గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 3.27గంటలకు క్షేమంగా భూమ్మీదకు చేరుకున్నారు. అమెరికా లోని ఫ్లోరిడా తీరంలో సాగరజలాల్లో దిగిన వీరిని స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూడ్రాగన్ ఫ్రీడమ్ సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చింది. సునీత , విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్‌ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమి పైకి చేరుకున్నారు. అంతకు ముందు ఐఎస్‌ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత , నిల్మోర్ , చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. భూమికి బయలుదేరే ముందు ఐఎస్‌ఎస్ లోని వ్యోమగాములకు సునీత, విల్మోర్, నిక్‌హేగ్, గోర్బునోవ్ వీడ్కోలు పలికారు.
అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకుని , అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో ప్రవేశించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు (హ్యాచ్)మూసుకుంది. ఉదయం 10.15 గంటలకు క్రూడ్రాగన్ … ఐఎస్‌ఎస్‌తో విడిపోవడం (అన్‌డాకింగ్) మొదలైంది. 10.35 గంటలకు పూర్తిగా విడిపోయి , భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా క్రూడ్రాగన్ ముందుభాగం లోని నాలుగు డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలన మొదలైంది. ఏడున్నర నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. తర్వాత భూ వాతావరణం లోకి ప్రవేశం (రీ ఎంట్రీ ) కోసం కోన్‌భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. రీ ఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్ర స్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థ ఆన్ అయింది. రీ ఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది.
ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల వేడి ఉత్పన్నమై, వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి (రేడియో సైలెన్స్) ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం సమర్ధంగా పనిచేసి, ఆ వేడిని తట్టుకుంది. రీ ఎంట్రీ తర్వాత రేడియో సెలెన్స్‌ను ఛేదిస్తూ కమాండర్ నిక్‌హేగ్ మాట్లాడటంతో , కమాండ్ సెంటర్‌లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. సాగరజలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా, వ్యోమనౌక లోని రెండు డ్రోగ్‌చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు .డ్రోగ్ చూట్లు సమర్ధంగా పనిచేయడంతో క్రూడ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిమీ చేరుకోగానే సాగర జలాల నుంచి 6500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. డ్రోగ్‌చూట్లు, పారాచూట్లు క్రూడ్రాగన్ వేగానికి కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్‌లో చప్పట్లు మార్మోగాయి.
ఆపై ఫ్లోరిడా లోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు. ఆపై లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్‌హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్ , సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకువచ్చారు. క్రూడ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత, ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు.