అమరావతి: భర్త డబ్బులు అడిగితే ఇవ్వలేదని భార్య భవనం ఎక్కి దూకుతానని హల్‌చల్ చేసింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పిఎం పాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొమ్మాది వైఎస్‌ఆర్ కాలనీలోని బ్లాక్ నెం 24లో వెంకటరమణ అనే వ్యక్తి తన భార్య సూరమ్మ(41), కూతురుతో కలిసి ఉంటున్నాడు. వెంకటరమణ తాపీమేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం సూరమ్మ తన భర్తను ఐదు వందల రూపాయలు కావాలని అడిగింది.
తన దగ్గర లేవని భర్త సమాధానం చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో బ్లాక్‌లోని మూడో అంతస్తు పైకి ఎక్కి సన్ షేడ్ మీదకు దిగింది. అక్కడి దూకుతానని బెదిరించడంతో స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ భాస్కర్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అంతస్థు చేరుకొని ఇద్దరు సిబ్బంది ఎస్‌ఐని పట్టుకొని తలక్రిందులుగా వేలాడదీశారు. ఎస్‌ఐ చాకచక్యంగా ఆమె పట్టుకొని పైకి లాగాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. మహిళను రక్షించిన ఎస్‌ఐ భాస్కర్‌ను ఎసిపి అప్పలరాజు, సిఐ జి బాలకృష్ణ అభినందించారు.