Thursday, March 20, 2025

గ్యారంటీలకు పెద్దపీట!

- Advertisement -
- Advertisement -

నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్, రూ.3.20లక్షల కోట్లతో పద్దు?

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.14 నిమిషాలకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనభలో ప్రవేశపెట్టనుండగా, శానసమండలిలో శాసన సభా వ్యవహారాలు, ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు అసెంబ్లీ కమిటీహాల్‌లో మంత్రివర్గం సమావేశమై రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనుంది. 202526 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3.20 లక్షల కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టగా ఈసారి అంతకంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అప్పులకు వడ్డీల కింద అధిక నిధులు కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఆరు గ్యారంటీల్లో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ అమలవుతున్నాయి. హామీల అమలుతో పాటు వ్యవసాయం, సం క్షేమ రంగాలకు తెలంగాణ బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కనుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధుల కేటాయింపు చేయనుంది. రుణమాఫీ భారం తీరడంతో ఇతర పథకాలకు, కార్యక్రమాలను నిధులను సద్దుబాటు చేయనున్నట్లు సమాచారం. మూలధన వ్యయంపై కూడా నిధులు ఖర్చు చేసేలా కార్యాచరణ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంచనాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యంతోపాటు తెలంగాణాలో సొంత పన్ను రాబడులు తగ్గిపోవడం, రిజి స్టేషన్లు, జీఎస్‌టి రాబడుల్లో తగ్గుదల కనిపిస్తోంది. అలాగే రెవెన్యూ రాబడులకు, ఖర్చుకు మధ్య భారీ తేడా ఉండటం, ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలకు మధ్య రూ.50 వేల కోట్ల వరకు లోటు ఉండటం వంటివి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా ఈసారి రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం కానున్నాయి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.20 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి రూ.19 వేల కోట్లు, విద్యుత్ రంగానికి సుమారు రూ.14 వేల కోట్లు, రవాణాకు రూ.5,800 కోట్లు, పెన్షన్ల పెంపు అమలుకు మరో రూ.8 వేల కోట్లు అవసరం వుంది. ఇక యువ వికాసానికి రూ.6 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూ.11,500 కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి, వైద్యారోగ్య రంగాలకు కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కాగా విద్యా రంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తారని చెబుతున్నారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ జీఎస్‌డిపి ప్రస్తుత ధరల ఆధారంగా రూ.14,63,963 కోట్లు, గత ఏడాదితో పోలిస్తే 11.9 శాతం వృద్ధి రేటు నమోదు కాగా జాతీయ స్థాయిలో ఇది 9.1 శాతంగా ఉంది. ఆర్థిక రంగం వృద్ధిలో దేశ సగటు 7.6 శాతం కాగా, తెలంగాణ 7.4 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. 2023- 24 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 రూపాయలుగా ఉంది. గత బడ్జెట్‌లో మొత్తం వ్యయం – రూ.2,91,159 కోట్లు కాగా అందులో రెవెన్యూ వ్యయం – రూ.2,20,945 కోట్లు, మూలధన వ్యయం – రూ.33,487 కోట్లుగా పేర్కొన్నారు.

పథకాలు కొనసాగింపునకు నిధులు : ప్రభుత్వ పథకాలను కొనసాగించేందుకు నిధుల కేటాయింపుతో పాటు ఇంకా అమలు కాని వాటి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. అందులో చేయూత పెన్షన్, మహాలక్ష్మిలో స్కీంలో భాగమైన మహిళలకు నెలకు రూ.2,500 పథకాలు అమలు కావడంలేదు. మిగతావి అమలవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసారి ఓటాన్ అకౌంట్, మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈసారి కూడా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అందుకు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల అంచనాలు, అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి ఏడాదిలోనే వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయం ఖజనాకు చేరకపోవడంతో ఈసారి బడ్జెట్ ఎంత ఉంటుంది? ఎ

క్కడెక్కడ కేటాయింపులు పెంచాలి? రాబడులకు ఉన్న అవకాశాలు ఏమిటనే దానిపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. అప్పులు, ఆదాయం అంతగా లేకుండా ఉన్న ఏపీ రూ.3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. దీంతో హైదరాబాద్ లాంటి భారీ ఆదాయం వచ్చే రాజధాని ఉండి భారీగా ఆదాయం జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్న తెలంగాణ బడ్జెట్ కచ్చితంగా రూ.3.20 లక్షల కోట్లు దాటుతుందని చెబుతున్నారు. కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ ను గతం కంటే రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.

కేంద్రం నుంచి అరకొరగానే నిధులు : రాష్ట్ర ఆదాయం అంచనాల మేరకు రాలేదు. కనీసం రూ.45 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.74 లక్షల కోట్ల రాబడి అంచనా వేసింది. అయితే 10 నెలల్లో అంచనాలు వేసిన దాంట్లో 66.57 శాతం అంటే రూ.1.82 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. మిగిలిన రెండు నెలల్లో ఇంకో 15 శాతం వచ్చినా దాదాపు 20 శాతం భారీ లోటు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News