Tuesday, April 1, 2025

సుంకాలపై బింకం తగదు

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే డొనాల్డ్ ట్రంప్ ‘టారిఫ్ యుద్ధం’ ప్రారంభించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో కల్లోలం సృష్టిస్తున్నారు. అమెరికా వస్తువులపై ‘మీరెంతా సుంకం విధిస్తారో నేనూ అంతే విధిస్తా’ అంటూ అనిశ్చిత ఆర్థిక పరిస్థితులకు ఆజ్యం పోస్తున్నారు. ముఖ్యంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఈ విషయం లో కన్నెర్ర చేస్తున్నారు. భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ గా అభివర్ణించారు. ప్రపంచంలో భారత్ అంత భారీగా మరెవ్వరూ సుంకాలు విధించడం లేదని తేల్చి చెప్పారు. ‘భారత్ మాపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోంది. మా ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ. ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనకు సమయం వచ్చింది. ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయి. ఆయా దేశాలు మన ఉత్పత్తులపై ఎంత టారిఫ్‌లు విధిస్తే మనమూ తిరిగి అంతే వసూలు చేస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామ్య దేశమే అని, భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడు అని చెబుతూనే సుంకాల అసమతుల్యం విషయంలో మాత్రం సహించేది లేదని చెబుతూ వస్తున్నారు. ఆయన చేపట్టిన విస్తృత ‘అమెరికా ఫస్ట్’ విధానానికి అనువుగానే టారిఫ్ యుద్ధం ప్రారంభించారని చెప్పవచ్చు. తద్వారా తమ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2024లో, అమెరికా వాణిజ్య లోటు 784.9 బిలియన్ల డాలర్ల నుండి 918.4 బిలియన్ల డాలర్లకు పెరిగింది. అతిపెద్ద లోటు చైనాతో 295.4 బిలియన్ల డాలర్లుగా నమోదైంది. భారతదేశం కేవలం 45.7 బిలియన్ల డాలర్ల వాటాను కలిగి ఉంది. అయితే, ట్రంప్ తరచుగా భారతదేశపు అధిక సుంకాలు అమెరికన్ వస్తువులపై వాణిజ్య అడ్డంకులను విమర్శిస్తూ భారతదేశాన్ని ‘టారిఫ్ కింగ్’ అంటూ ఓ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా, ట్రంప్ సుంకాల విషయంలో నిర్మొహమాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌కు ఎటువంటి మినహాయింపు ఉండబోదని తేల్చి చెప్పారు. గతంలో ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారత్ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందని, అదంతా తన ఘనతే అని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తమ వస్తువులపై విధించే వాణిజ్య సుంకాలను న్యూఢిల్లీ తగ్గిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవంక, అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేశారు. ‘టారిఫ్‌లను తగ్గించడానికి భారత్ అంగీకరించింది’ అంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయన పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ఇరుదేశాల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని, ఎలాంటి ఒప్పందం జరగలేదని ఆయన తెలిపారు. ఈ విధంగా సుంకాల విషయమై అమెరికా – భారత్‌ల మధ్య ఓ రాజకీయ వివాదం కొనసాగుతోంది. అయితే అమెరికా అన్ని వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించాలని పట్టుబడుతుందా? లేదా రంగాల వారీగా, వస్తువుల వారీగా కోరుతుందా? అన్న విషయమై స్పష్టత లేదు. ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం ఈ దేశ ఆర్థిక వ్యవస్థపైననే ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఈ సమస్యను ఆ దేశం ఏ విధంగా పరిష్కరించుకొంటుందో చూద్దాం. కానీ, భారతదేశానికి సంబంధించినంత వరకు అత్యధిక సుంకాల పేరుతో కొద్ది మంది వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేందుకు అనుసరిస్తున్న అత్యధిక సుంకాల విధింపు విషచక్రం నుండి బయటపడి, నికార్సయిన పోటీతత్వం దేశంలో పెరిగేందుకు ఈ సుంకాల వివాదం దారితీస్తుందని ఆశిద్దాం. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) గణాంకాల ప్రకారం భారతదేశం అమెరికా కంటే గణనీయంగా ఎక్కువ సుంకాలను విధిస్తుంది.
