Friday, April 18, 2025

లక్నో ఎన్‌ఐటి కళాశాలలో కాట్రాంతండా విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం, కాట్రాంతాండకు చెందిన కాట్రావత్ రాజు, దేవి దంపతుల కుమారుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నో ఎన్‌ఐటి కళాశాలలో ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కాట్రాం తండాకు చెందిన దేవి, రాజు కుమారుడు కాట్రావత్ అఖిల్ (20) లక్నో ఎన్‌ఐటి కళాశాలలో బిటెక్ విద్యనభ్యసిస్తున్నాడు. ఆదివారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ వేడుకలలో ఉన్న అఖిల్ తల్లిదండ్రులకు కళాశాల నుంచి ఫోన్ వచ్చింది. అఖిల్ ఆరోగ్యం బాగా లేదని.. మీరు వెంటనే రావాలని ఫోన్‌లో కళాశాల యజమాన్యం వారు సమాచారం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి సోమవారం ఉదయం లక్నోకు చేరుకున్నారు.

అప్పటికే అఖిల్ మృతి చెంది ఉన్నాడని, పోలీసులు, కళాశాల యాజమాన్యం పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. విద్యార్థి అఖిల్ కళాశాలలో జరిగిన క్రీడల్లో పాల్గొనడంతో అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడని కళాశాల యాజమాన్యం చెబుతుండగా, సీనియర్ విద్యార్థుల మితిమీరిన ర్యాగింగ్ వల్లనే మృతి చెంది ఉండవచ్చని బంధువులు, తండావాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ మృతి వార్త తెలియడంతో తండాలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోమవారం రాత్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించగా, మంగళవారం కాట్రాంతండాకు చేరుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News