Tuesday, April 1, 2025

ఉప ఎన్నికలు రావు

- Advertisement -
- Advertisement -

ఆనాడు పార్టీ మారిన వాళ్లను మంత్రులను చేశారు ఇప్పుడు పార్టీ మారినట్లు చెబుతున్న వారు అసలు
పార్టీనే మారలేదంటున్నారు చట్టం మారలేదు..రాజ్యాంగం మారలేదు ఏ రాజ్యాంగాన్ని
అనుసరించి ఉప ఎన్నికలు వస్తాయి? మా దృష్టి అంతా ఉప ఎన్నికలపై కాదు..అభివృద్ధిపైనే ఉంది
అసెంబ్లీలో సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని సభలో ఎలా ప్రస్తావిస్తారు?
న్యాయస్థానాన్ని అవమానించేలా సిఎం మాటలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన రేవంత్‌రెడ్డి అభ్యంతరాలు
వ్యక్తం చేసిన ఎంఎల్‌ఎ హరీశ్‌రావు సభకు కొంత ఇమ్యూనిటీ ఉంది… కోర్టులోని అంశాలనూ
ప్రస్తావించవచ్చు..రేవంత్ వివరణ సిఎం చెప్పినదాంట్లో తప్పేమీ లేదు : మంత్రి శ్రీధర్‌బాబు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని, సభ్యులు ఎ వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు తామూ ఆచరిస్తున్నామని, ఇప్పుడు ఎన్నికలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా ఉప ఎన్నికలు రానప్పుడు ఇప్పుడెలా వస్తాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అసెంబ్లీలో బుధవారం పద్దులపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ ప్రాజెక్టులపై కేసులు వేసి వాళ్లను కొండువా కప్పిన వాళ్లను మీ పార్టీలో చేర్చుకున్నారని, ఇంకా వారు మీ పక్కనే కూర్చున్నారని ముఖ్యమంత్రి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీని ఉద్దేశించి ప్రస్తావించారు. పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నారు, బి ఫాం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా, ఆనాడు పార్టీ మారితే వాళ్లను మంత్రులను చేశారని అన్నారు. ఇప్పుడు మా రినట్లు చెబుతున్న ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని చెప్పారని గుర్తు చే శారు.

మంత్రులుగా చేసిన వారిపై మీ హయాంలో అనర్హత వేటు వేయలేద ని, ఇప్పుడు మాత్రం వచ్చే వారం ఉప ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం మారలేదు, న్యాయం మారలేదు, స్పీకర్ ఆఫీస్ మారలేదు, రాజ్యాంగం అలాగే ఉంది అటువంటప్పుడు ఎలా ఉప ఎన్నికలు వస్తాయని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగాన్ని అనుసరించి ఉప ఎన్నికలు వస్తాయని ప్రశ్నించారు. 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించామో అదే సంప్రదాయాన్ని ఇప్పుడూ ఆచరిస్తామని స్పష్టం చేశారు. రూల్ బుక్ కూడా మారలేదు, అది రాసింది కూడా వారేనని ఆ బుక్‌ను సభలో రేవంత్‌రెడ్డి చూపించారు. హరీశ్‌రావు ఈ అంశం కోర్టులో ఉందని అంటున్నారని చెబుతూ అయితే ఈ సభకు కొంత ఇమ్యూనిటీ ఉంది, కొన్ని ప్రస్తావించవచ్చునని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారని, ఒకాయనైతే వచ్చే వారమే వస్తాయని చెప్పుకుంటున్నారని అన్నారు. ఇతర పార్టీ నేతలు తమతో చేరినా, చేరిన వాళ్ళు వెనక్కి వెళ్ళినా ఏం చేసినా ఉపఎన్నికలు రానే రావని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. తమ దృష్టి అంతా ఉప ఎన్నికలపై లేదని, మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే ఉందని అన్నారు.

పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన హరీశ్‌రావు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు శాసనసభలో ఏవిధంగా ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టును అవమానించేలా సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సిఎం వ్యాఖ్యలపై హరీశ్‌రావు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు. సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు రావని చెప్పడం కరెక్ట్ కాదని, అది న్యాయస్థానాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ హౌస్‌కు ఇమ్యూనిటీ ఉంది, ఈ సభలో కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చని ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు డిస్‌క్వాలిఫై కారని, గతంలోనూ కాలేదు. ఇప్పుడు కూడా కాదని సిఎం అంటే నేను వెంటనే సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని మీరు ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తే, మాకు ఇమ్యూనిటీ ఉంది, ఈ సభలో ఏదైనా మాట్లాడొచ్చని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారని ఆయన వాపోయారు. జడ్జి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఈ సభలో మాట్లాడకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హరీష్‌రావు సూచించారు.’

ముఖ్యమంత్రి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అవమానించేలా మాట్లాడారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రూల్ బుక్ చదివి వినిపించినా సిఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని హరీష్ రావు ఆరోపించారు. ఉప ఎన్నికల అంశంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో అర్థమవుతోందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి రావచ్చన్న అనుమానం ముఖ్యమంత్రికి ఉండొచ్చని, అందుకే ఉప ఎన్నికలు రావని చెబుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు. కోర్టు పరిధిని అధిగమించి ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ విషయంపై జడ్జిమెంట్ ఇచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలు అనర్హులు కాదు, ఉప ఎన్నికలు రానే రావు అని జడ్జిమెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి సుప్రీంకోర్టులో ఉన్న విషయం మీద మాట్లాడడం అసెంబ్లీ ప్రివిలేజ్ కిందకే వస్తుందని వివరించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద తాను చెప్పే ప్రయత్నం చేస్తే మధ్యలో తన మైక్ కట్ చేశారని చెప్పారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేశామని వెల్లడించారు.

సిఎం వ్యాఖ్యలను సమర్ధించిన మంత్రులు
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కూడా న్యాయవ్యవస్థపై చర్చలు జరుగుతాయని, ఆ విషయం ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. జ్యుడిషియరిని విమర్శించే హక్కు పార్లమెంట్‌లో కూడా ఉంటుందని అన్నారు. బిఆర్‌ఎస్ నేతలు బయట చేస్తున్న వ్యాఖ్యలపైనే సిఎం రేవంత్ రెడ్డి సభలో వివరణ ఇచ్చారని, ఇందులో తప్పేం లేదని మరో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రతిపక్షాల నిరసనలను తీవ్రంగా ఖండించారు. సిఎం మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని, ఉప ఎన్నికలు వస్తాయని బయట బిఆర్‌ఎస్ నాయకులు చేస్తోన్న బెదిరింపుల గురించి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంత్రుల వివరణతో సంతృప్తి చెందని బిఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News