ప్రభుత్వ భూములు అంటే ప్రజల ఆస్తి. ప్రజలే ఎన్నుకునే రాజకీయ పార్టీలు అధికారంలో తాముండే ఐదు సంవత్సరాలు ఆ భూములు తమ సొంతం అని భావిస్తే పప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం భూముల వివాదం సుప్రీం కోర్టు కల్పించుకొని ఆగ్రహించిన కారణంగా తాత్కాలికంగా వాయిదాపడింది. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని లేదా ప్రయత్నించిన పద్ధతిని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. ఈ నెల 16 వరకు కేసు వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించవలసి ఉంది. అయినా విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను ప్రభుత్వాలు తిరిగి తీసుకుని వేరేవాళ్లకు ఇవ్వడం, అక్రమంగా కబ్జాలకు గురికావడం ఇవాళ తెలంగాణలో కొత్తగా జరుగుతున్న వ్యవహారం ఏమీ కాదు. గతంలో ఉస్మానియా యూనివర్శిటీ, ఓపెన్ యూనివర్శిటీ భూములకు ఇలా రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు హెచ్ సియు భూమి విషయంలో విచారణ చేస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలోని ఇద్దరు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క ఇదే విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు. భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న ప్రభుత్వంలో ఈ పూర్వ విద్యార్థులు ఇద్దరూ భాగస్వాములుగా ఉంటే ప్రస్తుత విద్యార్థులు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.’
ఈ మంత్రుల కమిటీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రజా సంఘాలు తదితరులతో చర్చిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఈ పని భూముల స్వాధీన కార్యక్రమం మొదలుపెట్టడానికి ముందు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంమీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విమర్శలు వచ్చి ఉండేవి కాదు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, రాజకీయపక్షాలవారూ ఉన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాలు ఏమి ఉండవు. సరే, పర్యావరణవేత్తల దగ్గరికి వచ్చేసరికి కొన్ని సందర్భాలలో వీరు ప్రవర్తించే తీరు విచిత్రంగా ఉంటుంది. ఈ పర్యావరణ ఉద్యమకారులు రెండు రకాలుగా ఉంటారు అన్నారు డాక్టర్ బాలగోపాల్ ఒక సందర్భంలో. పర్యావరణాన్ని ప్రజలకోసం కాపాడాలనుకునేవారు, పర్యావరణాన్ని ప్రజలనుండి కాపాడాలనుకునేవారు ఈ రెండు రకాలు. ప్రజలకోసమే కాపాడాలనుకున్న పర్యావరణాన్ని తెలిసో తెలియకో ధ్వంసం చేసే చర్యల గురించి ప్రజలకు హితం చెప్పవలసిన అవసరం రావచ్చు. అది వేరే సంగతి కానీ, పర్యావరణాన్ని ప్రజలకోసం కాక ప్రజలనుండి కాపాడాలనుకునేవారికి ప్రజలు వట్టి న్యూసెన్స్‌గా మాత్రమే కనిపిస్తారు అంటారు డాక్టర్ బాలగోపాల్.
పర్యావరణవేత్తల విషయం అలా పెడితే ఇక మూడో రకం రాజకీయ పక్షాలు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని కొంత భూభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న వ్యవహారంలో తాజాగా ప్రతిపక్షంలో కూర్చున్న, దశాబ్ద కాలం అధికారం చలాయించిన భారత రాష్ట్ర సమితి గురించి మాట్లాడుకోవాలి. అలాగే ఈ వ్యవహారాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయి జాతీయ సమస్యగా సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన భారతీయ జనతా పార్టీని గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రాంతీయశక్తిగా భారత రాష్ట్ర సమితి తాను అధికారంలో ఉండగా చేసిన పనులన్నిటినీ మర్చిపోయి మాట్లాడుతున్నది. రాజకీయ పార్టీలన్నిటికీ అలవాటేనేమో తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించడం. 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే 2015 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు
హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించి, తాము తలపెట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ఎటువంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములను రాష్ట్రమంతటా గుర్తించాలని, ఎన్ని భూములు ఉన్నాయో తమకు లెక్క చెప్పాలని ఒక ఫర్మాన జారీ చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు కలెక్టర్లు యుద్ధప్రాతిపదికన భూములను గుర్తించి ఏలినవారికి నివేదిక అందజేశారు. ఆ తర్వాత కాలంలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1743 చోట్ల 12,500 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి రూ. 14,500 కోట్ల నిధులు సేకరించాలని ఆలోచిస్తున్నదని, అందులో హైదరాబాద్‌లోనే 363 చోట్ల 417 ఎకరాల భూమి ఉందని ఒక ప్రముఖ దినపత్రిక 2017లోనే ప్రత్యేక వార్త ప్రచురించింది.
