రెండు వర్గాల నడుమ మొఘల్
చక్రవర్తి ఔరంగజేబు సమాధి చిచ్చు
పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసం
హింసాకాండలో 33మంది పోలీసు
సిబ్బంది, ముగ్గురు డిసిపిలకు
గాయాలు హింసాకాండ
వ్యూహం ప్రకారం జరిగిందే
‘ఛావా’ చిత్రం ప్రజల భావోద్వేగాలను
ప్రేరేపించింది మరాఠా
రాజు నిజ చరిత్రను జనం
ముందుకు తెచ్చింది అసెంబ్లీలో
మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్
ముంబయి: నాగ్‌పూర్‌లో హింసాకాండ ప క్కావ్యూహం ప్రకారంజరిగినట్లుగా కనిపిస్తోందని, అల్లరిమూకలు నిర్దిష్ట గృహాలను లక్షం చేసుకున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం వెల్లడించా రు. ‘ఛావా’ చిత్రం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా ప్రజల భావోద్వేగాలను తిరిగి రేకెత్తించిందని ఆయన చెప్పారు. ఫడ్నవీస్ శాసనసభలో మాట్లాడుతూ, ఛత్రపతి శం భాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌ శల్ హీరోగా నిర్మించిన ‘ఛావా’ చిత్రం మరా ఠా రాజు నిజ చరిత్రను జనం ముందుకు తె చ్చిందని తెలిపారు. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీని ఔరంగజేబు వేధింపులకు గురి చేసి, హతమార్చాడు. ‘(చిత్రం) తరువాత జనంలో భావోద్వేగాలు తిరిగి రేకెత్తాయి. ఔరంగజేబుపై ఆగ్రహం భారీ ఎత్తున ప్రదర్శితమైంది’ అని సిఎంచెప్పారు. సోమవారం ఔరంగజేబు సమాధికి వ్యతిరేకంగా నిరసనలు హింసాకాండను ప్రజ్వరిల్లజేసిన తరువాత నాగ్‌పూర్ నగరంలోని పలు ప్రాంతాల్లో కర్ఫూ విధించారు. ఆ ఘటనల్లో భాగంగా పలు ఇళ్లను, వాహనాలను ధ్వంసం చేశారు.
హోమ్ శాఖను కూడా నిర్వహిస్తున్న ఫడ్నవీస్ హింసాకాండలో ముగ్గురు డిసిపిలు సహా 33 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారని, సీనియర్ అధికారి ఒకరిపై గొడ్డలితో దాడి చేశారని తెలియజేశారు. పోలీసులపై దాడి చేసినవారిని వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘మూకలు నిర్దిష్ట ఇళ్లను, సంస్థలను లక్షం చేసుకున్నాయి. దాడి పక్కా వ్యూహం ప్రకారం జరిగినట్లుగా కనిపిస్తోంది’ అని ఫడ్నవీస్ చెప్పారు. ‘దాడికి పాల్పడినవారిపై కచ్చితంగా చర్య తీసుకుంటాం. ప్రశాంతతను పునరుద్ధరిస్తున్నాం’ అని సిఎం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అవే అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ఒక నిర్దిష్ట సమాజం లక్షంగా కుట్ర జరిగిందని ఆరోపించారు. సంఘటనల క్రమాన్ని ఫడ్నవీస్ వివరిస్తూ, సోమవారం ఉదయం 11.30 గంటలకు విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), బజరంగ్ దళ్ కార్యకర్తలు నాగ్‌పూర్ మహల్ ప్రాంతంలో నిరసన ప్రదర్శన నిర్వహించారని, ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరారని తెలియజేశారు. వారు గడ్డితో ఒక సమాధి నమూనా తయారు చేపి నిప్పు అంటించారని ఆయన తెలిపారు, ఆ రోజు మధ్యాహ్నం గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కార్యకర్తలపై కేసు నమోదు చేశారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో కావాలనే, తప్పుడు చర్యలకు పాల్పడడానికి సంబంధించిన సెక్షన్‌ను వారిపై విధించారని సిఎం తెలియజేశారు. నిప్పు అంటించిన నమూనా సమాధిపై ఏవో మత పరమైన రాతలు ఉన్నాయనే వదంతిని సాయంత్రం వ్యాప్తి చేశారని,
