టెహ్రాన్ :యెమెన్ లోని హూతీలపై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హూతీ తిరుగుబాటు దారుల చర్యలకు ఇరాన్‌తో ముడిపెడుతూ , తదుపరి దాడులకు పాల్పడితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. యెమెన్‌కు చెందిన హూతీలు తాము చెప్తే దాడులకు పాల్పడలేదని, ఆ విషయంలో వారికి సొంత కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాము ఎప్పుడూ ఎవరితోనూ ఘర్షణలు ప్రారంభించలేదని, అలా అని ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోమని అన్నారు. సంబంధం లేని విషయాల్లో టెహ్రాన్‌పై అనవసర ఆరోపణలు చేస్తే అమెరికాకు గట్టి దెబ్బ తగులుతుందని హెచ్చరించారు. ఇటీవల హూతీలపై అమెరికా దాడులు చేస్తోంది. హుతీల ప్రతి కదలికలను ఇరాన్ నిర్దేశిస్తోందని, ఆయుధాలు, నగదు , అత్యాధునిక సైనికసామగ్రితోపాటు నిఘా సమాచారాన్ని పంచుకుంటోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య ,నౌకాదళ నౌకలను ఏ ఉగ్రవాద దళమూ ఆపలేదని అన్నారు.