని కోరారు.