2023-24 ఆర్థిక సంవత్సరం వ్యయాన్ని తప్పుబట్టిన
కాగ్ ఆదాయంలో 45శాతం నిధులు వడ్డీల చెల్లింపులు,
పింఛన్లు, ఉద్యోగుల వేతనాలకే కార్పొరేషన్ల పేరిట
తీసుకున్న అప్పులు ఉద్యోగుల వేతనాలకు మళ్లింపు
గత ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర అప్పులు
రూ.4,03,664కోట్లు కాగ్ నివేదికను అసెంబ్లీకి
సమర్పించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్:బడ్జెట్ ఆమోదం లేకుండా 2023-24 ఆర్థిక సవంతత్సరంలో అదనంగా రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసిందని కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ (కాగ్) త ప్పుపట్టింది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 లో ఆమోదం పొందిన బడ్జెట్ కంటే 33 శాతం అదనంగా ఖర్చు పెట్టినట్టు కాగ్ వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ ని వేదికను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరం 202324 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా చేసిన వ్యయం రూ. 2,19,307 కోట్లుగా,ఇందులో బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేసిన మొత్తం రూ. 1,11,477 కోట్లుగా కాగ్ పేర్కొంది. అంచనా వేసిన బడ్జెట్‌లో ఖర్చు చేసింది 79 శాతమని పేర్కొంది. ఇది జిఎస్‌డిపిలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొంది. ఇది బడ్జెట్‌లో ఆమోదం పొందిన దానికంటే 33 శాతం అదనంగా ఖర్చు చేసినట్టు పేర్కొంది.
అదనంగా ఖర్చు చేసిన మొత్తం రూ.1,11,477 కోట్లుగా పేర్కొంది. శాసనసభ ఆమోదం లేకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2.౩౦ లక్షల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని కాగ్ తప్పుపట్టినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా వెల్లడించిన విషయాన్ని కాగ్ తన నివేదికలో నిర్ధారించింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.35,425 కోట్ల ఓవర్ డ్రాప్ట్‌ను నాలుగున్నర నెలల పాటు వాడుకున్నట్టు కాగ్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.24,347 కోట్లు వడ్డీలకు చెల్లించినట్టు కాగ్ పేర్కొంది. రాష్ట్ర రెవిన్యూ రాబడులలో 45 శాతం నిధులను వడ్డీల చెల్లింపులు, ఫించన్లు, ఉద్యోగుల వేతనాలకే ఖర్చు చేస్తోన్నట్టు పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రాష్ట్ర అప్పులు వడ్డీ లేకుండా అసలు రూ.4,03,664 కోట్లు గా కాగ్ పేర్కొంది. ఇది జిఎస్‌డిపిలో అప్పులు 27 శాతంగా పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2022 నుంచి 2024 వరకు రెండు సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.53,144 కోట్ల అప్పు చేసిననట్టు పేర్కొంది.
2023–24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి రూ. 49,618 కోట్ల అప్పులు తీసుకున్నట్టు కాగ్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఆర్‌బిఎం 2 వందల శాతం పెరిగినట్లు పేర్కొంది. అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు రూ.2 .20 లక్షల కోట్లగా పేర్కొంది. కార్పొరేషన్ చేసిన అప్పుల నుంచి కూడా ఉద్యోగుల వేతనాల కోసం రూ.26,981 కోట్లు వినియోగించుకున్నట్టు పేర్కొంది. రాష్ట ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 61.89 శాతం కాగా, 2023–24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.9,934 కోట్లగా కాగ్ పేర్కొంది. 2023–24లో రెవెన్యూ మిగులు రూ.779 కోట్లు కాగా, రెవిన్యూ లోటు రూ49,977 కోట్లుగా కాగ్ పేర్కొంది.