హైదరాబాద్‌లో గుర్తించిన 417 ఎకరాల భూమిలో అత్యధిక భాగం ఆ తర్వాత తాను అధికారంలో ఉన్న కాలంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమ్మేసింది. ఇక్కడ భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకుల్లో ఒకరు, మాజీ మంత్రి కెటి రామారావు ప్రస్తుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూవివాదం మీద స్పందిస్తూ చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకోవాలి. ఆ భూములు ఎవరూ కొనొద్దని, కొన్నా తమ ప్రభుత్వం రాగానే దాన్ని స్వాధీనం చేసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఇంకో నాలుగేళ్ల తరువాత ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కెటి రామారావు గారి మాటల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన పార్టీ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అమ్మిన భూములను తిరిగి వాపస్ తీసుకునేందుకు ప్రయత్నం మొదలుపెడితే ఏం జరుగుతుంది?
ప్రజల అవసరాల కోసం కాకుండా ఏ ప్రభుత్వం భూములు అమ్మినా సరే దాన్ని నిలువరించవలసిందే.
అందుకోసం జరిగే ప్రజా ఉద్యమాలను తప్పుపట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు రాజకీయ ప్రయోజనాలో, స్వార్థ ప్రయోజనాలో ఉండవు. కానీ కొన్ని సందర్భాలలో వీరి వెనకాల రాజకీయపక్షాలు చేరి ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా వాడుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుంటాయి. దానినుండి హెచ్ సియు విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది.ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఏర్పడినట్టే 1999 నుంచి 2004 వరకు తమకు మిత్రపక్షంగా ఉండిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నకాలంలో ఇదే హెచ్‌సియు భూముల విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యవహారాన్ని బిజెపి నాయకులు కావాలనే మర్చిపోయినట్టున్నారు. తమ మిత్రుడిగా ఉండగానే ఆయన హెచ్‌సియులోని ఈ 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మిన వ్యవహారంలో ఆ తర్వాత జరిగిన రగడ అందరికీ తెలిసిందే. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆ భూముల అమ్మకాన్ని రద్దు చేసింది. అది మరిచిపోయి, భూమి పుట్టిన తర్వాతి ఇదేదో మొదటిసారిగా ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని ఢిల్లీ వీధుల్లో గొంతు చించుకుంటున్న బిజెపి నాయకులు ఒకసారి చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకాన్ని కూడా గుర్తు చేసుకుంటే మంచిది.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. 2023లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల దురాక్రమణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం ప్రారంభించినందుకు అభినందనలు అందుకున్నారు. అలాగే మూసీ ప్రక్షాళనకు నడుంకట్టి మరింత మెప్పు పొందారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు అది ప్రజల ఆస్తి కాబట్టి దాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ కమిటీ ఏదో ముందే వేసి అన్నివర్గాలతో మాట్లాడిన తర్వాత ఈ పనికి పూనుకొని ఉంటే ఆయన ప్రతిష్ఠ మూడింతలు పెరిగి ఉండేది. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే సరిపోదు, అలా ఉన్నామని ప్రదర్శించుకోవాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాలలో ఉంటుంది. అది మన ఏలికలు మర్చిపోతూ ఉంటారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉన్న భూభాగం విషయానికొద్దాం. 1974లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా
ఉన్న కాలంలో ఆరు సూత్రాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైన ఈ యూనివర్శిటీకి 2300కు పైగా ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో ఎక్కువ భాగం అటవీ సంపద ఉన్నది. దీన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని అభినందించాల్సిందే. వాళ్ల చదువు సాగినంత కాలమే అక్కడ ఉంటారు. ఆ తర్వాత జీవనోపాధి వెతుక్కుంటూ వెళ్లిపోతారు. వాళ్లకి అక్కడి భూముల విషయంలో స్వప్రయోజనాలు ఏవీ ఉండవు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా కాకుండా అందులోని ప్రభుత్వ భూమిని గుర్తించి అటవీ సంపదకు ఎటువంటి హాని కలగని విధంగా అందరినీ మెప్పించి ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వ భూములు అశేష ప్రజానీకపు అవసరాలకు ఉపయోగపడాలి. అంతేతప్ప, రాజకీయపక్షాలు అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల అమలుకోసం ప్రభుత్వ భూములను తెగనమ్మి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం ఎప్పుడూ, ఎక్కడా సమర్ధనీయం కాదు.