Thursday, March 20, 2025

ఢిల్లీకి మూటలు పంపేందుకే..

- Advertisement -
- Advertisement -

బడ్జెట్‌లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-
ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి వెన్నుపోటు
6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం
అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్
ఇది 40 శాతం కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్
ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు టార్గెట్‌గా ఉన్న బడ్జెట్
ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఈ బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్న చేసిన పేక మేడలా కూల్చిందని ధ్వజమెత్తారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ట్రిలియన్‌లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ట్రిలియన్ డాలర్లు అప్పు మాత్రం చేసేలాగా ఉన్నారని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో నాలుగు లక్షల 17 వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే అప్పుడు కాంగ్రెస్ నేతలు కారు కూతలు కూశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో లక్ష 60 వేల కోట్లు చేసిందని, ఈ విషయంలో సిఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని అన్నారు. శాసనసభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి కెటిఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెకట్టిన బడ్జెట్ పేదల కష్టాలను తీర్చేలా లేదని మండిపడ్డారు.

ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపేందుకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. రుణమాఫీ జరిగిందో లేదో కాంగ్రెస్ వాళ్లకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.ఏ ఒక్క ఊర్లోనైనా వందకు వందశాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే తమ శాసనసభ్యత్వాలను వదులుకుంటామని చేసిన సవాలుకు ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదని అన్నారు. అంకెలు ఎందుకు మారాయో సిఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 20 శాతం కమిషన్ పాలన దేశానికి సిగ్గుచేటు అని, ఇది 6 గ్యారంటీల అమలను పక్కనపెట్టి ఢిల్లీకి మూటలు పంపడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అని పేర్కొన్నారు. నిన్నటిదాకా 20 శాతం కమిషన్‌గా ఉన్న ప్రభుత్వాన్ని, 40 శాతం కమిషన్ ప్రభుత్వంగా మార్చి ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ఆరోపించారు. మూసి లూటిఫికేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి ప్రథమ ప్రాధాన్యం అని, ఆ లూటిఫికేషన్ ద్వారానే ఢిల్లీకి మూటలు పంపుతున్నారని పేర్కొన్నారు.

పదేళ్ల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేశారు
పదేళ్ల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేశారని కెటిఆర్ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి అసమర్థతకు, చాతకానితనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని పేర్కొన్నారు. నమ్మి ఓటేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని కాంగ్రెస్ నిలువునా ముంచిందని విమర్శించారు. రాష్ట్రంలోని పేదలు, ఆడబిడ్డలు, రైతులు, రాష్ట్ర బడ్జెట్ పట్ల ఎంతో ఆశతో ఎదురు చూశారని, కానీ భట్టి విక్రమార్క గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత ఆరు గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైందని విమర్శించారు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే మాటకు పాతరేశారని చెప్పారు. నెలకు 2500 రూపాయలు ఇస్తామని ఏ మహిళలకైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు ఆ మహిళలంతా ఈ బడ్జెట్‌ను చూసి షాక్ అయ్యారని అన్నారు.

వంద రోజుల్లో 4000 రూపాయల పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన వృద్ధులకు నిరాశ మిగిలిందని పేర్కొన్నారు. ఏ హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో ఆ హామీల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించ లేదని తెలిపారు. 6 గ్యారంటీలు నూరు రోజులు అని చెప్పి ఇప్పుడు ఆ హామీలకు పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో నేతన్నకు పెద్దపీట వేస్తూ చేనేతకు పెట్టిన బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు అని, కానీ ప్రస్తుత బడ్జెట్‌లో వారికి కేవలం 370 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. ఫ్రీ బస్సుతో ఓవైపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, కానీ వారికి హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి ఈ బడ్జెట్‌లో అతీగతి లేదని విమర్శించారు. పిఆర్‌సి గురించి, పెండింగ్‌లో ఉన్న ఐదు డిఏల గురించి బడ్జెట్‌లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని అన్నారు.

బిసిల సంఖ్యను తక్కువ చేసి చూపించారు
కులగణన పేరుతో బిసిల సంఖ్యను తక్కువ చేసి చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని దారుణంగా మోసం చేసిందని కెటిఆర్ పేర్కొన్నారు. యాదవ సోదరులకు ఇస్తానన్న గొర్ల గురించి ఈ ప్రభుత్వం బడ్జెట్‌లో పట్టించుకోలేదని చెప్పారు. వైన్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్ ఇస్తానని గౌడ్ అన్నలకు ఇచ్చిన హామీని ఈ బడ్జెట్‌లో పట్టించుకోలేదని పేర్కొన్నారు. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 12 లక్షలు దళితులకు ఇస్తామని గొప్పగా చెప్పుకొని దళితులకు వెన్నుపోటు పొడుస్తూ ఈ బడ్జెట్‌లో అంబేద్కర్ అభయ హస్తం గురించి మాట మాత్రం ప్రస్తావించలేదని విమర్శించారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ అశోక్ నగర్‌లో హామీ ఇచ్చారని,

కానీ బడ్జెట్‌లో నిరుద్యోగుల ఊసే ఎత్తడం లేదని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, చేసిన రిక్రూట్ మెంట్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఈ ప్రభుత్వం ఇస్తూ తమ ఘనతగా చెప్పుకుంటుంటే నిరుద్యోగులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్‌లో లేదని, 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రస్తావన లేదని అన్నారు. హైదరాబాద్ మహానగరం అద్వాన నగరంగా మారిందని, మున్సిపల్ శాఖను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి అసమర్థతతో పనులన్నీ పెండింగ్‌లో పడిపోయాయని ఆరోపించారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే కనీసం గోలీలు ఇచ్చే దిక్కులేదని మండిపడ్డారు.

యువ వికాసం కాదు తెలంగాణ వినాశనం
కాంగ్రెస్ కార్యకర్తలకు రూ.6 వేల కోట్లు ఇవ్వడం యువ వికాసం కాదు తెలంగాణ వినాశనం అని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం రూ.6 వేల కోట్లను పప్పు బెల్లం లాగా పంచి పెట్టాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అందాల పోటీలు పెడుతుందని, ఆ విషయాన్ని కూడా బడ్జెట్‌లో చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News