అన్ని వస్తువులపై సాధారణ సగటు రేటు 17%. అమెరికా విధిస్తున్న దాదాపు 3.3 శాతంతో పోలిస్తే ఈ అంతరం ఏమేరకు ఉందో స్పష్టం అవుతుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఈ అంతరం అత్యధికంగా ఉంటూ వస్తోంది. సాధారణ సగటు సుంకం 39% కాగా, అమెరికాలో 4% మాత్రమే ఉంది. అందుచేత సుంకాల విషయమై భారత్ అమెరికా ఒత్తిడులకు తగ్గాల్సి వస్తే వ్యవసాయ ఉత్పత్తులపై ప్రధానంగా చెప్పుకోదగిన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్‌కు అమెరికా అతిపెద్ద వ్యవసాయ ఎగుమతి మార్కెట్. 2023- 24లో ఈ రంగంలో 3.46 బిలియన్ల డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. భారతదేశ ఎగుమతుల్లో ముఖ్యమైనవి రొయ్యలు, బాస్మతి బియ్యం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తేనె ఉన్నాయి. అమెరికా భారత దేశానికి చేసే ఎగుమతుల్లో బాదం, పత్తి, ఇథనాల్, సోయాబీన్ నూనె ఉన్నాయి. ట్రంప్ సుంకాల బెదిరింపులు నిజమైతే, భారత వ్యవసాయ ఎగుమతులు, ముఖ్యంగా రొయ్యలు వంటి సుంకం లేని వస్తువులు పోటీపడలేకపోవచ్చు.
అదే సమయంలో అమెరికా నుండి దిగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అమెరికాతో భారతదేశ వ్యవసాయ- వాణిజ్య మిగులును కుదించవచ్చు లేదా తుడిచి పెట్టవచ్చు. అందువల్ల, భారతదేశం తులనాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉన్న అనేక వ్యవసాయ వస్తువుల మార్కెట్ యాక్సెస్‌ను అడగడం ద్వారా, అమెరికా భారత దేశానికి ఎగుమతి చేయాలనుకునే ఇతర వస్తువులను సుంకాలను తగ్గించడం ద్వారా భారత దేశం తన లాభాలను పెంచుకోవడానికి వీలుగా చర్చలు జరపాల్సి ఉంటుంది. భారత దేశంలో 150% సుంకాన్ని ఆకర్షించే విస్కీని, 100 శాతం సుంకాన్ని ఆకర్షించే వాల్‌నట్‌లు, చికెన్ లెగ్‌లను, 60 శాతం సుంకాన్ని ఆకర్షించే స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను, 40 శాతం ఆకర్షించే గోధుమ, సోయాబీన్, మొక్కజొన్నలను, భారతదేశంలో జిఎం పంటల నాన్-టారిఫ్ అడ్డంకులను ఎగుమతి చేయడం అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తుంది.
భారతదేశం ముందున్న సవాల్ ఏమిటంటే, తన రైతులను రక్షించడం, అత్యంత లాభదాయకమైన ఎగుమతి మార్కెట్‌ను తెరిచి ఉంచడం మధ్య సమతుల్యతను సాధించడం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ల డాలర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక ‘మిషన్ 500’ తో విస్తృత వాణిజ్య ఒప్పందం కోసం భారతదేశం, అమెరికా ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. భారతదేశానికి మార్కెట్ యాక్సెస్ లభిస్తే, అమెరికాకు భారత్ వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి చాలా అవకాశం ఉంది. అమెరికాతో ఏర్పడిన సుంకాల వివాదాన్ని పరిష్కరించుకొని, మన విదేశీ వాణిజ్యాన్ని పరిపుష్టి కావించుకోవడం భారత్ ముందున్న తాత్కాలిక సమస్య మాత్రమే. అసలు మన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేవిధంగా చేసుకోవడం, భారత్ మార్కెట్‌లను అంతర్జాతీయ ఉత్పత్తులకు ఆకర్షణీయంగా మార్చి మన ఉత్పత్తి రంగాన్ని పోటీపడే విధంగా మలచడం మనముందున్న అసలైన సవాల్. 1991 నుండి ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్నా వాటిల్లో నిజాయితీ లోపిస్తుంది. అర్ధవంతమైన పోటీతత్వాన్ని మన మార్కెట్లలో అమలు పరచలేక పోతున్నారు.
