ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు మద్దతుగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాదాపు 3000 మంది సైనికులను ఉత్తర కొరియా పంపిందని దక్షిణ కొరియా మిలిటరీ గురువారం తన తాజా అంచనాలతో తెలిపింది. ఉత్తర కొరియా మరిన్ని క్షిపణులు, ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని రష్యాకు పంపుతోందని కూడా ఆరోపించింది. కాగా పరిమిత కాల్పుల విరమణ విషయంలో రష్యా, ఉక్రెయిన్ ఇటీవల ఓ ఒప్పందానికి వచ్చాయి. అయితే అవి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు, 170 మిమీ. స్వయం చోదక హోవిట్జర్లు, 240 మిమీ. మల్టీపుల్ రాకెట్ లాంఛర్లు
220 యూనిట్లను ఉత్తర కొరియా రష్యాకు అందించింది. అంతేకాక ఉక్రెయిన్‌తో పోరాడుతున్న రష్యాకు 11000 మిలిటరీ సిబ్బందిని కూడా ఉత్తర కొరియా అందించింది. 1950-53 కొరియా యుద్ధం తర్వాత ఇంత భారీ ఎత్తున ఉత్తర కొరియా పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇదిలావుండగా డ్రోన్ల పనితీరుతో సంతృప్తి చెందిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మరిన్ని తయారు చేయడానికి ఆమోదం తెలిపారు. డ్రోన్లు, ఏఐకి ఆయన ప్రాధాన్యతను పెంచారు. ఆధునిక యుద్ధరీతికి అనుగుణంగా ఆయన తన సైన్యాన్ని తీర్చుదిద్దుతున్నారు అని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కెసిఎన్‌ఏ) పేర్కొంది.