మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో దంతేవాడలో పర్యటిస్తున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బస్తర్ పణ్‌డూమ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని అమిత్‌షా ఉద్ఘాటించారు. “ బస్తర్‌లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయి.
ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని మావోయిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా మాలో భాగమే. ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం లేదు. ఆయుధాలు అడ్డం పెట్టుకొని స్థానిక గిరిజనుల అభివృద్ధిని ఆపలేరు ” అని అమిత్ షా పేర్కొన్నారు. లొంగిపోయి అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందన్నారు. గతేడాది మొత్తంగా 881 మంది మావోయిస్టులు లొంగిపోగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 521 మంది లొంగిపోయినట్టు చెప్పారు.
50 ఏళ్లుగా అభివృద్ధికి దూరం…
50 ఏళ్లుగా బస్తర్ అభివృద్ధికి దూరమైందన్న అమిత్‌షా… వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న నిశ్చయంతో ప్రధాని మోడీ ఉన్నారని చెప్పారు. అయితే స్థానికులు వైద్య, విద్య సదుపాయాలతోపాటు ఆధార్, రేషన్ కార్డులు , ఆరోగ్యబీమా పొందినప్పుడే ఇది సాధ్యమవుతుందన్న ఆయన… నక్సల్స్ సమస్య తొలగిపోతేనే బస్తర్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక మావోయిస్టు రహిత గ్రామాల్లో రూ. కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఛత్తీస్‌గఢ్ సిఎం విష్ణుదేవ్ సాయ్ హామీ ఇచ్చారు.