Wednesday, April 2, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్‌బస్టర్ అవుతుంది: నాగచైతన్య

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ వేసవికి వినోదాల విందుని అందించడానికి ’మ్యాడ్ స్క్వేర్’ చిత్రం శుక్రవారం థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా నిర్వహించారు.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ “మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. ట్రైలర్ చాలా బాగుంది. నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్ గా ఉన్నప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. మ్యాడ్ స్క్వేర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు, మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ “ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించారు.

నార్నె నితిన్ లో మంచి ప్రతిభ ఉంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారు. మొదటి భాగంతో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్న సంగీత్ శోభన్, రెండో భాగంతో కూడా పొందుతాడు. రామ్ నితిన్ సినిమాకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తాడు. నేపథ్య సంగీతం అందించిన తమన్‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు”అని తెలిపారు. కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ “ప్రేక్షకులను ఇంకా ఎంటర్‌టైన్ చేయడానికి మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నాం. మా దర్శకుడు కళ్యాణ్ శంకర్‌కి సినిమా అంటే చాలా పిచ్చి ఉంది. అందుకే దానిని మ్యాడ్ అనే సినిమా టైటిల్ తో చూపిస్తున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు సంగీత్ శోభన్, రామ్ నితిన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News