ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో కొనసాగుతున్న తీవ్ర నిర్బంధం నేపథ్యంలో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రకటించింది. గతంలో కూడా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సల్స్‌ను శాంతి చర్చలకు ఆహ్వానించడం ముఖాముఖి చర్చలు జరగడం తెలిసిందే. కానీ అవి చివరకు ఫలించలేదు. ఇప్పుడు మావోయిస్టుల్లో కూడా ఎన్నడూ లేని విధంగా నిస్పృహ ఆవరించినట్టు చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఇటీవల ఎన్‌కౌంటర్‌లో బయటపడిన ఒక లేఖ బట్టి తెలుస్తోంది. నక్సలైట్లకు సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయిందని ఆ లేఖ వెల్లడించింది. అయితే ఇప్పుడు శాంతి చర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) డిమాండ్ చేసింది.
ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా విడుదల చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే మావోలు కొన్ని షరతులు విధించారు. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్‌ను ఆపేయాలని డిమాండ్ చేశారు. విప్లవ ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కొత్త క్యాంపులు ఏర్పాటు చేయొద్దన్నారు. ఈ షరతులకు ఒప్పుకుంటే తక్షణమే కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించారు. ఆపరేషన్ కగార్ పేరుతో సాధారణ ఆదివాసీ ప్రజానీకంతోపాటు అగ్రనేతల వరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, అనేక మందిని చిత్రహింసలకు గురిచేసి చంపేస్తున్నారని, అందుకే ఈ యుద్ధాన్ని జినోసైడ్ (నరసంహారం)గా పేర్కొంటున్నట్టు వెల్లడించింది.
ఈ లేఖకు చత్తీస్‌గఢ్ సిఎం విజయశర్మ స్పందించారు. మొదట ఈ లేఖ సాధికారత ఎంతవరకు ఉందో పరిశీలిస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో శాంతి చర్చలకు మావోయిస్టులు పిలుపునిచ్చారన్నారు. అయితే ఇప్పుడు శాంతి చర్చలకు మావోయిస్టులు విధించిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేది లేదన్నారు. గతంలో ప్రభుత్వం శాంతిచర్చల కోసం కమిటీలను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు మావోయిస్టులే శాంతి చర్చలకు సిద్ధం అవుతుంటే వారు ఒక కమిటీ లేదా ఒక ప్రతినిధిని నియమించాలని ముఖ్యమంత్రి విజయశర్మ సూచించారు. 2026 మార్చి 31 లోగా చత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు అన్నవారెవరూ లేకుండా నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు భద్రతా దళాలు నిత్యం దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. ప్రభుత్వం ఒకవైపు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం కల్పిస్తూ మరోవైపు నక్సల్ గాలింపు ముమ్మరం చేసింది. ఈ ద్విముఖ వ్యూహం బాగానే పని చేసిందని చెప్పవచ్చు. ఇదంతా ఒక్క రోజులోనే జరిగిందనడం పొరపాటు. నిఘా వర్గాలను బలోపేతం చేశారు. భద్రతా దళాల సాయంతో మావోల పట్టున్న ప్రాంతాలను నిర్వీర్యం చేయగలిగారు. అత్యాధునిక డ్రోన్లు, నిఘా పరికరాలు, కృత్రిమ మేథ, ఉపగ్రహ ఛాయాచిత్రాల వంటి సాయంతో నక్సల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. అలాగే నక్సల్స్ ఆర్థిక మూలాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఎన్‌ఐఎ, ఇడి వంటి కేంద్ర సంస్థలు కొన్ని కోట్ల రూపాయల నిధులను స్వాధీనం చేసుకుంటున్నాయి.నక్సల్స్‌కు ఆర్థిక సాయం అందిస్తున్న వారిని కూడా కట్టడి చేయగలిగారు.
ఇవన్నీ ఒకవైపు సాగిస్తూనే నక్సల్ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు బాగా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో ఆయా ప్రాంతాల్లో దాదాపు 11,503 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 20 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల అక్కడి ప్రజల జీవన విధానాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. వెయ్యికి పైగా బ్యాంకు శాఖలు, 937 ఎటిఎంల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. 20042014 మధ్యకాలంతో పోలిస్తే ఇప్పుడు హింసాత్మక సంఘటనలు సగానికి సగం తగ్గాయి. ఏడాది కాలంలోనే చత్తీస్‌గఢ్ ప్రాంతంలో 380 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు.
1194 మంది అరెస్టు కాగా, 1045 మంది లొంగిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే నక్సలిజ ప్రభావం చాలా వరకు తగ్గిందనే చెప్పవచ్చు. ఒకప్పుడు మావోయిజానికి ఆదివాసీ యువకులు విపరీతంగా ఆకర్షితులయ్యేవారు. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. భూస్వాములకు వ్యతిరేకంగా వర్గపోరాటం సాగించడమే లక్షంగా నక్సల్స్ సాగుతున్నప్పటికీ చత్తీస్‌గఢ్‌లో ధనిక రైతులే తప్ప భూస్వాములు ఎవరూ లేరు. ఇప్పుడు అటవీ భూముల్లోని ఖనిజాల కోసం ఆరాటం పడుతున్న కార్పొరేట్ సంస్థల పైనే ఆదివాసీలు వర్గ పోరాటం చేయాలి. లేదా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై పోరాటం చేయాలి. కానీ ఆర్థిక బలోపేతమే ముఖ్యమనుకుంటున్న ప్రజల ఆలోచనలు ఈ పోరాటాలకు కలిసిరావడం లేదు.
ప్రభుత్వ పథకాలపైనే దృష్టి పెడుతున్నారు. ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలవడం దీనికి ఉదాహరణ. అలాగే నక్సల్స్ పేరుతో దొరికినవారందరినీ పిట్టల్లా కాల్చి చంపినంత మాత్రాన విప్లవ ఉద్యమాలు ఆగిపోవు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కడ జరిగినా ఎదిరించడానికి పోరాటాలు సాగుతూనే ఉంటాయి. బాధితులు, ధీనులు, అణగారిన ప్రజలు తమ తరఫున పోరాడే వారికి ఆశ్రయం కల్పిస్తూనే ఉంటారు. విప్లవ భావజాలంతో మళ్లీ మళ్లీ చైతన్యవంతులవుతూనే ఉంటారు. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పరిశీలిస్తేనే శాంతికి మార్గం ఏర్పడుతుంది.