బెంగళూరు : కర్నాటక శాసనసభలో స్పీకర్ యుటి ఖాదర్ పట్ల ‘గౌరవం చూపనందుకు’ 18 మంది బిజెపి ఎంఎల్‌ఎలను ఆరు నెలల పాటు శాసనసభలో నుంచి శుక్రవారం సస్పెండ్ చేశారు. రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రతిపాదించిన సస్పెన్షన్ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ చివరి రోజు శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రతిపక్ష బిజెపి ఎంఎల్‌ఎలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్పీకర్ ఖాదర్ ఆసనం ఉన్న వేదికపైకి శాసనసభ్యులు ఎక్కి ఆయనపైకి కాగితాలు విసరివేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కేటాయింపుపై ఆగ్రహించిన ప్రతిపక్షం నిరసనకు దిగింది.
అంతకుముందు బడ్జెట్‌పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తుండగానే బిజెపి సభ్యులు ప్రభుత్వం ఒక మంత్రిని ‘హనీ ట్రాప్’లో ఇరికించే యత్నం చేసిందని ఆరోపిస్తూ సభ మధ్యంలోకి వెళ్లి నిరసన ప్రదర్శన నిర్వహించి, ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. సస్పెండైన ఎంఎల్‌ఎలలో బిజెపి చీఫ్ విప్ దొడ్డన్న గౌడ పాటిల్, సిఎన్ అశ్వథ్ నారాయణ్, ఎస్‌ఆర్ విశ్వనాథ్, బిఎ బసవరాజు, ఎంఆర్ పాటిల్, చన్నబసప్ప, బి సురేష్ గౌడ, ఉమానాథ్ కొటియన్, శరణు సలాగర్, డాక్టర్ శైలేంద్ర బెల్లదలె, సికె రామమూర్తి, యశ్‌పాల్ సువర్ణ, బిపి హరీష్, భరత్ శెట్టి, ధీరజ్ మునిరాజు, చంద్రు లమని, మునిరత్న, బసవరాజ్ మట్టిమూడ్ ఉన్నారు. ఖాదర్ సస్పెన్షన్ ఉత్తర్వు చదువుతూ, ‘ఈ సంఘటన మమ్మల్ని ఎంతగానో నొప్పించింది. బాధాకరం, ఈ సీటు కేవలం సభాపతి స్థానం కాదు. ఇది ప్రజాస్వామ్యం, సత్యం, న్యాయం ప్రతీక. ఈ పీఠం నుంచి మాట్లడడం గర్వకారణం. ప్రతి సభ్యుడు ఈ స్థానం గౌరవాన్ని, పవిత్రతను కాపాడాలి.
మేము ఎవ్వరమూ ఈ స్థానానికి అతీతులం కాదు. మా వ్యక్తిగత భావోద్వేగాలు ఈ పీఠం గౌరవాన్ని మించినవి కావు. మనం నిబద్ధత, ప్రశాంతత, నాగరిక పద్ధతిలో ప్రవర్తించాలి. ఈ సంఘటనను మనకు ఒక గుణపాఠం కావాలి. రానున్న రోజుల్లో మనం రాజ్యాంగాన్ని. ఈ పీఠం పవిత్రతను గౌరవిద్దాం’ అని పేర్కొన్నారు. ‘సభా కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని, చైర్ గౌరవాన్ని బేఖాతరు చేయడాన్ని, పార్లమెంటరీ సంప్రదాయాలకు విఘాతం కలిగించే రీతిలో ప్రవర్తించడాన్ని ఈ చైర్ సహించజాలదు’ అని ఖాదర్ తెలిపారు. అసెంబ్లీలో సస్పెండైన శాసనసభ్యులు అసెంబ్లీలోనే ఉండిపోవడంతో వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక తీర్మానాన్ని ఖండించారు. మంత్రి కెఎన్ రాజన్న ‘హనీ ట్రాప్’ అంశాన్ని లేవనెత్తిన తరువాత ప్రభుత్వం సిగ్గుపడి ఉండాలని, ఆయనను కాపాడడంలో అది విఫలమైందని అశోక్ అన్నారు.