దీనితో 200 300 మంది వ్యక్తులు నినాదాలు చేయనారంభించి హింసాకాండకు పూనుకొంటామని బెదరించారని, దానితో పోలీసులు స్వల్పంగా బలప్రయోగం చేశారని ఆయన వివరించారు. విహెచ్‌పి, బజరంగ్ దళ్ కార్యకర్తలపై ఫిర్యాదు దాఖలు చేయాలని అనుకుంటున్నందున నిరసనకారులను గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు రావలసిందిగా కోరారని ఫడ్నవీస్ తెలిపారు. ‘పోలీసులు చర్యకు ఉపక్రమిస్తుండగా హంసపురిలో 200300 మంది వ్యక్తులు రాళ్లు రువ్వారు. వారి ముఖాలు ముసుగుతో ఉన్నాయి. పదునైన ఆయుధాలతో కొంత మందిపై దాడి జరిగింది’ అని ఆయన చెప్పారు. మూడవ ఘటన భల్దర్‌పురాలో రాత్రి 7.30 గంటలకు జరిగిందని, అక్కడ 80 మంది నుంచి 100 మంది వరకు వ్యక్తులు పోలీసులపై దాడి జరిపారని, ఆ కారణంగా వారిని కట్టడి చేయడానికి బాష్పవాయువు ప్రయోగించారని, స్వల్ప బలప్రయోగం చేశారని సిఎం తెలిపారు. ‘ముగ్గురు డిసిపిలు సహా కనీసం 33 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఒక డిసిపిపై గొడ్డలితో దాడి జరిగింది’ అని ఆయన వెల్లడించారు. దాడిలో ఐదుగురు పౌరులు గాయపడినట్లు, వారిలో ఒకరిని ఐసియులో చేర్పించినట్లు ఫడ్నవీస్ తెలిపారు. గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదు చేసినట్లు, తెహసీల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు దాఖలు చేసినట్లు సిఎం చెప్పారు. 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించినట్లు ఫడ్నవీస్ తెలియజేశారు.
50 మందికి పైగా నిర్బంధం
నాగ్‌పూర్ నగరంలో ఔరంగజేబు సమాధికి వ్యతిరేకంగా నిరసనలు హింసాకాండను ప్రజ్వరిల్లజేసిన మరునాడు 50 మందికి పైగా వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫూ విధించారు. పక్కా వ్యూహం ప్రకారమే హింసాకాండ జరిగిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరోపించారు. కాగా, హింసాకాండ సందర్భంగా ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ రవీందర్ కుమార్ సింగాల్ వెల్లడించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, నాగ్‌పూర్ గార్డియన్ మంత్రి చంద్రశేఖర్ బవన్‌కులె మంగళవారం నగరంలోని ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన పోలీస్ సిబ్బందిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, హింసాకాండలో 34 మంది పోలీస్ సిబ్బంది గాయపడినట్లు తెలియజేశారు. ‘వాతావరణాన్ని విషపూరితం చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. హోమ్ శాఖ పరంగా వైఫల్యం ఏమీ లేదు. (హింసాకాండ సమయంలో) రెండు వర్గాల మధ్య రక్షణ కవచంగా పోలీసులు నిల్చున్నారు.
హింసాకాండలో పలువురు పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు’ అని ఆయన తెలిపారు. పరిస్థితి ఇప్పుడు ఒకింత ఉద్రిక్తంగా ఉందని, కానీ, తగినన్ని పోలీసు బలగాలను మోహరించడంతో నగరంలో శాంతి నెలకొన్నదని బవన్‌కులె చెప్పారు. కాగా, నగరంలోని కొత్వాలి గణేశ్‌పేట్, తెహ్‌సీల్, లకడ్‌గంజ్, పచ్‌పావోలి, శాంతి నగర్, శక్కర్‌దారా, నందన్‌వన్, ఇమామ్‌బాడా, యశోధర నగర్, కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫూ విధించినట్లు పోలీసులు తెలియజేశారు. ఇది ఇలా ఉండగా, ‘మహారాష్ట్రలో ఎవరి సమాధినీ లేదా స్మారకచిహ్నాన్నీ పాడు చేయడం లేదా ఛేదించడం సరి కాదు. ఎందుకంటే ఇది పరస్పర సౌభ్రాతృత్వాన్ని, శాంతి సామరస్యాలను దెబ్బ తీస్తుంది’ అని బిఎస్‌పి అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ‘మహారాష్ట్రను వ్యూహాత్మకంగా పెట్టుబడికి ఆకర్షణీయం కాకుండా చేసే యత్నం జరుగుతోంది. అది పొరుగు రాష్ట్రాన్ని అవకాశం తీసుకునేందుకు దోహదం చేస్తోంది’ అని శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో హింసాకాండకు ఫడ్నవీస్, ఆయన ప్రభుత్వం కారణమని రాష్ట్ర శాసన మండలిలోని ప్రతిపక్ష నాయకుడు అంబాదాస్ దన్వే ఆరోపించారు.