అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ భారతీయ విద్యార్థులను భయాందోళనల్లోకి నెడుతున్నాడు. వారిని కుదురుగా చదువుకోనిచ్చేలా లేడు. యూనివర్సిటీలు, కాలేజీలలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు వణికిపోతున్నారు. కాంపస్ లలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల పేర్లు, వారి జాతీయతను గుర్తించి తెలియజేయాలని ట్రంప్ సర్కార్ డిమాండ్ చేయడం తో తమపై కఠిన చర్యలు తీసుకుంటారని భారతీయ విద్యార్థులతో పాటు, అంతర్జాతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనల్లో పాల్గొన్నవారు, యూదు విద్యార్థులను వేధింపులకు గురిచేసిన వారి పై దృష్టి పెట్టారు. విద్యార్థుల పేర్లు, జాతీయతను తెలుపాలన్న డిమాండ్ వల్ల, విద్యార్థులపై నిఘా, పర్యవేక్షణ పెరగవచ్చు, అరెస్ట్ లు చేయడమో, బహిష్కరణకు గురిచేయడమో చేస్తారేమోనని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే కొంతమంది భారతీయ విద్యార్థులు ట్రంప్ యంత్రాంగం ఆగ్రహాన్ని చవిచూడడం మరింత ఆవేదన కల్గిస్తోంది.
అమెరికాలో చాలా మంది అంతర్జాతీయ దేశాల విద్యార్థులు ఉన్నారు. భారతీయ విద్యార్థులే 3,31,602 మంది ఉన్నారు. వీరంతా భయపడుతున్నారు. ఈ మధ్యనే కొలంబియా వర్సిటీలో భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ కు చెందిన స్టూడెంట్ వీసా రద్దు చేయడంతోస్వయంగా దేశ బహిష్కరణకు గురయ్యారు. భారత సంతతికి చెందిన మరో రీసర్చ్ స్టూడెంట్ బాదర్ ఖాన్ సూరి ని హమాస్ సీనియర్ అధికారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నారు.విద్యాశాఖలో పౌరహక్కులకు సంబంధించిన సహాయ మంత్రి క్రెయిన్ ట్రైనర్ ఈ విధానాన్ని సమర్థించారు.
యూదు విద్యార్థులపై తమ దృష్టికి వచ్చిన కేసుల విషయంలో యూనివర్సిటీల పనితీరు అంచనా కోసమే ఈ విధానం పాటిస్తున్నారని పేర్కొన్నారు.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు, తర్వాత గాజాపై ఇజ్రాయిల్ మారణ హోమం పట్ల నిరసనగా వివిధ యూనివర్సిటీలలో జరిగిన నిరసన ప్రదర్శనలు ట్రంప్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అందుకే ట్రంప్ అధికారంలోకి రాగానే కొరడా ఝుళిపించారు.యూదు విద్యార్థులకు ఎలాంటి నిరసన ఎదురైనా ఆంక్షలు విధిస్తామని దాదాపు 60 యూనివర్సిటీలను విద్యాశాఖ హెచ్చరించింది. వాటిలో భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుతున్నారు.