కొందరు స్వదేశీ ఉత్పత్తిదారులు, వ్యాపారుల ప్రయోజనాలు కాపాడే విధంగా మాత్రమే మన సుంకాల విధానం ఉంటుంది. అందువల్లనే మన ప్రజలకు నాణ్యమైన వస్తువులను, అందుబాటు ధరలలో అందించలేకపోతున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లలో చవకగా దొరుకుతున్న నాణ్యమైన వస్తువులను మన వ్యాపారులను ప్రోత్సహించడం కోసం అత్యధిక ధరలలో నాణ్యత లోపించిన వస్తువులను కొనే విధంగా ఎందుకు బలవంతం చేయాలి? ఈ విషయమై మనం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. మన మార్కెట్‌లను, వ్యాపారాలను పోటీపడే విధంగా చేయడం కోసం మొదట, పరిశోధన, అభివృద్ధి పెట్టుబడులపై దృష్టి సారించాలి. మన కార్పొరేట్ రంగం పరిశోధనల కోసం చేస్తున్న పెట్టుబడులు నామమాత్రమే అని గమనించాలి. ప్రస్తుతం, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పెట్టుబడులు కలిసి వ్యవసాయ- జిడిపిలో 0.5% కంటే తక్కువగా ఉన్నాయి. అందువల్లనే మనం ప్రపంచంలో పోటీపడలేక పోతున్నాము. భారీ సుంకాలతో రక్షణ కల్పించుకోవాల్సి వస్తుంది. భారత దేశం తన వ్యవసాయ -జిడిపిలో కనీసం 1 శాతం పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడి పెట్టాలి. ఎగుమతులు వాణిజ్య రక్షణపై ఆధారపడకుండా పోటీగా ఉండేలా చూసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్న సమయంలో స్వదేశీ పరిశ్రమలకు రక్షణ కల్పించడం కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించి మన రైతులకు చెప్పుకోదగిన ధరలు లభించకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని గుర్తించాలి. రక్షణ రంగంలో, మీడియా రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్న ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌లలో మాత్రం ఎందుకు విదేశీ వ్యాపారాలు ప్రవేశించి, పోటీ పడి మన రైతులకు మంచి ధరలు లభించే విధంగా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించడం లేదు? వ్యవసాయ మార్కెట్‌లను కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా ప్రభుత్వమే ఎందుకు చేస్తుంది? క్రమంగా సుంకాలను తగ్గించుకురావడం ద్వారా మన మార్కెట్‌లను మరింత పారదర్శకంగా పనిచేసే విధంగా ప్రభుత్వం దోహదపడాలి. తద్వారా నిజమైన ఆర్థికాభివృద్ధికి మార్గం ఏర్పరచాలి.

‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలి అమెరి కా పర్యటన సందర్భంగా, ట్రంప్ సుంకాల విషయంలో నిర్మొహమాటంగా తన అభిప్రా యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌కు ఎటువంటి మినహాయింపు ఉండబో దని తేల్చి చెప్పారు. గతంలో ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారత్ పన్నులు తగ్గిం చేందుకు అంగీకరించిందని, అదంతా తన ఘనతే అని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తమ వస్తువులపై విధించే వాణిజ్య సుంకాల ను న్యూఢిల్లీ తగ్గిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవంక, అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేశారు.’

– చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News