పుడమితల్లి తన బిడ్డల కోసం నవమాసాలుగా ఎదురుచూస్తుంది. ఆకాశం వైపు వేయి కనులతో నిరీక్షించిన ఆ కనుల కల ఫలించే ఘడియ సమీపిస్తుంది. భవిష్యత్ తరాల కోసం సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం తమ జీవితాలనే పణంగా పెట్టే ఓ అరుదైన సేవలో మమేకమయమైన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల రాక కోసం ప్రపంచం ఎదురుచూస్తున్న క్షణాలివి. అంతరిక్షయానం అంటే మన ఊహకు కూడా అందని రోజుల నుండి ఆ కల సాకారయయ్యే నవీన ప్రపంచ అవిష్కృతమైన తరుణం తర్వాత అంతరిక్షంలో మానవుడు పాదం మోపిన తొలి అడుగులనుండి ఎన్నడూలేని ఉత్కంఠ ఈ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ విషయంలో నెలకొంది. అనేక ఆటంకాల తర్వాత ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ నాసా చేపట్టిన ‘క్రూ-10’ మిషన్‌లో భాగంగా భూమిపైకి వారిని తీసుకొచ్చే ప్రక్రియ మొదలుకావడం శుభపరిణామం.
ఆకాశంలో సగం కాదు తానే ఆకాశమై నింగి నుండి మహిళా లోకానికి, మనందరికీ ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపిన సునీత విలియమ్స్ స్ఫూర్తిదాయక ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శదాయకం. గుజరాత్‌కు చెందిన దీపక్ పాండ్య, స్లోవేకియాకు చెందిన బోనీ జలోకర్ దంపతులకు అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించిన సునీత మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్‌గా చేరి యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల్లో వివిధ ఎయిర్ క్రాఫ్ట్‌లపై అనుభవం తర్వాతా నాసా వ్యోమగామిగా ఎంపికైంది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ. తొలిసారి 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు ఆ తదుపరి 2012లో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్ ) లో గడిపిన పరిశోధనలు జరిపిన ధోరోదాత్తి సునీత విలియమ్స్. అంతరిక్షంలోనే కాదు సముద్ర గర్భంలోనూ పరిశోధనల కోసం నాసా టీమ్‌తో కలిసి పని చేసిన అలుపెరగని నావికాదళ అధికారిణి. రెండోసారి అంతరిక్షంలో గడిపిన 322 రోజులలో ఒక్కరోజు కూడా వ్యాయమం మానకుండా వ్యోమగాములకు ఆదర్శంగా నిలిచి మహిళా సత్తాచాటిన ధీర వనిత. ఆరు పదుల వయస్సు అంటే 60 సంవత్సరాల వయసులో ఆమె ఒకవైపు 63 సంవత్సరాల వయస్సున్న తన సహచర వ్యోమగామి బిట్ విల్మోర్‌తో కలిసి ఒకటా రెండా తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఇరుక్కుపోతే వారి మానసిక పరిస్థితి ఏంటీ..?
2024 జూన్ 5న కేవలం పదిరోజుల రోదసీ యాత్రకు బయల్దేరిన వీరు వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సుమారు 9 నెలలుకు పైగా అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి. ఓ నవీన ప్రపంచంలో ఓ మహిళకు ఈ రకమైన పరిస్థితిని ఫేస్ చేయాలంటే ఎటువంటి ఆత్మవిశ్వాసం కావాలో, ఎంతటి ఆత్మస్థైర్యం వారిలో ఉండాలో ఈ తరంతో పాటు భవిష్యత్ తరాలకు దిక్సూచిలా చూపించిన సునీత విలియమ్స్ తెగువకు హ్యట్సాఫ్. ఒకవైపు గత ప్రభుత్వం ఐఎస్‌ఎస్ లో చిక్కుకున్నవారిని తిరిగి తీసుకొచ్చే అంశాన్ని పట్టించుకోలేదని ట్రంప్ చేసిన విమర్శలు, మరోవైపు సునీతా, బల్మోర్‌లను తీసుకురావడంలో సాంకేతికంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఆందోళనకు గురిచేశాయి. తొమ్మిది నెలలకుపైగా అంతరిక్షంలో ఉండిపోవడంతో సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నది. బరువు తగ్గడంతోపాటు అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనిషి బలహీనపడుతున్నా సడలని ఆత్మవిశ్వాసం సునీత సొంతం.
భూమి ఉపరితలం నుండి 420 కి.మీ (261మైళ్లు ) దూరం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గంటకు 70 వేల కిలోమీటర్ల వేగం తో ప్రయాణించే వ్యోమనౌక నుండి దిగి ఐఎస్‌ఎస్ పరిశోధనల కోసం అలుపెరకుండా, నిబ్బరం కోల్పోకుండా పుడమిపైకి తన సందేశాలను పంపిస్తూ ఇది తమ సంతోష స్థావరం అంటూ పలకడానికి, గుండెదిగువ బాధను దిగమింగుకుని గత తొమ్మిది నెలల కాలం నుండి ఆనందాన్ని మాత్రమే పుడమిపైకి వెన్నెలల పంచుతున్న ఆ వ్యోమగాముల వ్యక్తిత్వ వికాసం మనందరికీ ఆదర్శప్రాయం. అందునా ఒక మహిళా వ్యోమగామి తన ధైర్యాన్ని, కష్టకాలంలో తన తెగువను సంతోష స్థావరంగా మార్చి మన కళ్ళముందు చిరునవ్వులను పంచడం ఇదే వ్యక్తిత్వ వికాసం. నాలుగు పదుల వయసు దాటిన ఆనాటి కల్పానా చావ్లా తన వంటగదికో, కుటుంబానికో పరిమితమై, ఏదో ఉద్యోగం చేసుకుంటూ అందరిలా బతికేయలేదు. తన కలలను సాకారం చేసుకునేందుకు పుడమి నుండి అంతరిక్షానికి పయనించింది.
విధి కాటువేసినా కోట్ల మంది హృదయాల్లో భరతమాత ముద్దుబిడ్డగా చిరంజీవిగా మిగిలిపోయారు. ఆరుపదుల వయసుదాటి రిటైర్మెంట్ స్టేజిలో ఉన్న ఇప్పటి సునీతా విలియమ్స్ హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ వేళకు తింటూ టైంకు నిద్రపోతూ గడపాలనుకోలేదు. సాహసమే జీవితమనుకుంది. గగనంపై పరిశోధనలు తన లక్ష్యం అనుకొంది. తన ప్రయాణంలో ఎదురైన సంక్లిష్ట పరిస్థితుల్లో కష్టాలను, కన్నీళ్ళను సంతోష స్థావరాలుగా మార్చుకొని రోదసీ నుండే చిరునవ్వులతో మనకో సవాల్ విసురుతుంది. చిన్నచిన్న కష్టాలకు, ఆత్మన్యూనతకు, ఒంటరితనానికి, కుటుంబ ఇబ్బందులకు కుంగిపోయే మనలాంటి సామాన్య మనుషులకు ఆత్మవిశ్వాసం నింపుకోవాలనే మహిళలకు సునీతా విలియమ్స్ ఓ మార్గదర్శి.
అడపా దుర్గ
90007 25566